8 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు

8 నుంచి దుర్గగుడిలో పవిత్రోత్సవాలు

  •  9న స్నపనాభిషేకం

  •   15న సామూహిక శ్రావణలక్ష్మి వ్రతాలు

  • విజయవాడ : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో ఆగస్టు 8 నుంచి 11వ తేదీ వరకు ప్రవిత్రోత్సవాలు నిర్వహించాలని ఆలయ అధికారులు, వైదిక కమిటీ నిర్ణయిం చింది. 8వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఉదకశాంతితో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 9వ తేదీ తెల్లవారు జామున మూడు గంటలకు అమ్మవారికి స్నపనాభిషేకం, అలంకారం, ప్రాతఃకాల అర్చన, పవిత్రధారణ నిర్వహిస్తారు.



    అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు. 9.30 గంటలకు విఘ్నేశ్వరపూజ, రుత్విక్‌వరణం, కలశస్థాపన, అగ్ని ప్రతిష్టాపన, మూలమంత్ర హవనం, సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు మూలమంత్ర హవనం, మంటప పూజ, మంత్రపుష్పం తదితర పూజలు జరుగుతాయి. 11వ తేదీ ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, కలశ ఉద్వాసన, దేవతా మార్జనం, ఆశీర్వాదం, పవిత్రాల విసర్జన నిర్వహిస్తారు.

     

    8న వరలక్ష్మిగా దుర్గమ్మ



    శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 8వ తేదీన వరలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తారు. ఆ రోజు వేల సంఖ్యలో మహిళలు అమ్మవారి దర్శనానికి విచ్చేసే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

     

    15న సామూహిక శ్రావణలక్ష్మి వ్రతాలు



    ఆగస్టు 15వ తేదీన ఆలయ ప్రాగణంలోని భవానీ దీక్ష మండపంలో సామూహిక శ్రావణలక్ష్మి వ్రతాలు జరుగుతాయి. సుమారు రెండు వందల మంది ముత్తయిదువులు అమ్మవారి సన్నిధిలో వ్రతం ఆచరించేందుకు అధికారులు వీలు కల్పిస్తున్నారు. 14వ తేదీ ఉదయం నుంచి దేవస్థాన కార్యాలయంలోని పూజల విభాగంలో దరఖాస్తులు అందజేస్తారు. మొదట వచ్చిన వారికి మొదటి ప్రాధాన్యంగా దరఖాస్తులతో పాటు పూజా సామగ్రిని దేవస్థానమే ఉచితంగా అందజేస్తుందని ఆలయ అధికారులు ప్రకటించారు. 15వ తేదీ ఉదయం ఎనిమిది నుంచి 10 గంటల వరకు శ్రావణలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top