వడ దెబ్బకు పిట్టల్లా రాలిన జనం


ఎండ వేడి, వడగాడ్పులకు జిల్లాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు. శనివారం ఒక్కరోజే 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల ందరూ వృద్ధులే కావటం గమనార్హం. ఇంటి పెద్దల అకాల మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

 

 తుమరాడ(బలిజిపేట రూరల్): వడదెబ్బ కారణంగా శనివారం బలిజిపేట మండలంలోని తుమరాడ, పలగర గ్రామాల్లో ముగ్గురు మృతి చెందారు. తుమరాడలో ఎడ్ల పాపయ్య(65), వి.దాలెమ్మ(62) మృతి చెందగా పలగరలో గొడబ తౌడమ్మ(65) మృతి చెందింది. వీరిలో తౌడమ్మ చాకలి వృత్తి చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈమెకు ముగ్గురు కుమారులు ఉన్నారు. భర్త మృతి చెందాడు, పిల్లలు వేరుగా ఉండడంతో వృత్తి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఉదయం ఉతికే బట్టలు తెచ్చేందుకు వెళ్ళిన తౌడమ్మ ఒక్కసారిగా పడిపోయి మృతి చెందింది. తుమరాడలో వి.దాలెమ్మ గత మూడు రోజులుగా మంచం పట్టి ఉన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో శనివారం మృతి చెందారు.

 

 చీపురుపల్లి మండలంలో ఇద్దరు..

 రామలింగాపురం(చీపురుపల్లి రూరల్): చీపురుపల్లి మండలం రామలింగాపురం గ్రామానికి చెందిన ఇప్పిలి అప్పన్న(60), పేరిపి గ్రామానికి చెందిన గడి అప్పన్న(60) శనివారం వడదెబ్బకు గురై మరణించారు.

 

 కొమరాడ మండలంలో ఒకరు..

 కురుపాం/కొమరాడ: కొమరాడ మండలం దేవుకోన పంచాయతీ పరిధి పూర్ణపాడు గ్రామానికి చెందిన బట్లభద్ర తవిటయ్య (55) అనే వృద్ధుడు శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీవ్రమైన ఎండతోపాటు వడగాడ్పుల కారణంగా అస్వస్థతకు గురై ఇంట్లోనే మృత్యువాత పడినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతునికి భార్య నీలమ్మ ఉన్నారు.

 

 దత్తిరాజేరు మండలంలో ముగ్గురు..

 దత్తిరాజేరు(గజపతినగరం): మండలంలోని పెదమానాపురం గ్రామానికి చెందిన గురిపిల్లి రాములమ్మ(62) వడదెబ్బకు గురై శనివారం మధ్యాహ్నం మృతి చెందారు. తీవ్రమైన ఎండతోపాటు వేడిగాలులకు సొమ్మసిల్లి పడిపోయిన రాములమ్మను కుటుంబ సబ్యులు 108 వాహనంలో గజపతినగరం ఆస్పత్రికి తరలిస్తుండగా పెదమానాపురం పోలీస్ స్టేషను వద్దకు వచ్చేసరికి మృతి చెందారు.మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన శీర కన్నయ్య(60) శనివారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో వడదెబ్బకు గురై మృతిచెందారు. పెదమానాపురం గ్రామంలో జరిగిన సంతకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో వడగాల్పులకు అస్వస్థతకు గురై మరణించారు. కన్నయ్య పోలీసు శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. అలాగే మరడాం గ్రామానికి చెందిన నాగోలు సూర్యనారాయణ (58) మృతి చెందారు.

 

 నెల్లిమర్ల మండలంలో ముగ్గురు..

