తీగలాగితే డొంక కదిలింది!

తీగలాగితే డొంక కదిలింది! - Sakshi


స్కాలర్‌షిప్‌ల స్కాంలో మరో ఇద్దరు అరెస్టు

నేడు ఏసీబీ కోర్టులో హాజరుపర్చే అవకాశం




శ్రీకాకుళం పాతబస్డాండ్‌/శ్రీకాకుళం సిటీ: సంచలన సృష్టించిన బీసీ సంక్షేమశాఖలోని విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల కుంభకోణంలో ఆరెస్టుల పర్వం కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలినట్టుగా.. ఏసీబీ అధికారులు ఈ పాపంతో సంబంధం ఉన్నవారిని పక్కా ఆధారాలతో అరెస్టు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్న తొమ్మిది మందిని ఈ నెల 19వ తేదీన అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు.. బుధవారం మరో ఇద్దరిని అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో ఇంకెంత మందికి పాత్ర ఉందనే భయంతో గిరిజన, బీసీ సంక్షేమశాఖల్లోని పలువురు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.



 ఈ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని ఆరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరిచిన విషయం విదితమే. తాజాగా పదవీ విరమణ చేసిన బీసీ సంక్షేమాధికారి పీవై సదానందం, గిరిజన సంక్షేమ శాఖలో ఇన్‌చార్జి డీడీగా పనిచేసి ఎంపీవీ నాయక్‌లను బుధవారం ఆరెస్టు చేసి శ్రీకాకుళంలోని రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. వీరిని గురువారం కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కాగా ఈ కేసులో ఇప్పటికే బీసీ, గిరిజన సంక్షేమాధికారుతో పాటు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులతో కలిపి తొమ్మిది మందిని ఆరెస్టు చేశారు.



వీరిలో విశ్రాంత బీసీ సంక్షేమాధికారి బి.రవిచంద్ర, బైరి చంద్రశేఖర్‌ (జూనియర్‌ అసిస్టెంట్‌), బుడుమూరు బాలరాజు (జూనియర్‌ అసిస్టెంట్‌), దుడ్డు పార్వతి (సీనియర్‌ అసిస్టెంట్‌) ఉండగా.. గిరిజన సంక్షేమశాఖ ఉద్యోగులైన బోర ఎర్రన్నాయుడు (ఏటీడబ్ల్యూవో, సీతంపేట), శిమ్మ ఝాన్సీరాణి (హెచ్‌డబ్ల్యూవో, ఎస్టీబాలుర హాస్టల్, సారవకోట),  గేదెల వెంకటనాయుడు (పాలకొండ, ఎస్టీ బాలుర హాస్టల్‌ అధికారి), ఓం సాయి జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ముంజు ఉమామహేశ్వరరావు,  మరో  కంప్యూటర్‌ ఆపరేటర్‌ అంపిలి అజయ్‌కుమార్‌ ఉన్నారు. తాజాగా ఆరెస్టు అయిన పీవీ సదానందం, ఎంపీవీ నాయక్‌లకు కూడా స్కాలర్‌షిప్‌ల కుంభకోణంతో సంబంధం ఉన్నట్టు నిర్ధారణకు వచ్చిన తరువాత వీరిని ఆరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ కరణం రాజేంద్ర విలేకరులకు తెలిపారు.  



 డీడీ నాయక్‌పై పలు అభియోగాలు!

సీతంపేట గిరిజన సంక్షేమశాఖకు రెగ్యులర్‌ డీడీ లేని సమయంలో రెండేళ్ల క్రితం డీడీ బాధ్యతలు నాయక్‌కి అప్పజెప్పారు. అయితే ఆయనపై నమ్మకం లేని గిరిజన సంఘాలు అప్పట్లో ఆయన్ని డీడీ వి«ధుల నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. నాయక్‌ డీడీగా పనిచేసిన కాలంలో అప్పటి  ఏటీడబ్ల్యూవో ఎర్రన్నాయుడుకి రాజకీయ పలుకుబడి ఉండడంతో డీడీ ఆయన కనుసన్నల్లో పనిచేసేవారని, యర్రనాయుడు అవినీతి చర్యలకు వంతపాడే వారనే అభియోగాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే నాయక్‌  ఉపకార వేతనాల కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయారు. ఈ స్కాలర్‌ షిప్పుల స్కాం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి సంబంధిత వార్డెన్లను, ఏటీడబ్ల్యూవో యర్రనాయుడుని, డీడీ నాయక్‌ని అరెస్టులు చేయాలని గిరిజనులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల పలుకుబడితో ఇప్పటి వరకు తప్పించుకొన్నారు. ఇక ఆ కాలంలో పనిచేసిన డీబీసీ సదానందంపై కూడా పలు అభియోగాలు ఉన్నాయి. అప్పడు జరిగిన పదోన్నతులల్లోనూ, బదిలీల్లోనూ ఆయన అవినీతికి పాల్పడుతున్నారని వార్టెన్లు ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి.



ఉద్యోగుల సస్పెన్షన్‌కు సిఫారుసు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌:  బీసీ స్కాలర్‌షిప్‌ల స్కాంలో ఏసీబీ అధికారులు ఆరెస్టు చేసిన బీసీ సంక్షేమ శాఖ ఉద్యోగులను సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేసేందుకు డీబీసీ కె.శ్రీదేవి ఆ ఉద్యోగులను జిల్లా కలెక్టర్‌ కె. ధనుంజయరెడ్డికి వద్దకు బుధవారం తీసుకెళ్లారు. అయితే ఏసీబీ అధికారుల నుంచి వారిపై నివేదికలు రావాల్సిందని, వచ్చిన వెంటనే సస్పెండ్‌ కోరుతూ సిఫార్సులు అందజేయాలని కలెక్టర్‌ సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top