బదిలీలపై సందిగ్ధం

బదిలీలపై సందిగ్ధం

  • నవంబర్ 11 నుంచి బదిలీలపై నిషేధం

  •  ఇప్పటి వరకు ప్రారంభం కాని కసరత్తు

  •  తుపాను సహాయక చర్యల్లో అధికారులు బిజీ

  •  స్థానచలనాలు కలిగిస్తే నష్టం అంచనాలకు ఆటంకం

  •  ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం!

  • విశాఖ రూరల్: ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. హుదూద్ తుపాను నేపథ్యంలో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. నవంబర్ 11వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బదిలీలకు సంబంధించి ఎటువంటి కసరత్తు జరగడం లేదు. పునరావాస, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న ఈ తరుణంలో స్థానచలనాలు ఉండే అవకాశం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం బదిలీలకు గడువు పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.



    జిల్లా స్థాయి అధికారి నుంచి గ్రామస్థాయి కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. జన్మభూమి కా ర్యక్రమానికి ముందే ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయిస్తూ సెప్టెంబర్‌లోనే బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 20వ తేదీలోగా బదిలీలు పూర్తి చేయాలని అందులో పేర్కొంది. దీంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ నెలాఖరులోనే బదిలీలు చేపట్టాలని భావించి తహశీల్దార్ల పోస్టింగ్‌లకు సంబంధించి జాబితాపై కసరత్తు కూడా చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కారణంగా జాబితాను ప్రకటించలేదు.



    ఈ సమయంలో ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి 20వ వరకు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానచలనాలు కలిగిస్తే కొత్తగా మండలాలకు వెళ్లిన అధికారులకు ఆయా ప్రాంతాల్లో సమస్యలపై అవగాహన ఉండే అవకాశముండదని, జన్మభూమి కార్యక్రమం విజయవంతం కాదని భావించి కొత్త జీవో జారీచేసింది. జన్మభూమి తరువాత బదిలీలు చేపట్టాలని ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇంతలో ఈ నెల 12న హుదూద్ తుపాను విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని కలిగింది.



    ఇప్పటికీ పునరావాస, సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల కంటే విశాఖలో పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పట్లో బదిలీలు చేపట్టే అవకాశం ఉండదని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో బదిలీలు చేస్తే సహాయ కార్యక్రమాలలో జాప్యం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇక్కడ బదిలీలకు గడువు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ బదిలీలపై మరో మూడు, నాలుగు రోజుల్లో ఒక స్పష్టత రావచ్చని భావిస్తున్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top