తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య మిథ్య

తెలంగాణలో ఇంజనీరింగ్ విద్య మిథ్య

  • ప్రథమం.. అధమం

  •  70 శాతం ఇంజనీరింగ్ విద్యార్థులు తొలి ఏడాదిలో ఫెయిల్

  •   గడచిన నాలుగేళ్లలో ఇదే పరిస్థితి

  •   అధ్యాపకుల కొరత, అనర్హులతో బోధన, నాణ్యతా లోపం, సౌకర్యాల లేమితో సమస్యలు

  •   అడ్మిషన్లు ఆలస్యం కావడం, విద్యార్థుల్లో శ్రద్ధ తగ్గిపోవడమూ కారణమే..

  •   భాషా పరమైన సమస్యతోనూ వెనుకంజ

  •   ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో 7 శాతమే పాస్

  •   సివిల్ ఇంజనీరింగ్‌లో 20 శాతమే ఉత్తీర్ణులు

  •   మధ్యలో మానేస్తున్న వారూ ఎక్కువే..

  •  

     సాక్షి, హైదరాబాద్: ప్రమాణాల లేమి.. అధ్యాపకుల కొరత.. అనర్హులతో బోధన.. ల్యాబ్‌లు, లైబ్రరీల వంటి సౌకర్యాల కొరత.. అడ్మిషన్లు ఆలస్యం కావడం.. చివరికి మౌలిక సౌకర్యాలకూ దిక్కులేని పరిస్థితి.. వెరసి తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య మిథ్యగా మారుతోంది. చుట్టూ గట్టి క్రమశిక్షణ మధ్య ఇంటర్మీడియట్ పూర్తిచేసి, ఒక్కసారిగా బయటికి వచ్చిన విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టకపోవడం వీటన్నింటికీ తోడవుతోంది. ప్రధానంగా తరగతుల ప్రారంభం ఆలస్యం అవుతుండటంతో అప్పటివరకు చదివిన అంశాలపై రివిజన్ చేపట్టి, భవిష్యత్తులో చదువుకోవాల్సిన విధానాలపై సూచనలు అందించే సమయం కూడా లేకపోవడం ప్రథమ సంవత్సర విద్యార్థులు అత్యధికంగా ఫెయిలవుతున్నారు..  మొత్తంగా ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరంలో విద్యార్థుల ఉత్తీర్ణత దారుణంగా తగ్గిపోతోంది. భాషా పరమైన సమస్యలు, అప్పటివరకు చదువుకున్న సబ్జెక్టులతో పాటు తమకు తెలియని కొత్త సబ్జెక్టులను అదనంగా చదవాల్సి రావడం కూడా ఫెయిల్ అయ్యే విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు కారణం అవుతోంది.

     

     ఏటా పెరుగుతోంది..: హైదరాబాద్ జేఎన్‌టీయూ పరిధిలోని 283 ఇంజనీరింగ్ కాలేజీల్లో 2010-11 విద్యా సంవత్సరంలో ప్రథమ సంవత్సరంలో దాదాపు 65 శాతం విద్యార్థులు ఫెయిల్‌కాగా.. 2013-14కు వచ్చే సరికి అది 71.3 శాతానికి పెరిగింది. 2011-12లో తొలి ఏడాది ఫెయిలైన విద్యార్థులు 67.72 శాతం ఉండగా.. 2012-13లో 64.84 శాతం. మొత్తంగా ఏటికేడు ప్రథమ సంవత్సరంలో ఫెయిల్ అవుతున్న  విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న విద్యా విధానానికి, ఇంజనీరింగ్‌లో చేరాక చదువుకోవాల్సిన విద్యా విధానానికి మధ్య తేడాలు ఉండటం కూడా ఇందుకు కారణం.

     ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో తక్కువ..

     ఇటీవల ప్రకటించిన బీటెక్ ప్రథమ సంవత్సర ఫలితాలను పరిశీలిస్తే ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో అత్యధికంగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కేవలం 7.89 శాతం మాత్రమే ఈ కోర్సులో పాస్ అయ్యారు. దీని తర్వాత తక్కువ మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినది.. పెట్రోలియం ఇంజనీరింగ్. 

     

     కారణాలెన్నో... 

