ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం

ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి 5 కిలోల రేషన్ బియ్యం


కర్నూలు బహిరంగసభలో సీఎం

సామాజిక సాధికారిత మిషన్ ప్రారంభం

ఆర్థికసంఘం కేటాయింపుల్లో అన్యాయం

 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఏప్రిల్ నుంచి ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున కుటుంబ సభ్యులందరికీ రేషన్ బియ్యం పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. కుటుంబానికి 20 కిలోల బియ్యం పంపిణీ చేసేలా ప్రస్తుతం ఉన్న నిబంధనను ఎత్తేస్తామని చెప్పారు. కర్నూలులో శుక్రవారం ఆయన సామాజిక సాధికారిత మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ పోస్టాఫీసుకు వెళ్లలేని వృద్ధులకు ఇంటివద్దే పింఛను ఇస్తామని, వేలిముద్రలు పడలేని స్థితి ఉంటే ఐరిస్ ద్వారా పింఛన్లు ఇస్తామని చెప్పారు. సామాజిక సాధికారిత పథకాన్ని తొమ్మిది ప్రభుత్వశాఖల సమన్వయంతో అమలు చేస్తామని చెప్పారు. ఈ పథకం ద్వారా ప్రసూతి, పిల్లల మరణాలతో పాటు చదువుకునే వయసున్న పిల్లలను బడికి పంపించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని తెలిపారు. దక్షిణ భారతదేశంలో మన రాష్ట్రంలోనే ఎక్కువ ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికసంఘం కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు.ఈ పరిస్థితుల్లో 24 గంటలు కష్టపడినా ఇతర రాష్ట్రాల కంటే ముందుకు వెళ్లలేమని నిస్సహాయతను వ్యక్తం చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలను తలదన్నేలా రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు.

 

 వ్యాపార అవకాశాలన్నీ డ్వాక్రా సంఘాలకే

 డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తానని, వాటిని ప్రపంచంలోనే ఆదర్శంగా తయారు చేస్తానని చెప్పారు.రాబోయే రోజుల్లో గ్రామాల్లో ఉన్న వ్యాపార అవకాశాలన్నీ అప్పగిస్తామని తెలిపారు. పోలవరం కంటే ముందే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా 70 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా బేసిన్‌లోకి మళ్లిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, మంత్రులు రావెల , కామినేని ప్రసంగించారు.

 

 కాంగ్రెస్.. రాయలసీమకు శాపం: సీఎం

 సాక్షి ప్రతినిధి, కడప: జలయజ్ఞంలో కోట్లాది రూపాయల పనులు చేసినా నీరు లేదని, రాయలసీమకు కాంగ్రెస్ శాపంగా మారిందని సీఎం చంద్రబాబు చెప్పారు. రాయలసీమను కరువు నుంచి బయపడేలా చేస్తానన్నారు. వైఎస్సార్ జిల్లా గండికోట ప్రాజెక్టును శుక్రవారం ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గండికోటకు శంకుస్థాపన చేసింది తానేనని, నీరు తీసుకొచ్చేవరకు విశ్రమించనని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామాలయానికి ప్రభుత్వం తర ఫున పట్టువస్త్రాలు పంపుతామని చెప్పారు. శ్రీకాళహస్తి, తిరుపతి, కాణిపాకం, ఒంటిమిట్టను కలిపి టూరిజం సర్క్యూట్ చేస్తామని తెలిపారు.  

 

 చదువుతోపాటు నైపుణ్యాల అభివృద్ధి ముఖ్యం

 సాక్షి ప్రతినిధి, తిరుపతి: చదువుతోపాటు నైపుణ్యాల అభివృద్ధి ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ప్రతి ఒక్కరిలో నైపుణ్యం వెలికితీయడంతోపాటు, తెలివితేటలకు పదును పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 2014లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు తిరుపతిలోని తారకరామ స్టేడియంలో శుక్రవారం రాత్రి ఆయన పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిభ అవార్డులు అందుకున్న విద్యార్థులను శని, ఆదివారాల్లో తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నట్లు చెప్పారు. వీరు రూ.300 టికెట్ క్యూలో ఉచితంగా వెళ్లి స్వామిని దర్శించుకోవచ్చని తెలిపారు.  

 

 రక్షణ వలయంలో సీఎం పర్యటన

 ముఖ్యమంత్రి  కార్యక్రమాన్ని పూర్తి పోలీసు రక్షణ వలయంలో నిర్వహించారు. సీఎం పర్యటనకు హాజరుకాకుండా ప్రజాప్రతినిధుల్ని నిర్బంధించారు. వైఎస్సార్‌సీపీ నేతృత్వంలో ఏర్పడిన అఖిలపక్షం రెండు రోజుల పాటు పోతిరెడ్డిపాడు నుంచి గండికోట వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించింది. దీనిపై సీఎంకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించిన స్థానిక జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సహా ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, రఘురామిరెడ్డి, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే అమర్‌నాథరెడ్డి, సీపీఎం, సీపీఐ, రైతుసంఘాల ప్రతినిధులను గుర్రప్పకోన వద్ద పోలీసులు అడ్డుకున్నారు.సీఎంకు సమస్యలను వివరించాలని భావించిన బీఈడీ అభ్యర్థుల్ని యర్రగుంట్లలోనే అడ్డగించారు. ఎమ్మార్పీఎస్ నేతల్ని ఎక్కడికక్కడ అరెస్టు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top