12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజు రద్దు


 ఒంగోలు సబర్బన్ : జిల్లాలోని 12 క్వార్ట్జ్ , బెరైటీస్ గనుల లీజులను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులిచ్చారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో గనులు విస్తారంగా ఉన్నాయి. గనులు, భూగర్భవనరులశాఖ నుంచి అనుమతి పొందిన ఈ లీజుదారులు నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించటంతో లీజులను రద్దు చేస్తున్నట్లు ఆయన తన ఉత్తర్వుల్లో పేర్కోన్నారు.



పలుమార్లు నోటీసులు జారీ చేసినా యజమానుల్లో స్పందన కరువవ్వటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక్కో లీజుకు 25 ఏళ్ల కాలపరిమితితో గతంలో అనుమతించారు. సీఎస్ పురం మండలం చినపనాయుడుపల్లిలో 53.93 ఎకరాలకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదే మండలం మూసునూరులో యూ.మల్లికార్జున రావు కు 38.29 ఎకరాల్లో క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. పెద్దారవీడు మండలం చెట్లమిట్ట పంచాయతీ పరిధిలోని రాజంపల్లిలో కృష్ణమినరల్స్‌కు ఇచ్చిన 11.563 హెక్టార్లు క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం వింజావతిపాడులో పి.సుబ్బారావుకు ఇచ్చిన 9.226 హెక్టార్ల క్వార్ట్జ్లీజును రద్దు చేశారు.



అదే మండలం సిద్ధవరం గ్రామంలోని ఆర్.మురళీధరరెడ్డికి ఇచ్చిన 43.769 హెక్టార్లలోని క్వార్ట్జ్లీజును రద్దు చేశారు. పామూరు మండలం సిద్ధవరం పరిధిలోని చంద్రకాంత్ మైన్స్ అండ్ మినరల్స్ 27.409 హెక్టార్లలో ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. కొనకనమిట్ల మండలం ఇరసలగుండం పరిధిలోని 21.243 హెక్టార్లను ఎస్‌కే నాగూర్‌వలికి ఇచ్చిన క్వార్ట్జ్ లీజును కూడా రద్దు చేశారు.



వలేటివారిపాలెం మండలం పోలినేనిచెరువులో  21.514 హెక్టార్లలో యూబీ మినరల్స్ మేనేజింగ్ పార్టనర్ పి.ఉదయభాస్కరరావుకు ఇచ్చిన క్వార్ట్జ్ లీజును రద్దు చేశారు. అదేవిధంగా కొమరోలు మండలం మొట్టుపల్లి గ్రామంలోని 4.914 హెక్టార్లలో బెరైటీస్ గనుల లీజు పొందిన బి.సుధాకర్‌కు చెందిన లీజును కూడా రద్దు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ అత్యవసర ఉత్తర్వులు జారీ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top