16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి

16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి - Sakshi


అమలాపురం టౌన్ :రోడ్లపై చెత్త ఏరుకుని జీవించే 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో అతడికి ఇద్దరు మహిళలు సహకరించారు. చివరకు ఆ బాలిక గర్భవతి కావడంతో మూడు నెలల తర్వాత విషయం వెలుగుచూసింది. పోలీసులు నిందితుడితోపాటు అతడికి సహకరించిన ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మామిడికుదురు మండలం నగరం శివారు ఆల్‌కాస్ట్ కాలనీకి చెందిన బాలిక తల్లిదండ్రులతో కలసి చెత్త ఏరుకునే వృత్తిలో జీవిస్తోంది. అదే ప్రాంతానికి చెందిన 32 ఏళ్ల మహిళ కూడా ఇదే పనిలో ఉంది.

 

 ఈ మహిళ చెల్లెలు అల్లవరం మండలం మొగళ్లమూరులో కె. రవి నిర్వహిస్తున్న మాంసం దుకాణంలో పనిచేస్తోంది. అక్కా చెల్లెళ్లు తరచూ మాట్లాడుకునేవారు. ఒకరింటికి ఒకరు వెళ్లేవారు. ఈక్రమంలో తన అక్కతో తిరిగే మైనరు బాలిక విషయాన్ని ఆమె రవికి చెప్పింది. దీంతో రవి అక్కాచెల్లెళ్లకు డబ్బు ఎరచూపి ఆ బాలికను అమలాపురం తీసుకురమ్మని పురమాయించాడు. మూడు నెలల క్రితం నగరం నుంచి ఆ బాలికను అక్కాచెల్లెళ్లు మాయమాటలతో తీసుకువచ్చి అమలాపురం బస్టాండ్‌లో ఉంచారు. అక్కడినుంచి రవికి ఫోన్ చేసి రప్పించారు. రవి ఆ బాలికను అప్పగించినందుకు అక్కా చెల్లెళ్లకు రూ.2వేలు ఇచ్చాడు. అనంతరం అమలాపురంలోని ఓ లాడ్జికి ఆ బాలికను తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు.  

 

 మూడు నెలల తరువాత...

 మూడు నెలల తర్వాత బాలిక గర్భం దాల్చడాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు నగరం ప్రాంతంలోని ఓ ఆర్‌ఎంపీకి చూపించి గర్భస్రావానికి మందులు వాడారు. అవి పనిచేయకపోవడంతో తీవ్ర రక్తస్రావంతో బాలిక ఆరోగ్యం పాడైంది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు రాజోలు ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు అమలాపురం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అమలాపురం ఏరియా ఆస్పత్రి వైద్యులు కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో మామిడికుదురు పోలీసులు రంగంలోకి దిగి 24వ తేదీన కేసు నమోదు చేశారు.

 

 అయితే బాలికపై లైంగికదాడి జరిగినది అమలాపురంలో కాబట్టి కేసును అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కేసును ఇక్కడకు బదిలీ చేశారు. రవితోపాటు అతనికి సహకరించిన మహిళలు ఇద్దరిపైనా అమలాపురం సీఐ వైఆర్‌కే శ్రీనివాస్ సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ముగ్గురూ పోలీసుల అదుపులో ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉందని, బాధితురాలు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని సీఐ విలేకరులకు తెలిపారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top