ప్రాణాలు తోడేస్తున్న సూరీడు


 చండప్రచండంగా మండిపోతున్న సూరీడు ప్రజల ప్రాణాలను తోడేస్తున్నాడు. ఆదివారం మరింత చెలరేగి జిల్లాలో 30 మందిని బలిగొన్నాడు. నిన్నటివరకు మృతులందరూ వృద్ధులు కాగా ఆదివారం 24 ఏళ్ల యువకుడు, ఐదేళ్ల బాలిక మరణించటం విషాదాన్ని మిగిల్చింది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేసింది.

 

 సీతానగరం: ఒక్క సీతానగరం మండలంలోనే ఆదివారం  ఏడుగురు మరణించారు. సీతానగరం మండలం పెదబోగిలి మేజరు పంచాయతీ పరిధిలోని సీతానగరం కాలనీలో సాకేటి బంగారమ్మ(58),సురగాల కుయ్యన్న(60) మృతిచెందారు. అప్పయ్యపేటలో చెందాన అచ్చమ్మ(60), బూర్జ గ్రామానికి చెందిన అల్లు సూర్యనారాయణ (58), అల్లు నారాయణమ్మ(86), చినబోగిలి గ్రామానికి చెందిన కొక్కిరిగడ్డ కళావతి (50), బుడ్డిపేట గ్రామానికి చెందిన మేడవరపు నారాయణమ్మ (94) మృతి చెందినట్లు ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఎంపీటీసీ సభ్యులు తెలిపారు. దీంతో మండలంలో వడదెబ్బకు మృతిచెందినవారి సంఖ్య 11కు చేరింది.

 

 ప్రభుత్వ సాయం పొందటానికి పోస్టుమార్టం కీలకం

 వడదెబ్బకు గురై మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం పొందడానికి పోస్టుమార్టం రిపోర్టు కీలకమని తహశీల్దార్ బి.సత్యనారాయణ చెప్పారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మృతదేహాలకు పోస్టుమార్టం తప్పనిసరిగా చేయించాలని ఆయన పేర్కొన్నారు.

 

 భోగాపురం మండలంలో ఒకరు..

 భోగాపురం : మండలంలోని ముక్కాం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు వడదెబ్బ కారణంగా ఆదివారం మృతిచెందారు. నాలుగు రోజులుగా కాస్తున్న ఎండలు, వీస్తున్న వడగాడ్పులకు వాసుపల్లి దానమ్మ (70) అనే వృద్ధురాలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మంచం పట్టిన ఆమె ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు.

 

 కొమరాడ మండలంలో ఒకరు

 కొమరాడ: మండలంలోని దుగ్గి గ్రామానికి చెందిన కొంగరాపు సోములు(54) ఆదివారం వడదెబ్బకు గురై మృతి చెందారు. ఈయన వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. గత మూడురోజులుగా వడగాలులు కారణంగా అస్వస్థతకు గురై ఆదివారం మృతి చెందారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబం వీధిన పడింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం  ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరారు.

 

 పూసపాటిరేగలో ఒకరు

 పూసపాటిరేగ: మండలంలోని చల్లవానితోటలో ఆదివారం ఉదయం గులివిందల సత్యమమ్మ(60) అనే వృద్ధురాలు వడదెబ్బకు తట్టుకోలేక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు విలపించారు.

 

 నెల్లిమర్ల మండలంలో ఒకరు..

 నెల్లిమర్ల: మండలంలోని కొత్తపేట పంచాయతీ సువ్వానిపేటకు చెందిన పాలూరి పైడమ్మ (55) ఆదివారం వడదెబ్బకు గురై మృతి చెందారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అమె వారం రోజుల నుంచి కాస్తున్న తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక మృతి చెందినట్లు బంధువులు చెప్పారు.

 

 కురుపాం మండలంలో ఒకరు

 కురుపాం: మండలంలోని ఉదయపురం గ్రామానికి చెందిన పత్తిక సత్యం(45) అనే గిరిజనుడు వడదెబ్బ కారణంగా శనివారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. పత్తిక సత్యం శనివారం ఉదయం జీడి తోటకు వె ళ్లి ఇంటికి చేరుకున్నాక తీవ్ర అస్వస్థతకు గురవడంతో మొండెంఖల్ పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ నుంచి పార్వతీపురం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

 

 బలిజిపేట మండలంలో మహిళ

 గళావల్లి(బలిజిపేట రూరల్): గళావల్లి గ్రామంలో ఆదివారం వడదెబ్బకు రగుమండల రాముడమ్మ(65) మృతి చెందారు. గత మూడు రోజుల నుండి మంచం పట్టి ఉన్న రాముడమ్మ ఆదివారం ఎండ తీవ్రతను తట్టుకోలేక సాయంత్రం 7 గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

 

 గరివిడి మండలంలో ఇద్దరు

 చీపురుపల్లి రూరల్: గరివిడి మండలం దేవాడ, రేగటి గ్రామాల్లో ఆదివారం ఇద్దరు వ్యక్తులు వడదెబ్బకు గురై మృతి చెందారు.  దేవాడ గ్రామానికి చెందిన కర్ణపు రాములమ్మ(60), రేగటి గ్రామానికి చెందిన పతివాడ అప్పలనాయుడు(55) వడదెబ్బ కారణంగా మరణించినట్లు స్థానికులు తెలిపారు.

