‘ఏడడుగుల వేడుక’కు 9 నెలల విరామం


అన్నవరం: పుష్కరాలకు ముందూ, ఆ తరువాతా గోదావరి అలల గలగలలు వినిపిస్తాయి. అయితే ఆ పుష్కరాల కారణంగా.. ఆ మహాపర్వానికి ఓ నెల ముందూ, తరువాత ఎనిమిది నెలలూ ఈ ప్రాంతంలో మంగళవాయిద్యాలు వినిపించవు. జూలై 14 నుంచి 25 వరకూ జరగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఈ ఏడాది వివాహ ముహూర్తాలు జూన్ 11తో ముగుస్తున్నాయి. ఆనాటి నుంచి తిరిగి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ పెళ్లి ముహూర్తాలు ఉండవు. ఆ వ్యవధిలో ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో పెళ్లిళ్లు నిషిద్ధమని పండితుల్లో అనేకులు చెపుతున్నారు. దీంతో జూన్ 11 లోపునే వివాహాలు చేసేందుకు పెళ్లీడు యువతీయువకుల తల్లిండ్రులు ఆరాటపడుతున్నారు.

 

 ఈ నెల 19 న ప్రారంభమైన జ్యేష్ఠమాసం జూన్ 16 వరకూ ఉంటుంది. ఆ తర్వాత వరుసగా రెండు నెలలు ఆధిక ఆషాఢం, నిజ ఆషాఢం ఉంటారుు. ఆషాఢమాసాలు శుభకార్యాలకు పనికిరాని విషయం విదితమే. సాధారణంగా శ్రావణమాసం, ఆశ్వయుజమాసం, కార్తీకమాసం, మాఘమాసాలలో వివాహాలు జరుగుతాయి. పుష్కరాల కారణంగా ఈసారి ఈ నెలల్లో వివాహాలు జరిగే అవకాశం లేదు. ఇక జ్యేష్ఠమాసంలో కూడా వధూవరులిద్దరూ జ్యేష్టులు(సంతానంలో పెద్దవారు) అయితే  నెలతో కలిసి మూడు జ్యేష్టాలు ఉన్నందున వివాహాలు చేసుకోని ఆచారం ఉన్నవారు కూడా ఉన్నారు. అందువలన ఇప్పటికే వివాహాల జోరు కొంత తగ్గింది.

 

 ఈ నెల 29న, జూన్ 11న పెద్ద ముహూర్తాలు

 ఈ నెలలో 28, 29, 30 జూన్ నెలలో 1, 2, 3, 6, 11 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని పండితులు తెలిపారు. అందులో ఈనెల 29, జూన్ 11 వ తేదీ న దివ్యమైన ముహూర్తాలు ఉన్నందున ఆ రోజు భారీగా వివాహాలు జరుగుతాయన్నారు. ఆ తర్వాత ఇంక పెళ్లి బాజా మోగాలంటే సుమారు తొమ్మిది నెలలు ఆగాలని తెలిపారు.

 

 ఇదిలా ఉంటే అన్నవరం దేవస్థానంలో కూడా మే 29, జూన్ 11 తేదీల్లో దేవస్థానం సత్రాలలో గదులకు 30 శాతం రిజర్వేషన్ పూర్తయింది. పెళ్లి బృందాలకు ఒక్కో గది మాత్రమే ఇవ్వడం వివాదస్పదమవుతోంది. ఆడ, మగ పెళ్లివారికి ఒక్కో రూమ్ ఇవ్వాలని పెళ్లిబృందాల వారు కోరుతున్నారు.

 

 అన్నవరం దేవస్థానానికీ నష్టమే..

 కాగా, తొమ్మిది నెలల పాటు వివాహ ముహూర్తాలు లేకపోవడం దేవస్థానానికి కూడా నష్టమే. రత్నగిరిపై ఏటా ఐదువేలకు పైగా వివాహాలు జరుగుతాయి. ఇక్కడ వివాహాలు చేసుకునేవారితో బాటు పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకునేవారు కూడా మధుపర్కాలతో వచ్చి స్వామివారి వ్రతం చేసుకుంటారు. అటువంటిది తొమ్మిది నెలలు వివాహాలు జరగకపోతే భక్తుల రాక తగ్గి ఆమేరకు దేవస్థానానికి కూడా ఆదాయం తగ్గుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే రత్నగిరిపై వ్యాపారాల జోరు తగ్గింది. వేలం పాటలు పాడే వారు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని పాడుతున్నారు. వివాహాలకు గుమ్మటాలు (చిన్న మండపాలు) వేసి అలంకరణ చేసేందుకుగాను ఈ నెల 15 న వేలం నిర్వహిస్తే నెలకు రూ.3,52,500  మాత్రమే పాట వెళ్లింది. ఇది గత ఏడాది కన్నా కేవలం రూ.500 మాత్రమే ఎక్కువ. పరిస్థితిని గమనించిన అధికారులు ఆ పాటనే ఖరారు చేయాల్సి వచ్చింది. మిగతా వేలంపాటలు కూడా తగ్గే పరిస్థితి ఉంది. వివాహాలపై ఆధారపడిన పురోహితులు, క్యాటరింగ్, సన్నాయిమేళం తదితర వర్గాల వారు కూడా ఈ తొమ్మిది నెలలు ఏమి చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top