బరిలో వీరులు 15 మంది


సాక్షి ప్రతినిధి, కాకినాడ : నామినేషన్ల ఉప సంహరణ అనంతరం ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 15 మంది మిగిలారు. సోమవారం ఉపసంహరణ గడువు ముగిసే సరికి 16 మంది అభ్యర్థుల్లో శశికిరణ్‌వర్మ ఒక్కరే నామినేషన్ ఉపసంహరించుకున్నారు. బరిలో ఎందరున్నాప్రస్తుత అంచనాల ప్రకారం పోరు ప్రధానంగా యూటీఎఫ్ బలపరిచిన రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారు), గుర్తింపు పొందిన రాజకీయపార్టీ అభ్యర్థిగా టీడీపీ మద్దతు ప్రకటించిన చైతన్య విద్యా సంస్థల అధినేత చైతన్యరాజు,ప్రగతి విద్యా సంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు మధ్యే ప్రధానంగా పోటీ కనిపిస్తోంది.  

 

 ‘శ్రీచైతన్యరాజు’ తొలగింపు..

 ఓటర్లలో గందరగోళం సృష్టించేందుకే కేవీవీ సత్యనారాయణరాజు(శ్రీచైతన్యరాజు) పేరుతో నామినేషన్ దాఖలు చేశారని టీడీపీ బలపరిచిన చైతన్యరాజు ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్‌కు చేసిన ఫిర్యాదుపై విచారణ అనంతరం శ్రీచైతన్యరాజు పేరును తొలగించి ఆ అభ్యర్థి అసలు పేరు కేవీవీ సత్యనారాయణరాజు పేరుతోనే నామినేషన్‌ను ఆమోదించినట్టు ఎన్నికల కమిషన్‌కు నివేదించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థిగా చైతన్యరాజు పేరు తొలిసారి(ఇదివరకు రెండుసార్లు పోటీచేసినా స్వతంత్ర అభ్యర్థిగానే) అభ్యర్థుల జాబితాలో మొదటి పేరుగా నమోదైంది. పరుచూరి కృష్ణారావు పేరు వరుస సంఖ్యలో ఏడోదిగా ఉండగా, రాము సూర్యారావు పేరు 13వదిగా నమోదైంది. ఈ ఎన్నికల్లో  ఒకే పేరుతో ఐదుగురు బరిలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి పరుచూరి కృష్ణారావు పోటీపడుతుండగా, ఇంటి పేర్లు వేరైనా కృష్ణారావు పేరుతో మరో నలుగురు (పి.కృష్ణారావు, పతివాడ కృష్ణారావు, పాత్రుని కృష్ణారావు, ప్రగడ కృష్ణారావు) బరిలో ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొత్తం మీద ఎవరి ఎత్తులతో వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు.

 

 ఉపాధ్యాయుల వద్దకు క్యూలు..

 పోలింగ్‌కు 20 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ప్రాంతీయ, సామాజిక, రాజకీయ సమీకరణలతో అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు, మద్దతుగా నిలిచిన సంఘాలు ‘గురవే నమహా’ అంటూ ఉపాధ్యాయుల వద్దకు క్యూ కడుతున్నారు.  సోమవారం చైతన్యరాజు కాకినాడ రూరల్, కరప మండలాల్లో, రవికిరణ్‌వర్మ రాజోలు, శశికిరణ్‌వర్మ ఏలేశ్వరంలో ఓట్లు అభ్యర్థించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న పరుచూరి కృష్ణారావు అమలాపురం, అల్లవరం, అంబాజీపేట, ముంగండ తదితర ప్రాంతాల్లో పండిట్ అసోసియేషన్‌తో కలిసి ప్రచారం చేశారు. రాము సూర్యారావు ఏజెన్సీ కేంద్రమైన రంపచోడవరంలో యూటీఎఫ్ ప్రతినిధులు వెంట రాగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మిగిలిన 12 మంది అభ్యర్థులు రెండు జిల్లాల్లో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

 

 బరిలో నిలిచింది వీరే..

 టీడీపీ తరఫున కేవీవీ సత్యనారాయణరాజు(చైతన్యరాజు), స్వతంత్ర అభ్యర్థులుగా కాండ్రేగుల నరసింహం, పి.కృష్ణారావు, గెడ్డం సంపతరావు, దేవీప్రసాద్ మాకే, పతివాడ కృష్ణారావు, పరుచూరి కృష్ణారావు(ప్రగతి కృష్ణారావు), పాత్రుని కృష్ణారావు, పిల్లి డేవిడ్‌కుమార్, పేపకాయల రాజేంద్ర, ప్రగడ కృష్ణారావు, మురళీధర్ సుంకవల్లి, రాము సూర్యారావు(ఆర్‌ఎస్‌ఆర్ మాస్టారు), కేవీవీ సత్యనారాయణరాజు, సుందర గంగాధర్ బరిలో నిలిచారు. కాగా, అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే ఓటరు నోటా(పై వారెవరూ కాదని) ఓటు వేసుకునేందుకు 16వ గడిని కేటాయించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top