విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికుల మృతి


- ఇనుప పైపులు బిగిస్తుండగా ప్రమాదం

- ఇంటి యజమాని, ఇద్దరు కాంట్రాక్టర్లు, మేస్త్రిపై కేసు నమోదు




హిందూపురం(అనంతపురం జిల్లా): విద్యుదాఘాతానికి గురై ఇద్దరు భవననిర్మాణ కార్మికులు మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటన హిందూపురం పట్టణంలోని దశరథరామయ్య కాలనీలో శనివారం జరిగింది. పట్టణంలోని డీఆర్ కాలనీలో ఓ హోటల్ యజమానికి చెందిన భవనం రెండో అంతస్తు నిర్మాణంలో భాగంగా ఇనుప పైపులు అమర్చేందుకు కార్మికులు ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. నలుగురు కార్మికులు తాళ్లు కట్టి పైపులను పైకి తీసుకుంటుండగా ఇద్దరు గునపాలతో పైకి నెట్టుతున్నారు. ఈ క్రమంలో భవనం సమీపంలో ఉన్న త్రీఫేస్ విద్యుత్ తీగలపై ఇనుప పైపులు పడ్డాయి.


దీంతో పైపులకు విద్యుత్ సరఫరా అవ్వడంతో పైపులను గునపాలతో నెడుతున్న చాలకూరుకు చెందిన బోయ చిరంజీవి(30), కేతగానిచెరువుకు చెందిన వెట్టి శ్రీనివాసులు(28) విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. తాళ్లతో పైకి లాగుతున్న చాలకూరుకు చెందిన బోయ రమేష్, బోయ అంజినప్ప, బోయ శివ, బోయ ఆదిశేషులు వెంటనే తాళ్లు వదిలేసి పైపును దగ్గరకు లాక్కోవడంతో వారికి కూడా విద్యుత్‌షాక్ తగిలి తీవ్రగాయాల పాలయ్యారు. స్థానికులు వెంటనే కార్మికులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top