5 వేల జననాలు.. 2 వేల మరణాలు


ఏలూరు అర్బన్/భీమవరం అర్బన్ : జనన, మరణాల నమోదు ప్రక్రియలో జాప్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వైటల్ స్టాటిస్టిక్స్ డెప్యూటీ డెరైక్టర్ కె.దుర్గాప్రసాద్ తెలిపారు. సోమవారం ఏలూరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని జనన, మరణ నమోదు రిజిస్టర్లను, భీమవరం మునిసిపల్ కార్యాలయంలోని జనన, మరణ నమోదు విభాగాన్ని   ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జిల్లాలో జనన, మరణాల నమోదు ప్రక్రియ అమలును పరిశీలించేందుకు తనిఖీలు ప్రారంభించామన్నారు. జిల్లాలో నెలకు సుమారు 5 వేల జననాలు, 2 వేల వరకు మరణాలు నమోదవుతున్నాయని చెప్పారు.



గ్రామీణ ప్రాంతాల్లో సంభవించే మరణాలు, ఇళ్ల వద్ద జరిగే ప్రసవాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు కావడం లేదని దుర్గాప్రసాద్ చెప్పారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో జనన, మరణాల సమాచారాన్ని ఆయా గ్రామాల కార్యదర్శులు సేకరించి తహసిల్దార్ కార్యాలయాలకు అందించాల్సి ఉందన్నారు. అయితే వారు వివరాలు అందించడంలో జాప్యం జరుగుతుందని గుర్తించామన్నారు. దీనిని నివారించేందుకు జనన, మరణాల నమోదు బాధ్యతలను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఎల్‌డీ కంప్యూటర్ (కంప్యూటర్ ఆపరేటర్లు)కే అప్పగిస్తున్నామని దుర్గాప్రసాద్ తెలిపారు.



ఇకపై జనన, మరణాలపై వివరాలను సేకరించి నమోదు చేసేందుకు ఎల్‌డీ క ంప్యూటర్లే నేరుగా గ్రామ సెక్రటరీల నుంచి సమాచారం సేకరించి డీఎంహెచ్‌వో కార్యాలయానికి అందిస్తారన్నారు. జనన, మరణం సంభవించిన 21రోజుల్లో ప్రజలు పంచాయతీల్లో నమోదు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 30 రోజుల దాటితే రూ.2 పెనాల్టీతో, ఏడాది దాటితే నోటరీ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఏడాది దాటితే ఆర్డీవో అనుమతితో ధ్రువీకరణపత్రాలు పొందాల్సి ఉంటుందని చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top