 

 బొబ్బిలి మండలంలో ముగ్గురు

 రంగరాయపురం (బొబ్బిలి రూరల్): బొబ్బిలి మండలం రంగరాయపురం గ్రామానికి చెందిన రెడ్డి రాములమ్మ(65) ఆదివారం సాయంత్రం వడదెబ్బతో మృతి చెందారు. ఈ విషయాన్ని గ్రామ సర్పంచ్ చొక్కాపు నారాయణరావు తెలిపారు. రాములమ్మ మృతిపై రెవెన్యూ, పోలీసు అధికారులకు సమాచారం ఇచ్చారు. బొబ్బిలి పట్టణ పరిధిలోని ప్రేమనగర్‌కాలనీకి చెందిన బోను సాంబయ్య(55) వడదెబ్బకు మృతి చెందారు. వ్యవసాయకూలీగా ఉంటూ జీవనం సాగిస్తున్న సాంబయ్య అకస్మాత్తుగా కుప్పకూలి మృతిచెందారు. ఆతనికి భార్య, కుమారుడు ఉన్నారు. పోలవానివలస గ్రామానికి చెందిన ఉంగరాపు చిన్నమ్మి(75) వడదెబ్బకు మృతిచెందారు.

 

 గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

 గుర్ల: మండలంలోని పెదబంటుపల్లి జిల్లా పరిషత్ పాఠశాల సమీపంలో రోడ్డు పక్కన చెట్టు కింద ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల నుంచి సమాచారం రాగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. గరివిడి నుంచి గర్భాం వెళ్లే రహదారి పక్కన పెదబంటుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో ఓ వ్యక్తి తన చొక్కాను కింద పరుచుని చెట్టు నీడలో సేదదీర్చుకుంటున్న సమయంలో వేసవి తాపానికి మృత్యువాత పడినట్లు అంచనా వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

 పార్వతీపురం మండలంలో ఇద్దరు

 పార్వతీపురం టౌన్: పార్వతీపురం మండలం సంగంవలస గ్రామానికి చెందిన సావిత్రి(65) వడదెబ్బ కారణంగా శనివారం తీవ్ర అస్వస్థతకు గురై పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో అపస్మారక స్థితిలో ఉన్న సావిత్రి రాత్రి మృతిచెందారు. పార్వతీపురం పట్టణం కంచవీధికి చెందిన బార్నాల నారాయణ (70) వడదెబ్బ కారణంగా ఆదివారం సాయంత్రం మృతి చెందారు. స్థానిక నెహ్రూమార్కెట్‌లో సాయంత్రం అపస్మారక స్థితిలోకి వెళ్లి అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు స్థానికంగా ఓ ప్రైవేటు కళాశాలలో నైట్ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.

 

 లక్కవరపుకోట మండలంలో ఇద్దరు

 వీరభద్రపేట(లక్కవరపుకోట): లక్కవరపుకోట మండలం వీరభద్రపేట గ్రామానికి చెందిన ఇద్దరు వృద్ధులు వడదెబ్బ కారణంగా శనివారం రాత్రి మరణించినట్లు లక్కవరపుకోట ఇన్‌చార్జి ఎస్సై బాలాజీరావు తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఏడువాక రాములమ్మ(78), వి.వేరేసమ్మ(71) వడదెబ్బ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై మరణించినట్లు గ్రామ రెవెన్యూ కార్యదర్శి జి.మాధవీలత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శవపంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు తరలించారు.

 

 దత్తిరాజేరు మండలంలో ఒకరు

 దత్తిరాజేరు(గజపతినగరం): దత్తిరాజేరు మండలం వింద్యవాసి గ్రామానికి చెందిన డెక్క అప్పలనాయుడు (65) వడదెబ్బకు గురై ఆదివారం మధ్యాహ్నం మృతి చెందారు. బహిర్భూమికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వడగాలులకు తాళలేక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు.

 

 జామిలో వృద్ధుడు మృతి

 జామి: జామి ఎస్సీ కాలనీకి చెందిన చిప్పాడ అప్పన్న (63) ఎండవేడి కి తట్టుకోలేక అస్వస్థతకు గురై ఆదివారం మృతి చెందారు. మృతునికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. అప్పన్న మృతదేహాన్ని తహశీల్దార్ ఆర్.ఎర్నాయుడు, ఎస్సై ఎం.ప్రశాంత్‌కుమార్ సందర్శించి వివరాలు సేకరించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top