ఎట్టకేలకు బట్టబయలు!

ఎట్టకేలకు బట్టబయలు! - Sakshi


బీసీ స్కాలర్‌షిప్‌ల స్కామ్‌లో 9 మంది అరెస్టు

16 నెలలు తర్వాత అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు

రూ.82 లక్షల అవినీతి జరిగినట్లు నిర్ధారణ

అక్రమార్కుల్లో అధికారపార్టీ నేతల  బంధువులు


 శ్రీకాకుళం పాతబస్డాండ్‌/శ్రీకాకుళం సిటీ: సంచలనం సృష్టించిన బీసీ స్కాలర్‌షిప్‌ స్కామ్‌లో ఎట్టకేలకు అరెస్టులు మొదలయ్యాయి. ఈ అవినీతిలో భాగస్వాములైన బీసీ సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగులు ఏడుగురితో పాటు మరో ఇద్దరు ప్రైవేట్‌ వ్యక్తులను సోమవారం రాత్రి ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుల్లో పదవీ విరమణ చేసిన 2016 నాటి బీసీ సంక్షేమశాఖ అధికారి బండ్లమూడి రవిచంద్రతో పాటు ఆ శాఖలో పనిచేస్తున్న బైరి చంద్రశేఖర్‌ (జూనియర్‌ అసిస్టెంట్‌), బుడుమూరు బాలరాజు (జూనియర్‌ అసిస్టెంట్‌), దుడ్డు పార్వతి (సీనియర్‌ అసిస్టెంట్‌), గిరిజన సంక్షేమశాఖలో పనిచేస్తున్న బోర ఎర్రన్నాయుడు (ఏటీడబ్ల్యూవో, సీతంపేట), శిమ్మ జాన్సీరాణి (హెచ్‌డబ్ల్యూవో, ఎస్టీబాలుర హాస్టల్, సారవకోట), గేదెల వెంకటనాయుడు (పాలకొండ, ఎస్టీ బాలుర వసతిగృహం అధికారి) ఉన్నారు.



 వీరితో పాటు పాలకొండకు చెందిన ఓంసాయి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ముంజు ఉమామహేశ్వరరావు, అదే కళాశాలలో గతంలో పనిచేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ అంపిలి అజయ్‌కుమార్‌లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. వీరిని మంగళవారం విశాఖపట్నంలోని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నిందితులపై మోసం, ఫోర్జరీ, సైబర్‌క్రైమ్‌ కేసులను నమోదు చేసినట్లు చెప్పారు.



బీసీ సంక్షేమశాఖలో 2009–2016 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ స్కాలర్‌షిప్‌ల కుంభకోణంపై సాక్షి పత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో ఏసీబీ అధికారులు బీసీ సంక్షేమశాఖలో ఉపకార వేతనాల పక్కదారి పట్టడంపై దృష్టి సారించారు. ఈ అవకతవకలు తొలుత 2013–14 ఆర్థిక సంవత్సరంలోనే జరిగాయని భావించి ప్రాథమికంగా దర్యాప్తు చేశారు. అయితే ఈ వ్యవహారంలో అవినీతి తారస్థాయిలో ఉండడంతో అంతకుముందు సంవత్సరాల రికార్డులపై దృష్టి సారించారు. దీంతో ఈ స్కామ్‌కు 2009 సంవత్సరంలోనే బీజం పడిందని ఏసీబీ అధికారులు గుర్తించారు



2009 నుంచి 2016 సంవత్సరం వరకు ఎస్టీ వసతి గృహాల్లో విద్యార్థులు లేకుండానే వారు ఉన్నట్లు నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి బీసీ సంక్షేమ శాఖ నుంచి స్కాలర్‌షిప్‌ నిధులు కాజేసినట్లు వెలుగుచూసింది. 927 మంది బీసీ విద్యార్థులు సారవకోట, పాలకొండలోని ఎస్టీ వసతి గృహాల్లో చదివినట్లు నమోదు చేసి వారికి ఉపకారవేతనాలు మంజూరు చేశారు. ఈ నిధులను సంబంధిత ఎస్టీ వసతిగృహ అధికారులు బ్యాంకుల నుంచి విద్యార్ధుల పేరిట విత్‌డ్రా చేశారు. ఆ నిధులను బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు పంచుకున్నారు. వారికి సాంకేతిక సహకారాన్ని పాలకొండలోని ఓంసాయి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఉమామహేశ్వరరావు, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అజయ్‌కుమార్‌ అందజేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.



