11 అంశాలతో ‘జన్మభూమి-మా ఊరు’


శ్రీకాకుళం పాతబస్టాండ్:   ఈ నెల 2 నుంచి 20 వరకు రాష్ట్రంలో నిర్వహించే ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమ షెడ్యూల్‌ను 11 అంశాలతో అధికారులు సిద్ధం చేశారు.  వీటి అమలుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

 1. వితంతు, వికలాంగ, వృద్ధాప్య, చేనేత తదితర సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేయడం, కొత్తవారిని గుర్తించడం.

 2: ఆరోగ్య వైద్యశిబిరాల నిర్వహించడం. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందజేయడం. అవసరమైన వారికి ఎన్‌టీఆర్ ఆరోగ్య సేవా కార్యక్రమంలో భాగంగా శస్ట్ర చికిత్సలకు సిఫార్సు చేయడం. వయస్సుల వారీగా, రోగాల వారీగా రోగులను గుర్తించడం.

 3. గ్రామాల్లో పశువైద్య శిబిరాలు నిర్వహించడం. కృత్రిమ గర్భధారణ, పశు గ్రాసం పెంచేందుకు భూములు గుర్తించడం తదితరవి.

 4. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా భూ సార పరీక్షలకు శాంపిల్స్ సేకరణ. రైతులకు ఆరోగ్యకార్డులు సరఫరా, జింక్, జిప్సన్, బోరన్ రసాయనాల పంపిణీ,  రైతు మిత్ర సంఘాలు గుర్తించడం, వ్యవసాయ కమిటీ వారానికి రెండు రోజుల పాటు గ్రామాల్లో పంటలను పరిశీలించడం.

 5. బడిలో పిల్లలను గుర్తించడం, డ్రాపౌట్లు లేకుండా చూడడం. వయోజన విద్యా కార్యక్రమాల నిర్వహణ, గ్రామ విద్యా కమిటీలు పాఠశాల హాజరును ఎప్పటికప్పుడు పరిశీలించడం.

 6. ఆవాస ప్రాంతాలలో స్వయం శక్తి సంఘాలను గుర్తించడం. వారికి ఆర్థిక అంశాలపై శిక్షణ అందించడం. సంఘాలను ఆర్థికంగా అప్ గ్రేడ్ చేయడం, పలు కార్యక్రమాల్లో భాగస్వాములు చేయడం.

 7.స్వచ్ఛంధ్రాలో భాగంగా వ్యక్తిగత మరుగుదొడ్లు మం జూరు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ, తాగునీటి వనరుల పరిశీలన, అవసరాలు గుర్తించడం.

 8: నీరు-చెరువు కార్యక్రమంలో భాగంగా నీటి నిల్వల చెరువులు గుర్తించడం, చెక్ డ్యామ్‌ల నిర్మాణం, మరమ్మతులు, చెట్లు నాటడం.

 9. మత్స్యకారులకు బోట్లు, వలలు అందజేయడం, ఉపాధి కల్పన.

 10. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఏడు మిషన్లకు సంబంధించిన కార్యక్రమాలపై ప్రజల్లో ఆవగాహన కల్పించడం, కావాల్సిన శిక్షణ ఇవ్వడం.

 11: వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదుల స్వీకరణ. వాటిని పరిశీలించి అర్హులకు న్యాయం చేయడం.

 పరిశుభ్రతే లక్ష్యం

 శ్రీకాకుళం పాతబస్టాండ్: రాష్ట్రంలోని అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని, ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ అందాలన్నదే ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం లక్ష్యమని సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం మాట్లాడారు. పింఛన్ల పంపిణీ, ప్రజల ఆరోగ్యం, పశువైద్య శిబిరాల నిర్వహణపై దృష్టి సారించాలన్నారు.

 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి రూ. 12 వేలు అందజేస్తామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, డీఆర్‌వో నూర్ భాషా ఖాసిం, ముఖ్యప్రణాళికాధికారి ఎం.శివరామనాయకర్, డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరక్టర్ ఎస్.తనూజారాణి, మెప్మా పీడీ మునికోటి సత్యనారాయణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ గీతాంజలి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top