39 నామినేషన్లు తిరస్కరించారు

39 నామినేషన్లు తిరస్కరించారు

  •     నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తి

  •      282 ఆమోదం

  •      పెండింగ్‌లో రెండు

  •      నేడు, రేపు ఉపసంహరణ

  •      23న తుదిజాబితా, గుర్తులు ప్రకటన

  •  విశాఖ రూరల్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన సోమవారం పూర్తయింది. లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు మొత్తం 323 నామినేషన్లు రాగా అందులో 39 తిరస్కరించారు. 283 ఆమోదించారు. రెండు పెండింగ్‌లో పెట్టారు. జిల్లాలోని 3 లోక్‌సభ, 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 12 నుంచి 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. లోక్‌సభ స్థానాలకు 50, అసెంబ్లీ నియోజకవర్గాలకు 273 నామినేషన్లు దాఖ లయ్యాయి.



    ఆయా స్థానాల రిటర్నింగ్  అధికారులు సోమవారం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల సమక్షంలో పరిశీలించారు. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గానికి వచ్చిన 26 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అనకాపల్లి స్థానానికి 9 నామినేషన్లు రాగా అందులో రెండింటిని తిరస్కరించారు. అరకు ఎంపీకి 13 నామినేషన్లు రాగా బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించారు.



    గంజాయి కాసుబాబు నామినేషన్ చివరి రోజున మధ్యాహ్నం 3 గంటలలోపు ఫారం-ఎ, బిలు అందజేయకపోవడంతో ఆయ న పత్రం తిరస్కరణకు గురైంది. అలాగే 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు 273 నామినేషన్లు రాగా ఇందులో 36 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 236 ఆమోదించారు.   ఒక నామినేషన్‌పై మంగళవారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు  ఉపసంహరణకు గడువుంది. అదే రోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా, గుర్తులు ప్రకటిస్తారు.

     

    భీమిలి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు నామినేషన్‌ను రద్దు చేయాలంటూ సీపీఎం అభ్యర్థి ఎస్.రమేష్ రిటర్నింగ్ అధికారి ఆర్వోకు అల్లూరి సుబ్బరాజుకు ఫిర్యాదు చేశారు. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్‌ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలంలో నిర్మాణాల నిమిత్తం ఒప్పందం చేసుకుందని, ప్రభుత్వ పరంగా కాంట్రాక్ట్‌లున్న కంపెనీకి భాగస్వామిగా ఉన్న గంట ప్రజాప్రతినిథ్య చట్టం 1951,సెక్షన్ 9ఏ ప్రకారం చట్ట సభలకు ఎన్నిక కాడానికి అర్హులు కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు.



    అయితే ప్రత్యూష కంపెనీలో గంటాకు భాగస్వామ్యం లేదని. అన్ని విధాల పరిశీలించామని, ఆయన నామినేషన్ చెల్లుతుందని ఆర్వో ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో 14 మంది నామినేషన్లు వేయగా టీడీపీ డమ్మీతో పాటు జైసమైకాంధ్ర పార్టీ అభ్యర్ది ఎల్లపు వినోద్ కుమార్ వయస్సు 25 ఏళ్లకు రెండురోజులు తక్కువగావుండడంతో నామినేషన్‌ను తిరస్కరించారు.

     

    విశాఖ-ఉత్తర నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా నలుగురివి తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి జి.జవహర్‌లాల్ నెహ్రూ తెలిపారు.

     

    అరకు అసెంబ్లీ సెగ్మెంట్‌లో 22 మంది నామినేషన్లు వేయగా ఐదు తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి పద్మ తెలిపారు.

     

    పాయకరావుపేటకు వచ్చిన 16 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి శర్మ తెలి పారు. అయితే పాయకరావుపేట టీడీపీ అభ్యర్థిని వంగలపూడి అనిత సమర్పించిన కుల,పుట్టిన తేదీ ధ్రువపత్రాలపై ఇండిపెండెంట్ అభ్యర్థి చెవ్వెటి తలుపులు ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అది అసలుదా కాదా అన్నది దర్యాప్తు చేయాలని కోరారు. అభ్యంతరాన్ని సంబంధిత అధికారులకు విచారణకు పంపుతామని ఆర్వో తెలిపారు.

     

    మాడుగుల నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులులు నామినేషన్లు వేయగా 5 మందివి తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి వి.విశ్వేశ్వరరావు తెలిపారు.

     

    పాడేరు నియోజకవర్గంలో 19 మంది నామినేషన్లు వేయగా ఐదుగురివి తిరస్కరించినట్లు రిటర్నింగ్ అధికారి రాజకుమారి తెలిపారు.

     

    గాజువాక నియోజకవర్గంలో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఒకరిది తిరస్కరించినట్లు ఆర్వో భవానీదాస్ తెలిపారు. సీపీఎం అభ్యర్థులుగా సీహెచ్.నర్సింగరావు, జి.సుబ్బారావు నామినేషన్‌లు వేశారు. వీరిలో సుబ్బారావుకు పార్టీ బీఫారం లేకపోవడంతో ఆయన అభ్యర్థిత్వాన్ని కూడా తిరస్కరిస్తామనగా సుబ్బారావు విజ్ఞప్తి మేరకు మంగళవారం ఉదయం 11 గంటల వరకు గడువిచ్చారు.

     

    పెందుర్తి నియోజకవర్గంలో 12 మంది నామినేషన్లు వేయగా టీడీపీ డమ్మీగా వేసిన అభ్యర్థినిని తిరస్కరించినట్లు ఆర్వో జె.వెంకటమురళి తెలిపారు.

     

    నర్సీపట్నం నియోజకవర్గంలో 18 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా ఒకరి నామినేషన్‌ను తిరస్కరించినట్లు ఆర్వో సూర్యారావు తెలిపారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top