ఆధార్, సీబుక్, లెసైన్స్ తెస్తేనే పెట్రోల్

ఆధార్, సీబుక్, లెసైన్స్ తెస్తేనే పెట్రోల్ - Sakshi


సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:పెట్రోల్ బంకుల్లో ఆధార్ వివరాల నమోదు ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాహనదారుల వివరాల కోసమే ఈ ప్రక్రియ ప్రారంభించామని ప్రభుత్వం చెబుతున్నా దీని వెనుక మరో ప్రధాన ఉద్దేశం ఉందన్న వాదన వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల కోత.. రుణమాఫీలో కోత వంటి చర్యలకు దిగిన టీడీపీ ప్రభుత్వం వాహనాదారులకు ఆధార్ అనుసంధానం చేయడం ద్వారా రేషన్ కార్డుల రద్దుకు పూనుకోనుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 100 సీసీ(హార్స్‌పవర్), ఆపైన వాహనాలున్న వారికి త్వరలో రేషన్‌కార్డు కట్ చేస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణ, ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్న వారినిగుర్తించేందుకు, లెసైన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నవారిని నియంత్రించేందుకు, వాహన భద్రత, వాహన ం చోరీకి గురైతే పసిగట్టేందుకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. కానీ దీని వెనుక ఉన్న రేషన్ కార్డుల వ్యూహం, ఆధార్ అనుసంధాన ప్రక్రియ అస్తవ్యస్తంగా సాగుతుండటమే విమర్శలకు తావిస్తున్నాయి.

 

 ఆధార్ సేకరణ ఇలా..

 జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం పట్టణంలో మంగళవారం నుంచి, జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో బుధవారం నుంచి వాహనాలకు ఆధార్ అనుసంధానం ప్రారంభమైంది. జిల్లాలో ఉన్న 83 పెట్రోల్ బంకుల్లో ఈ కార్యక్రమం చేపట్టామని అధికారులు చెబుతున్నారు. దీని కోసం మెప్మా (పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ) నిధులు, సిబ్బందిని సమకూరుస్తుండగా రవాణాశాఖ అధికారులు అజమాయిషీ చేస్తూ అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. తొలుత పెలైట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో ఇంటింటి సర్వే చేపట్టినా  సత్ఫలితాలివ్వకపోవడంతో ఇంధనం కోసం పెట్రోల్ బంకులకు వచ్చే వాహనదారుల నుంచి ఆధార్, డ్రైవింగ్ లెసైన్సు, సీ-బుక్ (రిజిస్ట్రేషన్ పత్రం) వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, రవాణా శాఖ కమిషనర్, మెప్మా ఉన్నతాధికారులు కలిసి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. దీన్ని పక్కాగా అమలు చేయాలని ఐదు రోజుల క్రితమే ఆదేశాలు వచ్చాయి. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల పరిధిలో 22, ఇతర ప్రాంతాల్లో 51 బంకులున్నాయి. ఒక్కో బంకుకు రోజుకు సగటున 50 వాహనాలొస్తుంటాయని అంచనా. ఆ మేరకు సిబ్బందిని కేటాయించారు. 15 రోజుల్లో జిల్లాలో ఈ ప్రక్రియ పూర్తిచే స్తామని, ఆ తరువాత ఇంటింటి సర్వే కూడా చేయిస్తామని అధికారులు చెబుతున్నారు.

 

 కొత్త వాహనాలకు ఆధార్ జెరాక్సు కాపీ రవాణాశాఖ కార్యాలయంలో సమర్పించినా, ఆ శాఖ వెబ్‌సైట్‌లో ఆధార్ నెంబర్ అప్‌లోడ్ చేసినా సరిపోతుందని కూడా చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల వాహనాలు కలిపి లక్ష వరకు ఉండగా ఇంతవరకు 30 శాతం మాత్రమే ఆధార్ అనుసంధానం చేయగలిగామని, పెట్రోల్ బంకుల ద్వారా శతశాతం సీడింగ్ చేస్తామని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో విచిత్రమేమిటంటే వాహనం సెకెండ్ హ్యాండ్‌లో అమ్మే సమయంలోనూ, ఏదైనా ఓ సంస్థ టోకున వాహనాలు కొనుగోలు చేసి తమ సిబ్బందికి అందజేసినా ఈ ఆధార్ అనుసంధాన నిబంధన వర్తించదని అధికారులే చెబుతున్నారు.

 

 ఖర్చు తడిసిమోపెడు

 ఈ కార్యక్రమానికి నిధులు, సిబ్బంది అంతా మెప్మాయే సమకూరుస్తోంది. ఒక్కో బంకులో ఇద్దరు చొప్పున మెప్మా నియమించింది. వాస్తవానికి అనాథలు, వికలాంగులకు ఈ అవకాశం ఇవ్వాలి. కానీ మెప్మా పరిధిలోని సంఘాల సభ్యులు, వారి రక్త సంబంధీకులకు ఈ పని అప్పగించారు. బంకులకు వచ్చే వాహనదారుల నుంచి వివరాలు సేకరించి, నెట్లో అప్‌లోడ్ చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు రూ.10 చెల్లిస్తారు. ఇందులో రిజిస్ట్రేషన్ ప్రక్రియకు రూ.5, ఖాతాల నిర్వహణకు రూ.2, అప్‌లోడ్ చేసేందుకు రూ.3 చెల్లించాలన్నది నిబంధన. వీరి పనితీరు పర్యవేక్షణకు ప్రతి ఐదు బంకులకు ఒక సూపర్‌వైజర్‌ను నియమించారు. వీరికి రోజుకు రూ.1000చెల్లించాలని నిర్ణయించారు. ఇది భారీ మొత్తమేనని కొందరు అధికారులే అంగీకరిస్తున్నారు. రోజుకు ఐదు బంకులు తిరిగి అక్కడి సిబ్బంది పనితీరు పరిశీలించేందుకే వెయ్యి చెల్లిస్తున్నారంటేనే ఎంత భారీగా నిధులు వృథా అవుతాయో తేలిపోతుంది. కాగా ఈ ప్రక్రియలో టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సూచించిన సభ్యులకే స్థానం కల్పిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఒక్కో బంకులో రవాణాశాఖ తరఫున ఓ హోంగార్డు ఉండాలి. ఇలా జిల్లాలోని 83 బంకులకు హోంగార్డులను నియమించాలంటే ఖర్చు తడిసి మోపెడు. అంతమంది హోంగార్డులు కూడా లేరు.

 

 వాహనదారుల ఇబ్బందులు

 అన్ని పత్రాలు తెస్తేనే పెట్రోలు పోస్తామని బంకుల నిర్వహకులు చెబుతున్నారు. ఒకసారి పత్రాలు లేవని చెప్పినా, రెండోసారి వచ్చేటప్పుడు తప్పదని హెచ్చరిస్తున్నారు. అయితే దీన్ని ఎవరు పర్యవేక్షిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మెప్మా ఆధ్వర్యంలో మంగళవారం నుంచి బంకుల్లో స్లిప్పులు జారీ చేస్తున్నారు. అన్ని వివరాలు సమర్పించిన వాహనదారులు మూడు నెలల పాటు ఆ స్లిప్పు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. దాన్ని చూపిస్తేనే బంకుల్లో పెట్రోల్ ఇస్తారని కూడా చెబుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top