పాత ప్రతిపాదనలకు కొత్త రూపం


  • డీఎస్సీ-2014 పోస్టుల మంజూరులో లోపించిన పారదర్శకత

  •  ఉన్నత పాఠశాలలను వేధిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల కొరత

  •  జిల్లాలో భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులే అధికం

  •  8వ తరగతికి అప్ గ్రేడ్ చేసిన యూపీ స్కూళ్లకు పోస్టులు శూన్యం

  • గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డీఎస్సీ-2014 ప్రక్రియ పాత ప్రతిపాదనలకు కొత్త రూపం కల్పించినట్లు ఉంది. రాష్ట్రస్థాయిలో భర్తీ చేసేందుకు నిర్ణయించిన 9061 పోస్టుల్లో జిల్లాకు 907 పోస్టులు ఉన్న విషయం తెలిసిందే. గత సెప్టెంబర్ 5వ తేదీకి ముందుగానే జిల్లా విద్యాశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని ఆయా పోస్టులను ప్రభుత్వం ఖరారు చేసింది.



    డీఎస్సీ స్థానంలో ప్రవేశపెట్టిన టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ కం టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టెట్ కం టీఆర్టీ) నోటిఫికేషన్‌లో మూడు నెలల క్రితం ఖాళీల ఆధారంగా గుర్తించిన పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జిల్లాలో భర్తీ చేయనున్న 907 పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 682 ఉన్నాయి. మిగిలిన వాటిలో 159 స్కూల్ అసిస్టెంట్స్, 43 భాషా పండిట్, 23 పీఈటీ పోస్టులున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధనకు అనుగుణంగా ఎస్జీటీ పోస్టులను ప్రకటించినప్పటికీ ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధనకు అవసరమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నామ మాత్రంగా మంజూరయ్యాయి.

     

    జిల్లా వ్యాప్తంగా 340 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్, హిందీ పాఠ్యాంశాల బోధనకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు.

     

    విద్యాహక్కు చట్టం అమలు ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 240 ప్రాథమికోన్నత పాఠశాలలను 8వ తరగతికి అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సిన బాధ్యతను విస్మరించింది.

     

    ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని చేర్చిన ప్రభుత్వం పాఠ్యాంశాలను బోధించు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. టెన్‌‌త పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేరనే విషయం జిల్లా విద్యాశాఖ లెక్కలే చెబుతున్నాయి.

     

    గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చడం వలన తలెత్తే ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. రెండు నెలల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. 10వ తరగతి పరీక్షలకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 30 వేల మంది హాజరవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇవేవీ పట్టించుకోకుండా నాలుగు నెలల క్రితం సిద్ధం చేసిన ఖాళీల జాబితానే ప్రభుత్వం టెట్ కం టీఆర్టీ నోటిఫికేషన్‌లో పొందు పర్చింది.

     

    డిసెంబర్ 3వ తేదీన దరఖాస్తుల స్వీకరణతో మొదలు కానున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వచ్చే ఏడాది మే 28న వెలువడే ఫలితాల విడుదల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మంజూరు చేసిన పోస్టులు ద్వారా కొత్త ఉపాధ్యాయులు జూన్ నెలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. తదుపరి వచ్చే రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మళ్లీ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం లేదు. ఫలితంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగానే కొనసాగే పరిస్థితులు కనిస్తున్నాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top