పేదలకు గూడు ఇక కలే..

పేదలకు గూడు ఇక కలే.. - Sakshi


- బడ్జెట్ అరకొర

- ఐఏవై గృహాలే దిక్కు

- జిల్లాకు 6 వేల గృహాలూ కరువే

- వైఎస్సార్ హయాంలో అందరికీ ఇళ్లు

- బాబు హయాంలో మొండిచేయి

సాక్షి, నెల్లూరు:
దివంగత నేత వైఎస్సార్ తన హయాంలో పేదల అవసరాలు గుర్తించి అడిగిన వెంటనే పక్కాగృహాలు నిర్మించారు. ప్రస్తుతం చంద్రబాబు సర్కార్ అర్హులకు పక్కాగృహాలు మంజూరు చేయడం అటుంచితే వైఎస్సార్ హయాంలో నిర్మించుకున్న గృహాలకు బిల్లులు ఇవ్వకపోగా  అసంపూర్తిగా నిలిచిన వాటిని రద్దు చేస్తోంది. గతంలో పక్కాగృహాల నిర్మాణంలో అక్రమాలు జరగాయనే సాకులుచూపి కొత్తగృహాలను ఇవ్వక పోగా మరోవైపు పక్కాగృహాల కోసం పేదలు పెట్టుకున్న వినతులను సైతం చెత్తబుట్టలో వేసింది.



తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గృహనిర్మాణానికి కేటాయించిన నిధులను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. బడ్జెట్‌లో గృహనిర్మాణానికి  కేవలం రూ. 808 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయిం చారు. ఈ బడ్జెట్‌తో కేవలం 80 వేల గృహాలను మాత్రమే నిర్మించవచ్చు. జిల్లాకు 6 వేల గృహాలు మాత్రమే వస్తాయి. ఈ గృహాలు  ఏమూలకు సరిపోయే పరిస్థితి ఉండదు. మరోవైపు పక్కాగృహాల కోసం జిల్లా వ్యాప్తంగా లక్షకు పైనే వినతులు వచ్చాయి. అలాంటిది వేల గృహాలు సరిపడే పరిస్థితి లేదు.



పైగా చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాక  కేంద్రం ఇచ్చే ఇందిరా ఆవాస్ యోజన గృహాలతో సరిపెట్టే పరిస్థితి కనపడుతోంది. ఇందిరా ఆవాస్ యోజన కింద 13 జిల్లాలకు కలిపి 80 వేల గృహాలు కేటాయిస్తారు. ఒక్కో జిల్లాకు 6 వేల గృహాలు మంజూరు చేస్తారు. ఒక్కో గృహానికి లక్ష చొప్పున రాష్ట్ర మొత్తానికి కలిపితే 80 వేల గృహాలు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణానికి కేటాయించిన రూ.808 కోట్ల మొత్తాన్ని చూస్తే చంద్రబాబు ప్రభుత్వం  కేవలం కేంద్రం కేటాయించే ఇందిరా ఆవాస్ యోజన గృహాలను మాత్రమే బడ్జెట్‌లో చూపించినట్లు స్పష్టమవుతోంది.



ఈ లెక్కన రాష్ట్ర ప్రభుత్వం పేద లకు పక్కాగృహాలు ఇచ్చే పరిస్థితి కానరావడంలేదు. మరోైవె పు ఇందిరమ్మ మూడువిడతలకు సంబంధించి ఇంకా ప్రారంభం కాలేదన్న సాకు చూపి జిల్లా వ్యాప్తంగా 76 వేల ఇందిరమ్మ గృహాలను ప్రభుత్వం రద్దు చేసింది. పేదల గూడు సంగతి పట్టించుకోకుండా  ఆర్థిక భారా న్ని తగ్గించుకునేందుకే ప్రభుత్వం గృహా లను  రద్దు చేసింద న్న విమర్శలున్నాయి.  

 

వైఎస్సార్ హయాంలో: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006-07లో ప్రభుత్వం పేద, మధ్యతరగతి వారికి  గూడు కల్పించాలన్న ఉద్దేశంతో  ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 84,659 పక్కాగృహాలను మంజూరు చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వీటిలో 66,647 గృహాలు పూర్తి అయ్యాయి. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో మరో 12,694 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో నిలిచి పోగా,మిగిలిన 5,318 గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. రెండో విడతలో 94,778 గృహాలు మంజూరయ్యాయి. వీటిలో 55,803 గృహాలు పూర్తి అయ్యాయి.



మరో 8,915 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. ఇక 30,060 గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. మూడో విడతలో 52,042 గృహాలు మంజూరుకాగా 23,721 గృహాలు పూర్తి అయ్యాయి. మిగిలిన 24,583 గృహాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఈ లెక్కన ఇందిరమ్మ మూడు విడతలలో 59,961 గృహాలు ప్రారంభంకాలేదు. ఈ లెక్కన జిల్లాకు ఏడాదికి దాదాపు లక్ష గృహాలను వైఎస్సార్ కేటాయించారు.



మరోవైపు జిల్లాలో దాదాపు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 50 వేల గృహాలకు సంబంధించిన బిల్లులు  ప్రభుత్వం మంజూరు చేయలేదు.   బిల్లుల మంజూరుకు సంబంధించిన వెబ్‌సైట్‌నే ప్రభుత్వం నిలిపి వేసింది. దీంతో లబ్ధిదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి చేసుకున్న గృహాలకైనా బిల్లులు మంజూరు చేయాలంటూ గృహనిర్మాణ శాఖ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top