కదం తొక్కినఆదర్శరైతులు


విశాఖపట్నం : ఆదర్శ రైతులు కదం తొక్కారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జీవో నెం.43ను వెనక్కి తీసుకుని ప్రభుత్వం ఆదర్శ రైతు వ్యవస్థను కొనసాగించాలని నినాదాలు చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఆదర్శ రైతుల సంఘం అధ్యక్షుడు బుద్ద ఆదినాయుడు మాట్లాడుతూ స్వామినాథన్ కమిటీ సిఫారసు మేరకు అవతరించిన ఆదర్శ రైతు వ్యవస్థ వల్ల మండలాల్లో వ్యవసాయాభివృద్ధిపై రైతులకు అవగాహన పెరిగిందన్నారు.



వ్యవసాయాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఆదర్శ రైతు వ్యవస్థను తెలుగుదేశం ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమన్నారు. ఎప్పటికైనా తమ గౌరవ వేతనం పెరిగి రెగ్యులర్ అవుతుందన్న ఆశతో పనిచేస్తున్నామన్నారు.  తమలో డిగ్రీ, పీజీ చదివిన వారు కూడా ఉన్నారని, గౌరవ వేతనం రూ.1000కి పెంచి పని కల్పిస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.



ఒక దశలో కలెక్టరేట్‌లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు  అడ్డుకున్నారు. దీంతో కలెక్టరేట్ ఎదుట కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు ఆదర్శ రైతులను పోలీసులు అరెస్టు చేసి విశాఖ మహారాణి పేట పోలీస్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు బోర రవి, చోడవరం మండల అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, సీహెచ్. పైడితల్లినాయుడు, వందల సంఖ్యలో ఆదర్శ రైతులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top