అదనపు కట్నం కోసం భార్య, కుమారుడికి వేధింపులు


అర్తమూరు (మండపేట) : అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను, కన్న కొడుకును చిత్రహింసలు పాల్జేస్తున్న ఓ వ్యక్తి ఉన్మాదమిది. మూడు నెలలుగా వేధిస్తూ నరకం చూపిస్తున్న భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భార్య పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం అర్తమూరుకు చెందిన చిర్ల కామిరెడ్డికి అదే గ్రామానికి చెందిన మంగయమ్మతో వివాహం జరిగి సుమారు పదేళ్లు కావస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. ఎనిమిదేళ్ల భాగ్యలక్ష్మి, ఏడేళ్ల వీర్రాఘవరెడ్డి ఉన్నారు.



కుమార్తె వేరే గ్రామంలో చదువుకుంటోంది. వివాహ సమయంలో కట్నంగా రూ.నాలుగు లక్షల నగదుకు అల్లుడికి రూ. రెండు లక్షలు అందజేసి, కుమార్తె పేరిట రూ.రెండు లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయడంతోపాటు తొమ్మిది కాసుల బంగారాన్ని మంగయమ్మ తల్లిదండ్రులు వెలగల బాపిరెడ్డి, లక్ష్మి ముట్టజెప్పారు. కామిరెడ్డి వాయిదాల పద్ధతిలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ. రెండు లక్షలు తీసుకురావాలని ఏడాదిగా కామిరెడ్డి భార్యను వేధించడం ప్రారంభించాడు.



అందుకు అత్తమామలు అంగీకరించకపోవడంతో వారిని ఇంటికి రానివ్వడం లేదు. మూడు నెలలుగా భార్యను, కుమారుని ఇంట్లోనే బంధించి క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. చిత్రహింసలపాల్జేస్తున్నాడు. ఆదివారం ఉదయం కుమార్తెను చూసేందుకు ఇంటికి వెళ్లిన లక్ష్మి.. అక్కడ మంగయమ్మ, మనవడు వీర్రాఘవరెడ్డి దీనస్థితిలో ఉండటం చూసి వారిని ఇంటికి తీసుకువెళ్లిపోయింది. అప్పటికే మంగయమ్మ చేతులపై కాలిన గాయాలు ఉండటం, వీర్రాఘవరెడ్డి ఒంటిపైనా, నుదిటిపైనా తీవ్రగాయాలు ఉండటం స్థానికులను కలిచివేసింది.



నిన్ను ఎవరు కొట్టారని అడిగితే.. రోజూ నాన్న ఇష్టం వచ్చినట్టు చితక్కొడుతున్నాడని వీర్రాఘవరెడ్డి చెబుతున్నాడు. మంగయమ్మ మానసిక ఆరోగ్యం దెబ్బతింది. తమకు న్యాయం చేయాలని కోరుతూ రూరల్ పోలీసుస్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. బాధితులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ సీహెచ్ విద్యాసాగర్ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top