లక్షలు పాయె.. బహుమతి రాకపాయె!


చిత్తూరు : మోసానికి ఆకాశమే హద్దుగా మారింది. మోసపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా చిత్తూరు జిల్లా బి.కోత్తకోటలో ఇలాంటి సంఘటనే శనివారం వెలుగులోకి వచ్చింది. బి.కొత్తకోట నందిశెట్టి వీధికి చెందిన కె.సరస్వతి, బి.హరిశ్చంద్రప్రసాద్‌ అక్కాతమ్ముళ్లు. సరస్వతి రెండేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లగా హరి స్థానికంగా క్షౌర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సరస్వతి కువైట్‌లో వివా సిమ్‌ కార్డు తీసుకుంది. మార్చి 28న వివా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి పేరుతో ఆమెకు ఫోన్‌ వచ్చింది. మీరు వినియోగిస్తున్న నంబరుకు రూ.44.70 లక్షల నగదు, 10 తులాల బంగారం, ఒక ఐఫోన్‌ బహమతి వచ్చిందంటూ అవతలి వ్యక్తి చెప్పాడు.



ఈ విషయాన్ని ఆమె బి.కొత్తకోటలో ఉన్న తమ్ముడు హరికి ఫోన్‌లో చెప్పగా ఇలాంటి వాటిని నమ్మవద్దన్నాడు. అయినా బహుమతి వచ్చింది నిజమేనని నమ్మి కువైట్‌ నుంచే రూ.80 వేలను వారు చెప్పిన ఖాతాకు జమ చేసింది. తర్వాత హరి కూడా వరుసగా రూ.35 వేలు, రూ.45,150, రూ.45,200, రూ.45 వేలు, రూ.50 వేల చొప్పున నాలుగుసార్లు, రూ.20 వేలు, రూ.52 వేలు, రూ.30 వేలు, రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున ఐదుసార్లు మొత్తం రూ.7.13 లక్షలను బి.కొత్తకోట బ్యాంకుల నుంచి ఫోన్‌లో చెప్పిన ఖాతాలకు జమ చేశాడు. నగదు జమ చేసి నెల గడిచినా బహుమతి సొమ్ము అందలేదు.



దీంతో హరి వివా కంపెనీ ఉద్యోగులుగా చెప్పుకొన్న ఇద్దరు వ్యక్తుల నంబర్లకు హరి ఫోన్‌ చేయగా ఇంకో రూ.1.75 లక్షలను బ్యాంకులో జమ చేస్తే బహుమతిగా వచ్చిన నగదు పంపిస్తామని చెప్పడంతో అనుమానం వచ్చింది. తాను నగదు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాలు కువైట్‌కు చెందినవా కాదా అని తెలుసుకునేందుకు స్థానిక ఓ బ్యాంకు అధికారిని సంప్రదించగా అవి గోరఖ్‌పూర్‌ బ్యాంకుకు చెందినవిగా గుర్తించారు. దీంతో మోసపోయామని గ్రహించి స్థానిక ఎస్‌ఐ మల్లికార్జునను ఆశ్రయించాడు. కువైట్‌ టెలికం రెగ్యులేటరీ అథారిటీ పేరిట సరస్వతికి అందిన లేఖలు, ఎప్పుడెప్పుడు ఎంత నగదును జమ చేసింది తెలుపుతూ ఆ వివరాలు అందజేశాడు. వీటిని పరిశీలించిన ఎస్‌ఐ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top