చోరీకి వచ్చి దొంగ మృతి


గన్నవరం: అపహరించిన గేదెలను వ్యాన్‌లో తరలించుకుపోతూ వెంబడించిన పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ఓ దొంగ ప్రాణాలను కొల్పోయిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని జక్కులనెక్కలంలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన ముంగా సుధాకర్ (45) చోరీలే ప్రవృత్తిగా జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మరో ఐదుగురితో కలిసి గత మంగళవారం అర్ధరాత్రి ఉంగుటూరు మండలం ఏలుకపాడు గ్రామంలోని పోలిమెట్ల శ్రీధర్‌కు చెందిన రెండు గేదెలు, దూడలను అపహరించి వ్యాన్‌లో తరలించే ప్రయత్నం చేశారు.


గన్నవరం వద్ద నైట్ పెట్రోలింగ్ చేస్తున్న రక్షక్ పోలీసులను చూసి వ్యాన్ డ్రైవర్ వేగం పెంచాడు. దీనితో అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించారు. వీరి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ జాతీయ రహదారి నుంచి వ్యాన్‌ను జక్కులనెక్కలంవైపు మళ్లించాడు. అయితే గ్రామం నుంచి బయటకు వెళ్ళే మార్గం లేకపోవడంతో వ్యాన్‌ను వదిలేసి పరరాయ్యారు. హృద్రోగి అయిన సుధాకర్ సమీపంలోని రియల్ ఎస్టేట్ వెంచర్ గోడ దూకే క్రమంలో కిందపడిపోవడంతో బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. దొరికిపోతామనే భయంతో సహచర దొంగలు అతడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. పోలీసులు గేదెల లోడుతో ఉన్న వ్యాన్‌ను స్టేషన్‌కు తరలించారు. అయితే సీసీఎస్ పోలీసుల సమాచారం ప్రకారం పోలీసులు సుధాకర్ వృతదేహాన్ని గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేపట్టారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top