రూ.82 లక్షల నిధులకు ఎసరు  

సంక్షేమశాఖ నిధులు మొత్తం రూ.82 లక్షలు కైంకర్యం అయ్యాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. వాటిలో రూ.50 లక్షలు గోల్‌మాల్‌ అయిపోయాయి. కాగా రూ.32 లక్షలు మాత్రం ట్రెజరీ, బ్యాంకుల్లో స్తంభింపజేయగలిగారు. ఈ స్కాంలో ప్రధాన సూత్రదారులు ఉమామహేశ్వరరావు, అజయ్‌కుమార్‌. వారు ఆన్‌లైన్‌లో సెట్‌ చేసిన విద్యార్థుల పేర్లు ఆధారంగా ఉపకార వేతనాలను బీసీ సంక్షేమ శాఖ అధికారులు మంజూరు చేస్తూ వచ్చారు. సారవకోట, పాలకొండలోని ఎస్టీ వసతిగృహాలకు ఆ నిధులను మళ్లించారు.



 ఆయా హాస్టల్‌ వార్డెన్ల ఖాతాల నుంచి ఆ నిధులను ఎస్టీ సంక్షేమశాఖ అధికారులు విత్‌డ్రా చేశారు. అలా రూ.50 లక్షల వరకూ వాటాలు వేసిమరీ పంచేసుకున్నారు. ఈ అవకతవకలు ఎక్కువగా జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా రవిచంద్ర పనిచేసిన సమయంలోనే చోటుచేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఈ స్కాలర్‌షిప్‌ స్కాంలో 26 ప్రొసీడింగ్‌లు ఉండగా, ఇందులో 15 ప్రొసీడింగ్‌లు రవిచంద్ర హయాంలోనే ఉండటం విశేషం.



మాకు సంబంధం లేదు: నిందితులు...

ఈ కేసులో అరెస్టుయిన బీసీ, ఎస్టీ సంక్షేమశాఖ సిబ్బంది ఎవరికి వారు తమ తప్పు ఏమీ లేదని సోమవారం రాత్రి మీడియా ముందు వాపోయారు. బీసీ సంక్షేమాధికారులు, ఎస్టీ సంక్షేమాధికారులు తప్పుడు ధ్రువపత్రాలతో తమను ఇరికించారని వాపోయారు. కాగా ఎస్టీ సంక్షేమ అధికారులు మాత్రం బీసీ అధికారులే తమను ప్రలోభపెట్టారని ఆరోపిస్తున్నారు.



మంత్రి అచ్చెన్నకు బంధువులు...

 నిందితుల్లో ఎస్టీ సంక్షేమశాఖ ఉద్యోగులైన శిమ్మ ఝాన్సీరాణి, బోర ఎర్రన్నాయుడు జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి బంధువులు కావడం గమనార్హం. వారిలో ఏటీడబ్ల్యూవో బోర ఎర్రన్నాయుడుపై  పలుసార్లు అవినీతి ఆరోపణలు వచ్చాయి. రాజకీయ ప్రాబల్యంతో వాటినుంచి తప్పించుకోవడం ఆయనకు పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ స్కాం వెలుగులోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు ఎస్టీ సంక్షేమశాఖలో పనిచేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోలేదు. కనీసం సస్పెన్షన్‌ కూడా చేయలేదు. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఏసీబీ డైరక్టర్‌ జన రల్‌ ఠాకూర్‌ దృష్టికి ఈ స్కాం విషయం వెళ్లింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top