మోటార్!


భారీగా పెరిగిన మోటార్ల ధర

ఒక బోరుకు మోటారు అమర్చాలంటే  రూ.1.5 లక్షలకు పైమాటే

అప్పుల వేటలో రైతులు   పట్టించుకోని బ్యాంకర్లు

 


జిల్లాలోని పడమటి మండలాల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడంతో భూగర్భజలాలు పెరిగాయి. ప్రస్తుతం వంద అడుగుల్లోనే పుష్కలంగా నీరు లభిస్తోంది. వర్షాభావం కారణంగా వలస వెళ్లిన రైతులు ప్రస్తుతం స్వగ్రామాలకు చేరుకుని సేద్యంబాట పట్టారు. గతంలో నీళ్లు రాక వదిలేసిన బోర్లకు మోటార్లు బిగించే పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో బోరు మోటార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇదే అదనుగా  వ్యాపారులు                ఒక్కసారిగా మోటార్ల రేట్లను పెంచి అన్నదాతలకు చుక్కలు చూపిస్తున్నారు.  

 

పలమనేరు : జిల్లాలోని పడమటి మండలాల్లో బోరు మోటార్ల ధరలు భారీగా పెరిగాయి. వీటిని కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వలేక రైతులు దిక్కులు చూస్తున్నారు.రూ.1.5 లక్షలుంటేనే గంగ పైకొస్తుంది బోర్లలో ప్రస్తుతం భూగర్భజలాలు సుమారు వంద అడుగులకు చేరాయి. 20 అడుగుల ఇనుప పైపులు కనీసం 20 వరకు వేయాలి. ఒక్కో పైపు ప్రస్తుతం రూ.2 వేలు. ఆ లెక్కన రూ.40 వేలవుతుంది. ఈ పైపులకు అమర్చే 20 కప్లింగ్‌లకు రూ.3 వేలు, బోరులోకి వేసే కేబుల్ వైరు రూ.5 వేలు, బోరు స్టార్టర్ రూ.14 వేలు, 12.5 హెచ్‌పీ 15 స్టేజీల మోటారు కంపెనీది అయితే రూ.70 వేలు, 15 హెచ్‌పీ మోటార్, 20 స్టేజీల పంపు అయితే రూ.85 వేలు, ఒకవేళ లోకల్ మోటార్, పంపులైతే రూ.50 నుంచి రూ.60 వేల వరకు అవుతోంది. ఇక బోరు నుంచి నీటి ట్యాంకు వరకు పైపులకు రూ.20 వేలు, మిగిలిన ఖర్చులు మరో రూ.8 వేలు ఇవన్నీ కలుపుకుంటే సుమారు రూ.1.50 లక్షలకు పైమాటే.  

 

పుట్టని అప్పులు.. పట్టించుకోని బ్యాంకర్లు

ఓ వైపు ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పులు పుట్టకపోవడం మరోవైపు బ్యాంకుల నుంచి కొత్త అప్పులు ఇవ్వకపోవడంతో రైతులు కుంగిపోతున్నారు. ఏదో ఒకటి చేయాలి కాబట్టి భూములు తనఖా పెట్టడమో, లేదా అధిక వడ్డీలకు అప్పు చేయడమో చేస్తున్నారు. సుమారు 30 శాతం మంది రైతులు పండే పంట ఫలసాయం వ్యాపారులకు ముట్టజెప్పేలా ముందస్తుగా అగ్రిమెంట్ చేసుకుని మోటార్లు బిగించుకుంటున్నారు.

 

భారీగా పెరిగిన మోటార్ల ధర

మోనోబ్లాక్ పంప్‌సెట్స్ 2014 ఆగస్టు వరకు 5హెచ్‌పీ మోటారు రూ.12 వేల రూపాయలుండేది. ఇదే మోటారు ఇప్పుడు రూ.16,600 పలుకుతోంది. 7.5హెచ్‌పీ రూ.14 వేల నుంచి రూ.20,000కు చేరింది. మోనోబ్లాక్ సబ్‌మెర్సిబుల్ మోటార్లు 7.5హెచ్‌పీ 10 స్టేజీల మోటారు రూ.35వేల నుంచి రూ.65వేలు, 12 హెచ్‌పీ 15 స్టేజ్‌లు  రూ.41 వేల నుంచి రూ.69 వేల వరకు చేరింది. 15హెచ్‌పీ 22 స్టేజ్‌లు గతంలో రూ.70 వేలు ఉండగా ప్రస్తుతం రూ.89 వేల వరకు పెరిగింది. ఇదే స్థాయిలో సెకండ్ హ్యాండ్ మోటార్ల ధరా పెరిగింది. గతంలో నీళ్లురాని బోర్ల నుంచి ఊడదీసిన మోటార్లను రైతులు ఒకటికి సగానికి అమ్ముకోగా ఇప్పుడు వాటికి మెరుగులు దిద్ది మెకానిక్‌లు అధిక రేట్లకు విక్రయిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top