నిరాశే మిగిలింది!

నిరాశే  మిగిలింది! - Sakshi


 శ్రీకాకుళం:డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు నిరాశే మిగిలింది. వేలాది పోస్టులతో షెడ్యూలు వస్తుందని భావించిన వీరి ఆశలపై చంద్రబాబు సర్కార్ నీళ్లు చల్లింది. రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీని టెట్ కం టీఆర్టీ పేరుతో గురువారం షెడ్యూల్ విడుదల చేసింది. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 719 పోస్టులను షెడ్యూల్‌లో  పొందుపరిచారు. ఇందులో 220 స్కూల్ అసిస్టెంట్, 103 లాంగ్వేజ్ పండిట్, 21 పీఈటీ, 375 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. కాగా తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల సమయంలో బీఈడీలకు ఎస్జీటీ పోస్టులకు అవకాశం కల్పిస్తామని ఇచ్చిన హామీ కేంద్రం నిరాకరిస్తుందన్న సాకుతో తుంగలోకి తొక్కడంపై నిరుద్యోగ ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. వాస్తవానికి న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని తెలిసినప్పటికీ ఎన్నికల సమయంలో తాము ప్రత్యేక చట్టం చేసి బీఈడీలకు ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని ప్రకటించింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా ఇదే కారణంతో నెలల తరబడి కాలయాపన చేసి చివరకు వారికి మొండిచెయ్యి చూపించడంతో బీఈడీలు ఆందోళన బాట పట్టారు.

 

 ఇప్పటికే ర్యాలీలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ధర్నాలు చేపట్టిన వీరు కోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తున్నారు. ఇదే జరిగితే డీఎస్సీ నిర్వహణ ప్రశ్నార్ధకంగా మారుతోంది. అలాగే ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌లో జాప్యం చేయడంతో చాలామంది వయోపరిమితి దాటి అనర్హులుగా మారారు. డీఎస్సీ రాత పరీక్షకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ గతంలో పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. దీనిలో ఉత్తీర్ణత సాధించిన వారందరూ ఇప్పుడు తాము సాధించిన మార్కులు నిరుపయోగమని తెలిసి ఆందోళన చెందుతున్నారు. ఇది వరలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారి విషయాన్ని ఆలోచన చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు వారిని కూడా మోసగించేలా చేసి టెట్ ఉత్తీర్ణతను ఎందుకూ పనికి రాకుండా చేయడంపై సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ దఫా డీఎస్సీకి దరఖాస్తు చేసుకునేందుకు, రాత పరీక్షకు ఆరు నెలలు గడువు ఇవ్వడం కూడా అనుమానాలకు తావిస్తోంది.

 

  కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూర్చేందుకే!

 డిసెంబర్ మూడు నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం వచ్చే ఏడాది మే నెల తొమ్మిది నుంచి 11వ తేదీ వరకు రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడం ప్రైవేటు కోచింగ్ సెంటర్లకు లబ్ధి చేకూర్చేందుకేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వేలాది పోస్టులతో డీఎస్సీని ప్రకటిస్తామని, బీఈడీలకు టెట్ ఉత్తీర్ణదారులకు న్యాయం చేస్తామని చెప్పిన టీడీపీ పెద్దలు అధికారంలోనికి వచ్చిన తరువాత అందుకు విరుద్ధమైన షెడ్యూల్ విడుదల చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top