భగ భగ


నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: రోజురోజుకూ భానుడి ప్రతాపం పెరుగుతోంది. జిల్లాలో గురువారం 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పదేళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు దాటిన వృద్ధులు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు బయట తిరగవద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌కు ఉత్వర్వులిచ్చింది. 72 గంటల పాటు వడగాలులు అధికంగా వీస్తాయని ఇండియన్ మెటియోరాలజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) సూచించింది.

 

 అధిక ఉష్ణోగ్రతల వల్ల గురువారం జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. వడదెబ్బ తగిలిన వారు శీతలపానీయాలు తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఉప్పు, చక్కెర కలిపిన నీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల వడగాలుల నుంచి బయటపడవచ్చు. పదేళ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు బయట తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ శ్రీకాంత్ సూచించారు. జిల్లాలో ఐదురోజులుగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఈ నెల  11న 41.9, 12న 42.7, 13న 42.4, 14న 43.7, 15న 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు. వడదెబ్బ తగిలిన వారు సకాలంలో వైద్యులను సంప్రదించాలని జిల్లా యంత్రాంగం సూచించింది. జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు పీహెచ్‌సీలలో వైద్యులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top