ఇంకా ఎంతమంది?

ఇంకా ఎంతమంది? - Sakshi


మళ్లీ ఎన్‌కౌంటర్ పేరుతో రెండు శవాల వెలికితీత

ఈసారి కాల్పుల ఘటన విశాఖ మన్యంలో..

మొత్తం 30కి చేరిన మావోల మృతుల సంఖ్య

40 మంది మృతదేహాలను లెక్కతేలుస్తారన్న వాదనలు తెరపైకి

పౌరహక్కుల సంఘాల భయాందోళన


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:
కూంబింగ్ కొనసాగుతోంది.. ఇంకా మృతుల సంఖ్య పెరగొచ్చు.. అన్న పోలీసు అధికారుల మాటలు నిజం చేస్తూ ఏవోబీలో గురువారం ఉదయం మరో రెండు మావోల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. దీంతో మొత్తంగా మావోల మృతుల సంఖ్య 30కి చేరింది. ఎనిమిదేళ్ల కిందట బలిమెలలో 38 మంది పోలీసులను బలిగొన్న ఘటనకు ప్రతీకారంగా ఇప్పుడు ఆ సంఖ్యకు ఒక్కటైనా మించేలా 39, 40 మావోల మృతదేహాలను లెక్క తేలుస్తారన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.



సోమవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగి 24 మంది మావోలు మృతి చెందారని పోలీసులు చెప్పినప్పుడు ఒకింత వాస్తవంగానే అనిపించినా.. మంగళవారం నలుగురు మావోల మృతదేహాలను చూపించి మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగిందని చెప్పడంపై అనుమానాలు రేకెత్తాయి. తాజాగా గురువారం ఉదయం విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం సిర్లిమెట్ట వద్ద మరో ఇద్దరిని ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టామని పోలీసులు చెబుతుండటంపై మొత్తం ఎన్‌కౌంటర్ ఘటనలపైనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.



అనుమానాలెన్నో...

యాదృచ్ఛికంగా మూడు ఎన్‌కౌంటర్లూ తెల్లవారుజామునే చోటుచేసుకున్నాయని చెప్పడం, ముందుగా మావోలు ఫైరింగ్ చేయడంతోనే పోలీసులు కాల్పులు జరుపుతున్నారని అధికారులు పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చెబుతున్నట్టు సోమవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోలు, లేదా గాయాలపాలైన మావోలు ఇన్ని రోజుల పాటు ఇంకా అక్కడే ఎలా ఉంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. లొంగుబాట్లు, అదుపులోకి తీసుకునే ప్రస్తావనలే లేకుండా వరుసపెట్టి మావోలను ఎన్‌కౌంటర్ చేయడం అనుమానాలకు తావిస్తోంది.



సోమవారం కటాఫ్ ఏరియాలో నిర్వహించ తలపెట్టిన ప్లీనరీ సమావేశానికి దాదాపు 40 నుంచి 50 మంది దళ సభ్యులు హాజరయ్యేందుకు వచ్చారని అంచనా. ఈ నేపథ్యంలో గాయాలపాలైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని కీలక సమాచారాలు రాబట్టి రోజుకో ఎన్‌కౌంటర్ పేరిట మావోలను అంతమొందిస్తున్నారని పౌరహక్కుల సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

 

వ్యూహాత్మకంగా మృతదేహాల తరలింపు..

మృతదేహాల తరలింపులోనూ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రామగూడ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ మృతు ల్లో ఎక్కువమంది ఆంధ్ర, తెలంగాణ జిల్లాలకు చెందినవారే ఉన్నారు. వారి మృతదేహాలను ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరికి తరలించిన పోలీసులు.. గురువారం ఉదయం మృతిచెందిన ఒడిశా వారిని విశాఖ జిల్లా పాడేరుకు తరలించారు. ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల ప్రజాసంఘాల వ్యతిరేక ప్రభావం ఎక్కువగా పడకుండా ఉండేందుకే అలా తరలిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top