8 మంది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది సస్పెన్షన్


 ఆల్కాట్‌తోట (రాజమండ్రి) : రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కక్షిదారుల డాక్యుమెంట్లు మాయం వ్యవహారంలో సీనియర్ అసిస్టెంట్ సహా ఎనిమిదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది.   ఈ నెల ఒకటిన కొత్త సబ్ రిజిస్ట్రార్లుగా బాధ్యతలు స్వీకరించిన విజయ జీవన్‌బాబు, శ్రీనివాసబాబు గత నెలలో రిజిస్ట్రేషన్‌కు వచ్చిన కక్షిదారులకు చెందిన 25 డాక్యుమెంట్లు కనిపించడం లేదని గుర్తించారు. ఇటీవల రాజమండ్రి జిల్లా రిజిస్ట్రార్‌ఎం.శ్రీనివాసమూర్తికి, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 17, 18 తేదీల్లో ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ చాముండేశ్వరీదేవి రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లు మాత్రమే కనిపించకుండా పోయాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా రిజిస్ట్రార్ చాముండేశ్వరితోపాటు జూనియర్ అసిస్టెంట్లు సిహెచ్.శ్రీదేవి, ఎ.రాజేంద్రప్రసాద్, ఎం.కిరణ్మయి, వైవీ ఆనందకుమార్, ఎంవీవీ కృష్ణ, ఆఫీస్ సబార్డినేట్లు కె.ఎస్.మూర్తి, జేకెఎస్ కుమార్‌లను బాధ్యులను చేస్తూ ఏలూరు రిజిస్ట్రేషన్‌శాఖ డీఐజీ ఎ.సాయిప్రసాద్‌కు నివేదిక ఇచ్చారు.

 

 దీంతో డీఐజీ వారిని సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాజమండ్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కలకలం రేగింది. కాగా తాను ఇన్‌చార్జిగా బాధ్యతలు స్వీకరించాక కొద్దిరోజులకు రెడ్డి అనే ఉద్యోగి ఇన్‌చార్జి సబ్‌రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టారని, ఈ డాక్యుమెంట్లు ఎలా పోయాయో అంతుపట్టడం లేదని అన్నారు. తనపై కక్షతో ఎవరో కావాలనే ఈ పని చేసి ఉంటారని వాపోయారు. కాగా గతంలో సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్న వారు దాదాపు పదిమంది ప్రైవేటు వ్యక్తులతో కార్యాలయం పనులు చేయించే వారని, వారు బదిలీ అయ్యాక ప్రైవేటు వ్యక్తులను తొలగించారని సమాచారం. డాక్యుమెంట్లు మాయం కావడంలో ప్రై వేట్ వ్యక్తుల ప్రమేయం ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. గతంలోనూ కొన్ని డాక్యుమెంట్లు పోయినా ఇంతవరకు చర్యలు లే వని, ఇప్పుడు సస్పెండ్ చేయడం ఏమిటని కొందరు అంటున్నారు.  

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top