సినీఫక్కీలో


12 తులాల బంగారం అపహరణ

పూసపాటిరేగ (నెల్లిమర్ల): మండలంలోని రెల్లివలసకు చెందిన వృద్ధ దంపతుల నుంచి అగంతకులు సినీఫక్కీలో నగలు అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..  గ్రామానికి చెందిన పతివాడ సత్యనారాయణ, సరస్వతి దంపతులు శుభకార్యంలో పాల్గొనేందుకు నెల్లిమర్ల మండలం గరికిపేటకు ఈ నెల 9న బయలుదేరారు. విజయనగరం వరకు తమ అల్లుడుకు చెందిన కారులో వెళ్లారు. అక్కడ నుంచి భోజనం చేసేందుకు ఎస్‌కేఎంఎల్‌ హోటల్‌ వైపు వెళ్తుండగా, మార్గమధ్యలో ఇద్దరు అపరిచిత వ్యక్తులు తారసపడ్డారు.

 

మెడలో బంగారు గొలుసులు ఉంటే దొంగలు అపహరించే ప్రమాదముందని, అందుకే వాటిని తీసి సంచిలో వేసుకోండని అగంతకులు వృద్ధ  దంపతులకు సలహా ఇచ్చారు. అంతలో వారి వద్దకు మరో యువకుడు వచ్చాడు. ఆయన మెడలో కూడా బంగారు గొలుసు ఉండడంతో వృద్ధులను నమ్మించడానికి అతనిచేత కూడా గొలుసు తీయించి బ్యాగులో వేయించారు. దీంతో వృద్ధ దంపతులు కూడా తమ వద్ద నున్న నాలుగున్నర తులాల బంగారం గొలుసు, మూడు తులాల పుస్తెల తాడు, తులంన్నర మూడు ఉంగరాలు, అర తులం శతమానం తీశారు. వాటిని వృద్ధురాలి చీర కొంగులో ముడికడుతున్నట్లు సాయం చేసిన అగంతకులు బంగారం స్థానంలో ఇనపముక్కలు కట్టి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు. కొద్ది సేపటి తర్వాత చీరకొంగుముడి విప్పిన వృద్ధురాలు అందులో ఇనపముక్కలు ఉండడంతో మోసపోయామని గుర్తించి లబోదిబోమన్నారు. దీనిపై విజయనగరం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top