ఆగని ‘స్వైన్’


స్వైన్‌ఫ్లూ జిల్లాను వణికిస్తోంది. వరుసగా పాజిటివ్ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఆ వ్యాధితో మరణించే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగు తోంది. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారే కాదు.. ఇంటి నుంచి కదలని బాలింతలనూ ఈ వ్యాధి వదలడం లేదు. ఇప్పటికే ఇద్దరు బాలింతలు స్వైన్‌ఫ్లూతో మృతిచెందగా..మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

- విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ

 

- జిల్లాలో మొత్తం 12 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసుల నమోదు

- ఆరుగురు మృతి..వారిలో ఇద్దరు బాలింతలు

- చికిత్స పొందుతున్న మరో బాలింత

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చలిగాలులు తగ్గిపోతే స్వైన్‌ఫ్లూ వైరస్ సోకదని ప్రభుత్వం, వైద్యశాఖ అధికారులు ప్రకటిస్తూ వచ్చారు. చలి తగ్గిపోయి ఎండలు ముదురుతున్నా జిల్లాలో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. వరుసగా బాలింతలు ఈ వ్యాధిబారిన పడుతుండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో ఇప్పటి వరకు 28 అనుమానిత స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా అందులో 12 కేసులు పాజిటివ్‌గా వచ్చాయి. ఆరుగురు మరణించగా ఒకరు గుంటూరుజిల్లా వాసి. చనిపోయిన వారిలో ఇద్దరు బాలింతలున్నారు.



జిల్లాలోని 15 మండలాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. కందుకూరు, ఒంగోలు, జె.పంగులూరు, అద్దంకి, తాళ్లూరు, చీరాల, పొన్నలూరు, టంగుటూరు, సింగరాయకొండ, పామూరు, గుడ్లూరు, చీమకుర్తి, మర్రిపూడి, ఇంకొల్లు మండలాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులపై ఈ వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే బాలింతలకు ఎలా వస్తుందనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన వేల్పుల సునీత (25) ఈనెల 7వ తేదీన నెలలు నిండటంతో చీమకుర్తిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో బాబును ప్రసవించింది.



అనంతరం తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఒంగోలు నగరంలోని దక్షిణ బైపాస్ రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. వెంటనే వైద్యాధికారులు చిమటలో వైద్యశిబిరం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. తాజాగా ఒంగోలుకు చెందిన ఓ బాలింత స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేరింది. మహిళ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మంగళవారం అర్ధరాత్రి బెంగళూరు తరలించారు. బెంగళూరు శివారుకు వెళ్లగానే బుధవారం ఉదయం మహిళ మృతిచెందింది.



మహిళకు గుండెకు సంబంధించిన సమస్య ఉందని..పుట్టిన బిడ్డకు కూడా అదే సమస్య ఉందని వైద్యులు చెబుతున్నారు. గుండె సమస్యతో పాటు స్వైన్‌ఫ్లూ రావడంతో ఆమె మృతిచెందిందన్నారు. అయితే ఈ బాలింతలకు స్వైన్‌ఫ్లూ ఎలా సోకిందనేది మిస్టరీగానే మిగిలింది. ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరినప్పుడు ఈ వ్యాధి సోకితే ఎవరి నుంచి సోకింది..ఆ వ్యాధిగ్రస్తులు ఏమయ్యారనే అంశం బయటకు రావడం లేదు.  ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరో బాలింత చికిత్స పొందుతోంది.  



ఆమెకు కూడా స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు.  బాలింతలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల తొందరగా స్వైన్‌ఫ్లూ సోకే అవకాశం ఉంది. దీనిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె.యాస్మిన్ మాట్లాడుతూ ఒంగోలులో చనిపోయిన మహిళ ఇంటికి వెళ్లి రెండుగంటలు మాట్లాడానని అయితే ఆమెకు ఎలా వ్యాధి వచ్చిందో తెలియలేదన్నారు.



ఆమె ఎక్కడికీ వెళ్లలేదని, ఒకటికి రెండు సార్లు ఆసుపత్రికే చెకప్‌కు వెళ్లిందన్నారు. అదే విధంగా చిమటకు చెందిన మహిళ విషయంలో ఆమె పక్క బెడ్‌పై ఉన్న పేషంట్ భర్త హైదరాబాద్‌లో పనిచేస్తున్నట్లు మాత్రమే తెలిసిందని, అయితే ఈమెకు ఎలా వచ్చిందనేది తెలియలేదన్నారు.  ఆరోగ్యవంతులకు స్వైన్‌ఫ్లూ ఉన్నా బయటపడకపోవచ్చని, వారి ద్వారా ఇది సంక్రమిస్తూ ఉండే అవకాశం ఉందన్నారు. బాలింతలు సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా జాగ్రత్తపడాలని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top