తిరష్కార మంత్రం

తిరష్కార మంత్రం


టీడీపీ రెండేళ్ల పాలనలో పేరుకుపోయిన దరఖాస్తులు  

ఇంటి స్థలాలకే 70,685..

70,425 దరఖాస్తులను పరిష్కరించినట్లు చూపుతున్నవైనం

తిరస్కారానికే పరిష్కారమని పేరు పెట్టిన రెవెన్యూ యంత్రాంగం




టీడీపీ అధికారం చేపట్టింది మొదలు పేదలకు భూమి, ఇంటి స్థలాల పంపిణీ దాదాపు నిలిచిపోవడంతో అందుకు సంబంధించిన దరఖాస్తుల పెండింగ్ జాబితా పెరిగిపోయింది. అయితే రెవెన్యూ యంత్రాంగం మాత్రం వచ్చిన దరఖాస్తులను పూర్తిగా పరిష్కరించినట్లు చూపుతున్నారు. ప్రతి దరఖాస్తును గడువుకు రెండు, మూడు రోజుల ముందు వరకు ఉంచుకుని ఏదో ఒక కారణంతో తిరస్కరిస్తూ వాటినే పరిష్కారం జాబితా కింద చూపుతుండడం గమనార్హం.

 


 

 కర్నూలు(అగ్రికల్చర్): పేదలు వ్యవసాయం ద్వారా ఉపాధి పొందేందుకు గత ప్రభుత్వాలు భూపంపిణీ పేరుతో ప్రభుత్వ భూములను పంపిణీ చేశాయి. అవసరాన్ని బట్టి పేదలకు ప్రభుత్వ భూములను అసైన్డ్ చేయడం సర్వసాధారణం. అదే విధంగా పేదలకు ఒకే చోట ప్రభుత్వ భూమిలో పట్టాలు ఇచ్చి హౌసింగ్ కాలనీలు నిర్మించేవారు. ఇళ్లు లేని నిరుపేదలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఇంటి స్థలాలు కేటాయించడం రెవెన్యూ శాఖలో సాధారణం. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వ భూములను పేదలకు అసైన్డ్ చేయడం, హౌసింగ్ కాలనీల నిర్మాణానికి భూములు కేటాయించి ప్లాట్ వేయడం, వ్యక్తిగతంగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపివేసింది. రెండేళ్ల పాలనలో పేదలు ఉపాధి పొందేందుకు ప్రభుత్వ భూములు ఇవ్వడం, ఇళ్ల స్థలాలు కేటాయించిన దాఖలాలు లేవు. అనుమతి లేనిదే... ప్రభుత్వ భూములను ఎవ్వరికి అసైన్డ్ చేయవద్దని, ఇళ్ల స్థలాల కోసం భూములు కేటాయించవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇటు ఇళ్ల స్థలాలు, అటు భూముల కోసం వచ్చే దరఖాస్తులు పేరుకుపోయాయి.  మాజీ సైనికులకు కూడా భూములు ఇవ్వడాన్ని నిలిపేసింది.

 

 

 

పరిశ్రమల కోసం ప్రభుత్వ భూముల రిజర్వేషన్..

 విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వం  పరిశ్రమల స్థాపనను ప్రోత్సహిస్తోంది. ఔత్సాహికులను గుర్తించి అవసరమైన భూములు కేటాయించాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ భూములను రిజర్వులో ఉంచాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో భూములు, ఇళ్ల స్థలాల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.

 .

 

ఇంటి స్థలాల దరఖాస్తులు 70 వేలపైనే...


 ఇంటి స్థలాల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక 70,685 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఒక్క దరఖాస్తుకు కూడా ఇంటి స్థలం కేటాయించకపోయినా 70,425 దరఖాస్తులను పరిష్కరించినట్లు రెవెన్యూ శాఖకు చెందిన మీ కోసం వెబ్‌సైట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఉపాధి నిమిత్తం భూములు కేటాయించాలని 951 దరఖాస్తులు రాగా ఒక్క దరఖాస్తుకు కూడా భూమిని అసైన్డ్ చేయలేదు. అయినా 609 దరఖాస్తులను పరిష్కరించామని 342 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని మీ కోసం రిపోర్టు స్పష్టం చేస్తోంది.

 

పరిష్కారం అంటే తిరస్కారమే...

 ఒక దరఖాస్తును తిరస్కరిస్తే దానిని పరిష్కరించినట్లుగా మీకోసం వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. దరఖాస్తుపై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నందునా పరిష్కరించినట్లుగా పేర్కొంటున్నారు. కాని ప్రజా సమస్యలు ఎక్కడివక్కడ పేరుకుపోతున్నాయి. ఇంటి స్థలాల కోసం 70,685 దరఖాస్తులు వస్తే ఒక్కదానిని పరిష్కరించకున్నా ఏకంగా 70,425 దరఖాస్తులను పరిష్కరించినట్లుగా చూపడం గమనార్హం.

 

హడావుడే తప్ప... కార్యాచరణ శూన్యం

 రెండేళ్లుగా ఇదిగో పరిశ్రమలు.. అదిగో శంకుస్థాపన... అంటూ హడావుడి హంగామా చేస్తున్నా... ఇంతవరకు ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు. ఓర్వకల్లు మండలంలోనే అత్యధికంగా పరిశ్రమలు స్థాపించబడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే పరిశ్రమల స్థాపన పేరుతో ఇటు పేదలు, అటు మాజీ సైనికులకు భూములు, ఇంటి స్థలాల పంపిణీని నిలిపివే యడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాకు పరిశ్రమలు రావడం అవసరమే అయినా అవసరాన్ని బట్టి పేదలకు కూడా భూములు, ఇంటి స్థలాలు పంపిణీ చేయాల్సిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top