6 గంటలు.. రూ.1.48 లక్షలు!

6 గంటలు.. రూ.1.48 లక్షలు! - Sakshi


ఇచ్ఛాపురం: శనివారం అర్ధరాత్రి.. సమయం 1.30 గంటలు దాటింది..అది ఇచ్ఛాపురం సమీపంలోని పురుషోత్తపురం అంతర్ రాష్ట్ర ఉమ్మడి చెక్‌పోస్టు ప్రాంగణం..వాహనాలు వస్తున్నాయి.. ఆగుతున్నాయి.. కొందరు కౌంటర్ల వద్దకు వెళ్లి ముడుపులు ముట్టజెబుతున్నారు.. పత్రాలపై ఆమోద ముద్రలు వేయించుకుంటున్నారు. వాహనాలు ముందుకు కదులుతున్నాయి. షరా మాములే అన్నట్లు ఈ వ్యవహారం సాఫీగా సాగిపోతోంది..ఇంతలో నాలుగు వాహనాలు వచ్చి అక్కడ ఆగాయి.. వాటిలోంచి దిగిన వ్యక్తులు.. వెనువెంటనే చెక్‌పోస్టు ప్రాంగణంలోకి చొచ్చుకుపోయారు. వీరిని గమనించిన కొందరు పరుగులు తీశారు. మరికొందరు దొరికిపోయారు. వచ్చినవారు ఏసీబీ అధికారులని కొన్ని క్షణాల్లోనే అందరికీ తెలిసిపోయింది. దాంతో ఒకటే కలకలం.

 

 సిబ్బందిగా మారి పరిశీలన

 విశాఖపట్నం, విజయనగరం ఏసీబీ డీఎస్పీలు నర్సింహారావు, సి.హెచ్.లక్షీపతిల ఆధ్వర్యంలో ఆరుగురు సీఐలు, సుమారు 25  మంది ఏఆర్ కానిస్టేబుళ్లు నాలుగు ప్రత్యేక వాహనాల్లో నేరుగా చెక్‌పోస్టు ఆవరణకు చేరుకున్నారు. ఎప్పుడూ పట్టణంలోని రహదారి గుండా వచ్చే అధికారులు.. ఈసారి జాతీయ రహదారి మీదుగా వచ్చారు. వారి రాకను గమనించిన దళారులు, ప్రైవేటు వ్యక్తులు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఆవరణ బయటే ఉన్న మార్కెట్ కమిటీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కౌంటర్ల సిబ్బంది కూడా అక్కడి నుంచి మాయమయ్యారు. కాగా అదే ఆవరణలో అనధికారికంగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రైవేటు వ్యక్తులను ఏసీబీ అధికారులు అదపులోకి తీసుకున్నారు. అనంతరం చెక్‌పోస్టు లోపల ఉన్న వివిధ విభాగాల కౌంటర్ల వద్దకు వెళ్లి అక్కడి సిబ్బందితో కలిసిపోయారు. తాము సిబ్బందిలాగే అక్కడ ఉండి పరిశీలన మొదలుపెట్టారు. ఇదేమీ తెలియని వాహనాల సిబ్బంది కౌంటర్ల వద్దకు వచ్చి ఎప్పటి మాదిరిగానే మామూళ్లు చెల్లించుకొని.. తమ పత్రాలపై రాజముద్రలు వేయించుకొని వెళ్లిపోవడాన్ని గమనించారు.  ఇలా ఉదయం ఆదివారం ఉదయం 7.30 గంటల వరకు పరిశీలించగా రూ.1.48 లక్షలు వసూలయ్యాయి.

 

 తనిఖీల జాప్యంతో లారీల సిబ్బంది అసంతృప్తి

 ఏసీబీ దాడుల కారణంగా పత్రాల తనిఖీ ఆలస్యంగా సాగుతుండటంతో వాహనాల సిబ్బంది పెద్ద సంఖ్యలో నిలిచిపోయారు. వారంతా అసంతృప్తితో కేకలు వేయడంతో కౌంటర్ల వద్ద గందరగోళం ఏర్పడింది. అయితే ఏసీబీ దాడుల విషయం తెలుసుకొని మౌనం వహించారు. కాగా మార్కెట్ కమిటీ, ఎక్సైజ్ కౌంటర్ల సిబ్బంది పరారు కావడంతో తనిఖీలకు ఎవరూ లేకుండాపోయారు. దాంతో  కొందరు వాహనాల డ్రైవర్లే పత్రాలపై స్టాంపులు కొట్టుకొని వెళ్లిపోయారు.

 

 అక్రమ వసూళ్లు పునరావృతం:ఏసీబీ డీఎస్పీ

 ఈ సందర్భంగా విజయనగరం ఏసీబీ డీఎస్పీ లక్ష్మీపతి మాట్లాడుతూ గతంలో మూడుసార్లు వరుసగా దాడులు నిర్వహించడంతో అక్రమ వసూలు తగ్గినా.. మళ్లీ కొద్దికాలానికే పెరిగిపోయాయన్నారు. తాజా దాడుల్లో రూ.1.48 లక్షలు దొరకడం దీన్ని స్పష్టం చేస్తోందన్నారు. ఈ దాడుల్లో ఐదుగురు అనధికార సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. పూర్తి వివరాలతో ఉన్నతాధికారులు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు వి.రమణమూర్తి, రమేష్, రామకృష్ణ, లక్ష్మోజీ, గణేశ్, అజాద్‌లు పాల్గొన్నారు.

 

 దాడులు దాడులే.. దందా దందాయే

 అక్రమ వసూళ్లు.. దళారుల దందా చెక్‌పోస్టుకు షరా మామూలే. ఏసీబీ దాడులు జరిగినప్పుడు కొద్దిరోజులు తోకముడవడం.. తర్వాత యథాప్రకారం దందా సాగించడం ఇక్కడ నిత్యకృత్యం. ఏడు నెలల క్రితం వరుసగా మూడుసార్లు దాడులు చేసి చెక్‌పోస్టు సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తించినా వారిలో మార్పు రాలేదని ప్రస్తుత వసూళ్లు స్పష్టం చేశాయి. గత ఏడాది డిసెంబర్ 21న జరిపిన దాడుల్లో రూ.2.15 లక్షలు, అదే నెల 29 నాటి దాడుల్లో రూ.1.25 లక్షలు లభించగా.. ఈ ఏడాది జనవరి 18న జరిపిన దాడుల్లో కేవలం రూ.6వేలు మాత్రమే పట్టుబడ్డాయి. అలాగే  మొదటి దాడిలో 5గురు చెక్‌పోస్టు సిబ్బంది, పదిమంది అనధికార వ్యక్తులపై కేసులు నమోదు చేయగా, రెండో దాడిలో 6గురు చెక్‌పోస్టు సిబ్బంది, 7గురు అనధికార వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. దీంతో వసూళ్ల దందా తగ్గిందనుకున్నారు. కానీ అది తప్పని తాజా దాడుల్లో వెల్లడైంది. దీంతో మళ్లీ వరుస దాడులు తప్పవేమోనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తరచూ దాడులు నిర్వహిస్తే తప్ప మామూళ్ల సంస్కృతికి అడ్డుకట్ట పడదన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top