13,14 తేదీల్లో ఘంటసాల ఆరాధనోత్సవం


 రాజమహేంద్రవరం కల్చరల్ : రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఈనెల 13 సాయంత్రం 5 గంటలనుంచి 14 సాయంత్రం 5 గంటల వరకు స్థానిక ఆనం కళాకేంద్రంలో 24 గంటల నిర్విరామ ఘంటసాల ఆరాధనోత్సవం జరుగుతుందని ఎంపీ మాగంటి మురళీమోహన్ తెలిపారు. గురువారం సర్వారాయ కళాకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 13న కార్యక్రమాన్ని పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రారంభిస్తారన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాక తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా గాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.

 

  ప్రారంభోత్సవ సభలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ముగింపుసభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ముఖ్యఅతిథులుగా పాల్గొంటారని, సినీ విజ్ఞాన విశారద ఎస్వీ రామారావు కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తారని తెలిపారు. కిన్నెర ఆర్ట్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ మాట్లాడుతూ 1977లో మురళీమోహన్ చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రారంభమైన కిన్నెర గత 39 ఏళ్లుగా అనేక సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. విజయవాడ, తిరుపతి, విశాఖ తదితర ప్రాంతాలలో కూడా ఘంటసాల ఆరాధనోత్సవాలను నిర్వహించామని తెలిపారు.

 

 రాజమహేంద్రవరంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా శాఖ.. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా శాఖను రాజమహేంద్రవరంలో ప్రారంభించడానికి కేంద్రం అంగీకరించిందని మురళీమోహన్ తెలిపారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం స్థలాన్ని కేటాయించడానికి అంగీకరించిందన్నారు. పద్యనాటకం అంతరించిపోకుండా ఈ సంస్థ కృషి చేస్తుందని, పద్యనాటక కళాకారులను ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆహ్వానిస్తామని తెలిపారు.

 

 కళాకేంద్రం అద్దె తగ్గింపువిషయంలో

 హామీ ఇవ్వలేను : గోరంట్ల

 ఆనం కళాకేంద్రం అద్దె తగ్గింపు విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేనని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి చెప్పారు. రిహార్సల్స్‌కు కళాకేంద్రం మే డపై ఉన్న సర్వారాయ కళాకేంద్రం, గం దం నాగసుబ్రహ్మణ్యం వేదికలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆనం కళాకేంద్రం ఆర్థికంగా స్వయం సమృద్ధిని సాధించే విషయంపై అధికారులతో చర్చిస్తానన్నారు. విలేకరుల సమావేశంలో మేయర్ పంతం రజనీశేషసాయి, డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, గాయక, నటుడు జిత్ మోహన్ మిత్రా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top