 నెల్లిమర్ల: శనివారం వీచిన వేడిగాడ్పులకు మండలానికి చెందిన ముగ్గురు మరణించారు. వివరాలు.. సీతారామునిపేట పంచాయతీ గొర్లిపేట గ్రామానికి చెందిన టేకు అన్నపూర్ణ శుక్రవారం ఎండదెబ్బకు విలవిలలాడింది. రాత్రంతా వీచిన వేడిగాలులకు తట్టుకోలేక శనివారం వేకువజామున 3.30 గంటల ప్రాంతంలో కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. శుక్రవారం థామస్‌పేటకు చెందిన కెల్ల ఆదిలక్ష్మి, అలుగోలు గ్రామానికి చెందిన మత్స సూరమ్మ అనే వృద్ధులు చనిపోయారు. దీంతో ఇప్పటిదాకా మండలానికి చెందిన ముగ్గురు చనిపోయినట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. నెల్లిమర్ల గాంధీనగర్ కాలనీకి చెందిన మరో ఇద్దరు, కొత్తపేట పంచాయతీ టొంపల పేటకు చెందిన ఒకరు గత మూడురోజుల్లో వడదెబ్బకారణంగా చనిపోయినట్లు వారి బంధువులు చెబుతున్నప్పటికీ ఇతర కారణాలతో చనిపోయినట్లు తమ పరిశీలనలో తేలినట్లు డీటీ హే మంత్‌కుమార్ తెలిపారు. ఎక్కడైనా వడదెబ్బతో చనిపోతే ఫోన్ నంబరు 9550749597కు సమాచారం అందించాలని సూచించారు. అలాగే మండలంలోని సతివాడ పంచాయతీ ఎంబేరయ్య గుళ్లు గ్రామానికి చెందిన అయినంపూడి చంద్రరాజు (60), నగర పంచాయితీ పరిధిలోని కీర్తివీధికి చెందిన జమ్మునారాయణ(89) ఎండదెబ్బకు తాళలేక శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో మరణించారు.

 

 భోగాపురం మండలంలో ఒకరు..

 భోగాపురం: మండలం ముంజేరు గ్రామానికి చెందిన పిడుగు చంద్రరావు (65) వడదెబ్బ కారణంగా మృతి చెందారు. శుక్రవారం మధ్యాహ్నం గ్రామానికి చేరువలో పశువులను మేపుతుండగా ఆయన వడదెబ్బకు గురయ్యారు. స్థానికులు వెంటనే ఇంటికి తీసుకువచ్చి సపర్యలు చేశారు. ప్రయివేటు వైద్యుడితో ప్రథమ చికిత్స చేయించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చంద్రరావు మరణించారు. సర్పంచ్ కానూరి రామకృష్ణ, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పిడుగు రాంబాబు, పల్లంట్ల బుచ్చిబాబు, పిడుగు చిట్టిబాబు తదితరులు మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

 

 జామి మండలంలో ఒకరు..

 వి.ఆర్.పాలెం(జామి): జామి మండలం వి.ఆర్.పాలెం గ్రామానికి చెందిన నక్కా కృష్ణ(65) అనే వృద్ధుడు ఎండవేడిమి, ఉక్కబోత తట్టుకోలేక శనివారం ఇంటి వద్దే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు  ఉన్నారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు రోదించారు.


 ఎస్.కోట మండలంలో ఇద్దరు

 ధర్మవరం(శృంగవరపుకోట): మండలంలోని ధర్మవరం ఎస్సీకాలనీలో నివాసం ఉంటున్న అనకాపల్లి పైడమ్మ(68) శుక్రవారం గ్రామంలో బోరువావి వద్దకు నీటికి వెళ్లింది. బోరు బావి నుంచి ఇంటికి వచ్చిన పైడమ్మ వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురయింది. శనివారం తెల్లవారుజామున మరణించింది, గతంలో ఎలాంటి అనారోగ్యం లేదని, వడదెబ్బ వల్ల చనిపోయిందని కుటుంబ సభ్యులు చెప్పారు.

 

 పార్వతీపురంలో మహిళ మృతి

 పార్వతీపురం టౌన్: పార్వతీపురం పట్టణం బందంవారివీధి సెయింట్ పీటర్స్ స్కూల్ సమీపంలో నివాసం ఉండే ముగిది లక్ష్మి (50) వడదెబ్బతో శనివారం ఉదయం మృతి చెందారు. మృతురాలికి భర్త, కూతురు ఉన్నారు. పేదకుటుంబానికి చెందిన లక్ష్మి స్థానిక హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. భర్త అనారోగ్యంతో కదలలేని పరిస్థితిలో ఉండగా, భర్త చనిపోయిన కుమార్తె తల్లి వద్దే ఉంటున్నారు. లక్ష్మి చనిపోవడంతో భర్త, కుమార్తె అనాథలయ్యారు.

 

 విజయనగరం మండలంలో ఇద్దరు..