     అర్హులైన బోధన సిబ్బంది లేకపోవడం, అనర్హులతో అరకొర విద్యాబోధనతో కళాశాలలను నెట్టుకొస్తుండటం వంటివి ఫెయిలవుతున్న విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణమవుతోంది. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మీడియంకు వచ్చిన వారికి భాషా పరమైన సమస్యలు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇంగ్లిషు మీడియంలో చదువుకున్నా కూడా ఇంజనీరింగ్‌కు వచ్చేసరికి భాషా సమస్య తప్పడం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్లో కొంత బెరుకు, భయం ఉండటమే దీనికి కారణం. ఇక విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంటర్, ఎంసెట్ ప్రిపరేషన్ సమయాల్లో చూపినంత శ్రద్ధ ఇంజనీరింగ్‌లో చేరాక చూపకపోవడం.. ఉత్తీర్ణత తగ్గిపోవడానికి కారణమవుతోందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటర్‌లో చదువుకున్న సబ్జెక్టులతో పాటు ఇంజనీరింగ్‌కు సంబంధించిన కొత్త సబ్జెక్టులు వచ్చి చేరుతాయి. ఇందులో ప్రథమ సంవత్సరంలో 6 థియరీ సబ్జెక్టులు ఉంటే.. 5 సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉంటాయి. వీటికి తోడు మొదటి సంవత్సరంలోనే నాలుగు సార్లు ఇంటర్నల్ పరీక్షలు ఉంటాయి. దీంతో విద్యార్థులపై కొంత ఒత్తిడి ఉంటుంది.

     

     ప్రమాణాల పెంపునకు ప్రాధాన్యం..

     కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దష్టి సారించాం. మెరుగైన  విద్యా బోధన అందించేలా కషి చేస్తున్నాం. అర్హులైన అధ్యాపకులతో విద్యా బోధన చేయించేలా చర్యలు చేపడుతున్నాం. విద్యార్థులు, ఫ్యాకల్టీ హాజరుపైనా దష్టి పెట్టాం. ఇందుకోసం బయోమెట్రిక్ విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థులు కూడా ఇంటర్మీడియట్ తరహాలో ఉండకూడదు. బట్టీ పట్టడం కుదరదు. నేర్చుకోవడంలో చొరవ చూపాలి. తెలియని విషయాలను అడిగి మరీ తెలుసుకోవాలి. ప్రభుత్వం కూడా వచ్చే ఏడాది నుంచి వార్షిక కేలండర్ ప్రకారం తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది.

     - ప్రొఫెసర్ ఎన్‌వీ రమణారావు, జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్

     

     పట్టుదలతో నేర్చుకోవాలి

     విద్యార్థి తనను తాను తీర్చి దిద్దుకోవాలి. అర్థం చేసుకొని పరీక్షలు రాయాల్సిందే. ఇంటర్ తరహాలో విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయించే వారు ఉండరు. విద్యార్థే పట్టుదలతో చదువుకోవాలి. ఈ విషయాన్ని మొదటి సంవత్సరం విద్యార్థులు గ్రహించకపోవడం కూడా ఫెయిల్ అయ్యే వారి సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణ ం. విద్యార్థులు కోర్ సబ్జెక్టులు అనగానే ఒక రకమైన  భయానికి గురవుతున్నారు. అది అవసరం లేదు. అనవసర భయాలను వీడి తెలియని విషయాలను ఫ్యాకల్టీ వద్ద తెలుసుకోవాలి. అప్పుడే విజయం సాధిస్తారు.

     

     - రాజేశ్వర్‌రెడ్డి, అనురాగ్ గ్రూపు విద్యా సంస్థల చైర్మన్

     

     త్వరగా తరగతులు ప్రారంభించాలి

     విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా చూడాలి. త్వరగా తరగతులు ప్రారంభించాలి. అలా చేస్తే గతంలో చదువుకున్నవి రివైజ్ చేసి, ఇంజనీరింగ్‌లో చదవాల్సిన వాటిపై విద్యార్థుల్లో పూర్తి స్థాయిలో అవగాహన కల్పించవచ్చు. అది విద్యార్థులకు దిక్సూచిగా ఉంటుంది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకుండా పోయింది. పరీక్షల విధానంపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఇంటర్ మాదిరిగా ఇంజనీరింగ్‌లో ఒకే పుస్తకం, మెటీరియల్ ఉండదు. ఒక్క సబ్జెక్టుకు మూడు నాలుగు పుస్తకాలు చదవాలి. సందేహాలను ఎప్పటికప్పుడు నివత్తి చేసుకోవాలి.

     - ప్రొఫెసర్ నారాయణ, సీఎంఆర్ కాలేజీ

     
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top