తరలిపోయిన డబ్బు.. 683 కోట్లు!

తరలిపోయిన డబ్బు.. 683 కోట్లు! - Sakshi


విశాఖపట్నం కేంద్రంగా సాగిన మనీలాండరింగ్ వ్యవహారంలో మొత్తం 683 కోట్ల రూపాయలు దేశం నుంచి విదేశాలకు తరలిపోయిందని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. అందులో ఒక్క కెనరా బ్యాంకు నుంచే రూ. 533 కోట్లు వెళ్లాయని ఆయన చెప్పారు. ఈ స్కాం దర్యాప్తు వివరాలను ఆయన శుక్రవారం నాడు విజయవాడలో మీడియాకు వివరించారు. మన రాష్ట్రం నుంచి డబ్బు విదేశాలకు వెళ్తున్నట్లు ఆదాయపన్ను శాఖ గుర్తించిందని, కొంతమంది బోగస్ కంపెనీలు పెట్టి ఫోర్జరీ పేపర్లు తయారుచేసి, వాటినే నిజమైన పత్రాలుగా చూపించి డబ్బును విదేశాలకు తరలించారని ఆయన చెప్పారు. ఐటీ శాఖ విచారణ చేసి ఈడీ ద్వారా ఈ వ్యవహారాన్ని అడ్డుకుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీ విభాగం దర్యాప్తు చేస్తోందని, మొత్తం 17 మంది నిందితులను సీఐడీ అధికారులు పట్టుకుని విచారణ చేస్తున్నారని తెలిపారు.



ఈ కేసులో ఆయుష్ గోయల్‌, వినీత్ గోయెంకా, వికాస్ గుప్తాలను ప్రధాన నిందితులుగా భావిస్తున్నామని, అయితే కేసు దర్యాప్తు పూర్తయితే గానీ అసలు నిందితులు వేరే ఎవరైనా ఉన్నారా, వీళ్లేనా అన్న విషయం ఖరారు కాదని ఆయన అన్నారు. ఈ ముగ్గురిలో ఒకరి పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నామన్నారు. వడ్డి మహేష్, అతడి తండ్రి శ్రీనివాసరావు తదితరులను కూడా పట్టుకున్నామని చెప్పారు. వీరిలో శ్రీనివాసరావు కోల్‌కతాలో ట్రాన్స్‌పోర్టర్‌గా ఉండగా, వడ్డి మహేష్ తాను కేవలం బ్రోకరింగ్ మాత్రమే చేస్తానని చెబుతున్నాడని, ఒక డాలర్‌కు తనకు 85 పైసలు ముడుతుందని చెప్పాడని డీజీపీ తెలిపారు. అలా చేయడం కూడా తప్పేనని, ఇందులో సూత్రధారులను పట్టుకుంటే అసలు విషయం వెలుగులోకి వస్తుందని అన్నారు. సీఐడీ కూడా ఇక్కడి ఆస్తులు ఎటాచ్ చేయొచ్చుగానీ, విదేశాల్లో ఆస్తులు ఎటాచ్ చేయాలంటే మాత్రం ఈడీ వల్లే అవుతుందని తెలిపారు.



చైనా, సింగపూర్, హాంకాంగ్ దేశాలకు మొత్తం రూ. 683 కోట్లు తరలిపోవడంపై సీఐడీ దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇది హవాలా కాదని, మనీ లాండరింగ్ అని వివరించారు. వడ్డి మహేష్‌తోపాటు అతడి బంధువులను, కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్లను కూడా అరెస్టు చేశామన్నారు. ఈ వ్యవహారంలో బ్యాంకుల పాత్ర ఏమిటన్న విషయంపైనా విచారణ జరుగుతోందన్నారు. ప్రధాన నిందితులు ముగ్గురిపై ఇంటర్‌పోల్‌కు కూడా సమాచారం అందించి, రెడ్‌కార్నర్ నోటీసులు వచ్చేలా చూస్తామని, వాళ్లు ఎక్కడున్నా రప్పించే ప్రయత్నం చేస్తామని వివరించారు. అయితే ఈ కేసులో తాము చెప్పిన పేర్లు తప్ప వేరే రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు మాత్రం ఇంతవరకు తేలలేదని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top