16 మంది బంగ్లా జాతీయుల అరెస్ట్


 పెనుగొండ రూరల్ :ఎటువంటి అనుమతి ధ్రువీకరణ పత్రాలు, పాస్‌పోర్టులు లేకుండా భారతదేశంలో ప్రవేశించిన 16 మంది బంగ్లా జాతీయులను పెనుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుగొండ సీఐ సీహెచ్ రామారావు ఆధ్వర్యంలో పెనుగొండ, ఇరగవరం, పెనుమంట్ర ఎస్సైలు సీహెచ్ వెంకటేశ్వరరావు, జి.కాళీచరణ్, కే.వీరబాబులు వీరిని శనివారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పశ్చిమబెంగాల్ ద్వారా దేశంలో ప్రవేశించిన వీరు హౌరా నుంచి రాజమండ్రి రైలులో చేరుకున్నారు. అక్కడ నుంచి పెనుగొండ వ చ్చి స్థానిక రైసుమిల్లులో భారత జాతీయులుగా చెప్పుకొని గత మూడు నెలలుగా కూలి పనులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానిక వెంకట సుబ్రహ్మణ్యం ఇండస్ట్రీయల్ రైసుమిల్లులో పనిచేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌కు చెందినవారిగా నమ్మబలకడంతో వారిని కూలీలుగా చేర్చుకున్నట్టు రైసుమిల్లు యజమాని నార్కెడిమిల్లి సుబ్రహ్మణ్యం పోలీసులకు వివరించారు.

 

 బంగ్లా జాతీయులు కూలి డ బ్బులు సైతం పశ్చిమబెంగాల్‌లోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్‌కు పంపుతుండడంతో నిజంగానే భారత జాతీయులని భావించారు. అయితే, పశ్చిమబెంగాల్‌లోని వీరి స్నేహితులు బిప్లబ్ బిశ్యాల్, ఫరీన్‌ల ద్వారా నగదును బంగ్లాదేశ్‌కు పంపించేవారని పోలీసుల విచారణలో తేలింది. ఇతర దేశస్థుల సంచారంపై అనుమానాలు రావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెనుగొండ పోలీసులు నిఘా పెట్టారు. దీంతో మిల్లులో పనిచేస్తున్న వీరిపై పెనుగొండ పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో పశ్చిమబెంగాల్ వాసులుగా చెప్పుకొంటున్న షఫీకుల్ మండల్(34), మహ్మద్ సైఫుల్ (21), మహ్మద్ ఇక్భాల్ షేక్ (24), మహ్మద్ టిప్పు హవల్ద్ (20),

 

  మహ్మద్ బైజిద్ ముడల్ (21), మహ్మద్ ఇమ్దద్ ఇస్లాం (32), మహ్మద్ కమరుల్ సర్దార్ (33), మహ్మద్ ఇక్భాల్ హుస్సేన్(30), మహ్మద్ తొరికల్ ఇస్లాం (28), మహ్మద్ జాకీర్ ముల్లా (40), మహ్మమద్ జబ్బార్ (35), మహ్మమద్ అమీరుల్ ఇస్లాం (40), మహ్మద్ బుర్హన్ మున్షీ (35), మహ్మద్ మోహిన్‌ఖాన్ (25), మహ్మద్ ఫరూక్ హుస్సేన్ (27), మహ్మద్ అర్జాన్ అలీ(21)లపై అక్రమంగా దేశంలోకి చొరబడినట్టు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. బంగ్లాదేశ్‌లోని 24 పరగణాల దక్షిణ జిల్లాలోని కుంచరస్తాల్ బాగ్తా మండలం మోహిరాణి గ్రామానికి చెందిన షఫీకుల్ మండల్(34) ద్వారా భారతదేశానికి వచ్చినట్టు వారు అంగీకరించారని సీఐ రామారావు తెలిపారు. కేసును ఎస్పీ రఘరామిరెడ్డి, డీఎస్సీ రఘవీరరారెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసినట్టు చెప్పారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top