దూసుకొచ్చిన మృత్యువు

దూసుకొచ్చిన మృత్యువు - Sakshi


► 15 మంది దుర్మరణం..

► 24 మందికి పైగా తీవ్ర గాయాలు




మాటలకందని విషాదమిది. ఇసుక మాఫియా అరాచకం గురించి అధికారులకు విన్నవించడానికి వెళ్లి ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది తిరిగిరాని లోకాలకు వెళ్లడం దిగ్భ్రాంతికి గురిచేసింది.



సాక్షి ప్రతినిధి, తిరుపతి / ఏర్పేడు:  చిత్తూరు జిల్లా ఏర్పేడులో శుక్రవారం మధ్యాహ్నం ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. మృత్యు వులా దూసుకొచ్చిన లోడ్‌ లారీ అదుపు తప్పి 11 మంది ప్రాణాలు తీసింది. అదే లారీ ఆగ కుండా వెళ్లి పోలీస్‌స్టేషన్‌ ముందున్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీ కొనడంతో సిమెంట్‌స్తంభం విరిగి పడి విద్యుత్‌షాక్‌తో అక్కడే ఉన్న నలుగురు వ్యవసాయ కూలీలు దుర్మరణం పాలయ్యారు. వెరసి 15 మంది క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 24 మం దికిపై గా రైతులు, కూలీలు గాయపడ్డారు. క్షతగా త్రులను పోలీసులు తిరుపతి రుయా ఆస్పత్రి లో చేర్చారు. వీరిలో ముగ్గురి పరిస్థితి ఆందోళ నకరంగా ఉంది. మెరుగైన వైద్యం కోసం క్షత గాత్రుల్లో 15 మందిని రుయా నుంచి స్విమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఇసుక మాఫియా గురించి ఫిర్యాదు చేయడానికి వచ్చి మృత్యు వాత పడ్డారంటూ మునగలపాలెంవాసులు  విలపించారు. ఇసుకాసురుల వల్లే ఆప్తులను కోల్పోయామని శాపనార్థాలు పెట్టారు.  



ఘటన ఎలా జరిగిందంటే..

ఏర్పేడు మండలం మునగలపాలెంకి పక్కనే ఉన్న స్వర్ణముఖి నదిలో ఇసుక దోపిడీని  నిరసి స్తూ ధర్నా నిర్వహించేందుకు గ్రామానికి చెందిన 45 మంది రైతులు శుక్రవారం ట్రాక్టర్‌లో తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే,తహసీల్దార్‌ హైకోర్టుకు వెళ్లారని తెలిసి వెనుదిరిగే క్రమంలో పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు తిరుపతి అర్బన్‌ ఎస్పీ జయలక్ష్మి రావ డం గమనించారు. విషయాన్ని ఎస్పీకి విన్న వించేందుకు పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.  కొద్దిసేపటికి బయటకు వచ్చిన ఎస్పీ జయ లక్ష్మికి రైతుల ఫిర్యాదు చేశారు. స్టేషన్‌ ఆవరణ నుంచి బయటకు వస్తున్న రైతులపైకి  లారీ ఒక్కసారిగా దూసుకొచ్చి రెండు ఆటోలను, సీఐ జీపును ఢీకొట్టింది. స్టేషన్‌ గేటుకు ఎడమ వైపున్న విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో వెంటనే సిమెంట్‌ పోల్‌ విరిగి పడింది. అప్పటికీ ఆగని లారీ అక్కడే పార్క్‌ చేసి ఉన్న ద్విచక్ర వాహనాల మీదుగా వెళ్లింది. దీంతో పెట్రోలు ట్యాంకులు పగిలి.. నిప్పు రవ్వలు ఎగిసి మంటలు వ్యాపించాయి. దీంతో అక్కడి కక్కడే 15 మంది దుర్మరణంపాలయ్యారు.   ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో 13 మంది ఏర్పేడు మండలం మునగలపాలెం వాసులు కాగా ఇద్దరు ముసలిపేడు గ్రామానికి చెందిన వారని అధికారులు చెప్పారు. కాగా, అక్కడే ఉన్న బాలమురళి, హరిబాబు అనే ఇద్దరు విలేకరులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. బాలమురళి రెండు కాళ్లూ విరిగాయి. ఎస్‌ఐ రామకృష్ణకు గాయాలయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను కలెక్టర్‌ ప్రకటించారు.



ఏర్పేడు ఘటనపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా ఏర్పేడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 15 మంది మరణించడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, కార్యకర్తలు సహాయక చర్యలలో పాల్గొనాలని ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. కాగా ఏర్పేడు రోడ్డు ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.



బ్రీత్‌ ఎనలైజర్‌లో 250 పాయింట్లు

మద్యం మత్తులో ఉన్న డ్రైవర్‌ నిర్లక్ష్యంగా లారీ నడపడమే ఈ దుర్ఘటనకు కారణ మని పోలీసులు పేర్కొన్నారు. తిరుపతిలో వైట్‌ సిమెంట్‌ లోడ్‌ చేసుకున్న డ్రైవర్‌ గురవయ్య (36) నెల్లూరు వెళ్లే క్రమంలో ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఈ ప్రమాదానికి కారణమయ్యాడు. వెంటనే పోలీసులు డ్రైవర్‌ గురవయ్యను అక్కడి కక్కడే అరెస్ట్‌ చేశారు. బ్రీత్‌ అనలైజర్‌ ద్వారా అతనికి పరీక్షలు నిర్వహిస్తే 250 పాయింట్ల రీడింగ్‌ కనిపించినట్లు పోలీసులు తెలిపారు.  



విద్యుత్‌ షాక్‌ తగిలే వీలు లేదు

ప్రమాదంలో విద్యుత్‌ పోల్‌ విరిగి పడినప్పటికీ షాక్‌ కొట్టే అవకాశం లేదని ఏపీఎస్పీ డీసీఎల్‌ సీఎండీ హెచ్‌వై దొర పేర్కొన్నారు. లారీ ఢీ కొనడం వల్ల సిమెంట్‌ పోల్‌ విరిగి కిందపడిందనీ, ఆ వెంటనే వైర్లు తెగి పోవడంతో ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద ఫీజులు పోయాయని చెప్పారు. దీనివల్ల విద్యుత్‌ తీగల్లో పవర్‌ ఉండదని, అలాంటప్పుడు షాక్‌ కొట్టే ప్రసక్తే లేదన్నారు. మరణాలకు కారణం వారి మీదుగా లారీ దూసుకు పోవడమేనన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top