 విజయనగరం రూరల్: భానుడి ప్రతాపంతో శుక్రవారం రాత్రి మండల పరిధిలోని జొన్నవలస గ్రామానికి చెందిన రైతు మహంతి ఆదినారాయణ (65), పట్టణ పరిధిలోని వీటి అగ్రహారం గణేష్‌నగర్‌కు చెందిన పెదపెంకి ప్రసాద్ (60) అస్వస్థతకు గురై మరణించారు. సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు గ్రామాలకు వెళ్లి మృతుల వివరాలు నమోదు చేసుకున్నారు.

 

 సీతానగరం మండలంలో గుర్తు తెలియని మహిళ..

 సీతానగరం: మండలంలోని చినబోగిలి పాపినాయుడు చెరువు సమీపంలో శనివారం గుర్తుతెలియని మహిళ (70) వడదెబ్బకు గురై మృతిచెందారు. చినబోగిలి గ్రామస్తుల కథనం ప్రకారం.. మృతురాలు చినబోగిలి నుంచి ఆర్ వెంకంపేట వెళ్లి 11 గంటల సమయంలో తిరిగి వస్తూ రైల్వేగేటు వద్ద ఉన్న బోరు నీరు తాగారు. అక్కడనుంచి చినబోగిలి వస్తుండగా మార్గమధ్యంలో చెట్టు కింద పడి మృతి చెందారు. పోలీసులకు వచ్చి మృతదేహాన్ని బొబ్బిలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ఖననం చేయించారని వీఆర్‌వో కిరణ్‌కుమార్ తెలిపారు. మృతురాలు కొమరాడ మండలం దళాయిపేటకు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు.

 

 జియ్యమ్మవలస మండలంలో ఒకరు..

 జియ్యమ్మవలస:  మండలంలోని చినతుంబలి గ్రామానికి చెందిన నెల్లి వెంకటి(65)వడదెబ్బకు గురై శనివారం మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

 

 విజయనగరంలో గుర్తు తెలియని వ్యక్తి

 విజయనగరం క్రైం: పట్టణంలోని ఇందిరానగర్ రైల్వేట్రాక్ పక్కన సుమా రు 50 సంవత్సరాల గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో మృతి చెందినట్లు వన్‌టౌన్ సీఐ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. రైల్వేట్రాక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి శని వారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఎండతీవ్రతకు గిలగిలకొట్టుకుంటున్నట్టు చూసిన వ్యక్తి చూసి 108కు సమాచారం అందించగా వారు వచ్చేసరికి మృతిచెందాడని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

 ఆర్టీసీ కార్మికుని మృతి

 శృంగవరపుకోట: ఎస్.కోట ఆర్టీసీ డిపోలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న మహ్మద్ బాషా శనివారం సాయంత్రం వడదెబ్బ కారణంగా ప్రాణాలు వదిలారు. ఆయన మృతితో కుటుంబం రోడ్డున పడింది. కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. పట్టణంలోని శ్రీనివాసకాలనీకి చెందిన మహ్మద్ బాషా(50) శనివారం తనకు డ్యూటీ లేకున్నా డ్యూటీ చేయాల్సిన వ్యక్తి లీవ్ పెట్టటంతో వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో బస్సు రిపేర్ చేస్తూ ఇబ్బందిగా ఉందని చెప్పి కూర్చున్నారు. అదే సమయంలో బస్సును బయటికి పంపాలి.. బ్యాటరీకి కనెక్షన్ ఇవ్వాలని తోటి వర్కర్లు చెప్పటంతో తాను కలుపుతానంటూ వచ్చి కనెక్షన్ ఇచ్చి కుప్పకూలిపోయారు. తోటి సిబ్బంది వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చాక దాదాపు గంట తర్వాత బస్సులో పక్కనే ఉన్న అభ య్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ వైద్యపరీక్షలు చేస్తుండగా భాషా మరణించారు. వడదెబ్బ వల్లే అతడు మరణించినట్టు డాక్టర్ ఎం.ఎన్.చారి చెప్పారు. బాషా మరణంతో కుటుంబం రోడ్డున పడిందని ఆతని భార్య రజియాబేగం, కుమారులు రఫీ, షఫీ గగ్గోలు పెట్టారు. ఆర్టీసీ అధికారులు, తోటి సిబ్బంది సకాలంలో స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే బాషా బతికి ఉండేవారని చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top