ఏపీలో 226 కరువు మండలాలు

ఏపీలో 226 కరువు మండలాలు - Sakshi


* ఎట్టకేలకు ప్రభుత్వ ప్రకటన

* అక్టోబర్‌తో ముగిసిన ఖరీఫ్

* అసెంబ్లీ సమావేశాలకు ఒకరోజు ముందు ఉత్తర్వులు



సాక్షి, హైదరాబాద్: గత ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడు జిల్లాల్లో 226 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ ఏఆర్ సుకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30 మధ్య) రాష్ట్రంలో సగటున 554.1 మిల్లీమీటర్ల కనీస సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 375.7 మిల్లీ మీటర్ల వర్షం మాత్రమే కురిసింది. అంటే 32 శాతం తక్కువ వర్షం కురిసింది.



గత ఏడాది ఇదే కాలంలో 514.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కాగా జిల్లా కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి 1995 కరువు మాన్యువల్‌లోని మార్గదర్శకాల మేరకు కరువు మండలాల నిర్ధారణ కోసం ప్రభుత్వం పది మందితో కమిటీని ఏర్పాటు చేసింది. వర్షపాతం, పడిపోయిన పంటల సాగు విస్తీర్ణం, పంట దిగుబడి తగ్గుదల తదితర మార్గదర్శకాలకు లోబడి 226 మండలాలను కరువు ప్రాంతాలుగా నిర్ధారించినట్లు విపత్తు నిర్వహణ శాఖ పేర్కొంది. పట్టణ మండలాలు (మున్సిపాలిటీలు), శాశ్వత నీటి పారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాలను కరువు మండలాల జాబితా నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. కరువు మండలాల జాబితాను గెజిట్‌లో ప్రచురించి నీటి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.



563 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులు

వాస్తవానికి రాష్ట్రంలోని 563 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ పేర్కొన్న వర్షపాతం వివరాల ప్రకారమే.. కేవలం 101 మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతానికి మించి వర్షం కురిసింది. మిగిలిన 563 మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులున్నా ప్రభుత్వం కేవలం 226 మండలాలకే కరువును పరిమితం చేసింది.



కరువు మండలాలను ఎక్కువగా ప్రకటిస్తే ఎక్కువమంది బాధిత రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వాల్సివస్తుందనే ఉద్దేశంతోనే కరువు మండలాల జాబితాను కుదించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తీవ్ర కరువుతో పంటలు కోల్పోయి, రుణమాఫీ జరగక, కుటుంబాలను ఎలా నెట్టుకురావాలో దిక్కుతోచని పరిస్థితుల్లో అనేక ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం కరువు మండలాల ప్రకటనలో పిసినారితనం ప్రదర్శించడం అన్యాయమని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.



‘రాష్ట్రంలో 13 జిల్లాలకు(664 మండలాలు)గాను 11 జిల్లాల్లోని 563 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ కేవలం 7 జిల్లాల్లో మాత్రమే కరువు మండలాలున్నట్లు ప్రకటించింది. తూర్పు, పశ్చి మ గోదావరి జిల్లాల్లో దుర్భిక్ష పరిస్థితులున్నప్పటికీ జాబితాలో పేర్కొనలేదు. మరో 2 జిల్లాల్లో సగటున సాధారణ వర్షపాతం నమోదైనప్పటికీ వాటిలో కూడా కొన్ని మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల 13 జిల్లాల్లోనూ కరువు మండలాలు ప్రకటించాల్సి ఉన్నా ప్రభుత్వం భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా వ్యవహరించింది’ అని విపత్తు నిర్వహణ శాఖలో పనిచేసి రిటైరైన ఓ అధికారి ‘సాక్షి’తో అన్నారు.



అసెంబ్లీ సమావేశాల్లో నిలదీస్తారనే..

గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కరువుపై ప్రతిపక్షాలు నిలదీస్తాయనే ఉద్దేశంతో.. ప్రభుత్వం కేవలం ముందురోజు (బుధవారం) రాత్రి కరువు మండలాల జాబితాను ప్రకటించింది. వాస్తవంగా ఖరీఫ్ సీజన్ అక్టోబర్‌తో ముగిసింది. నవంబర్‌లోనే కరువు మండలాలను ప్రకటించి కేంద్ర ప్రభుత్వాన్ని విపత్తు సాయం కోరాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు జాప్యం చేస్తూ వచ్చింది. జిల్లా కలెక్టర్ల నుంచి కరువు మండలాల ప్రకటన కోసం ప్రతిపాదనలు వచ్చి నెలదాటినా పక్కన పెట్టింది. చివరకు సగానికి పైగా మండలాలను కుదించి ఒకరోజు ముందు కరువు ప్రాంతాలను ప్రకటించింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top