సమీకరణపై 10 వేల అభ్యంతరాలు


 సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని భూసమీకరణకు సంబంధించి కుప్పలు తెప్పలుగా వచ్చిన అభ్యంతరాలకు సమాధానాలిచ్చేందుకు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ) ఆపసోపాలు పడుతోంది. స్వచ్ఛందంగా భూములిచ్చేవారి అంగీకార పత్రాలతోపాటు భూములిచ్చేందుకు నిరాకరించే రైతుల అభ్యంతర పత్రాలు కూడా భారీగా వచ్చాయి. తొలిదశ భూసమీకరణ ప్రక్రియ ముగిసే నాటికి 7,982 ఎకరాలకు సంబంధించి 10,460 మంది రైతులు అభ్యంతర(9.2) పత్రాలు దాఖలు చేశారు. వాటిలో 70 శాతం భూములకు సంబంధించినవి కాగా మిగిలినవి ఇతర అంశాలకు చెందినవి ఉన్నాయి.


సుమారు ఏడువేల పత్రాలు అభ్యంతరాలు కాగా మిగతావన్నీ సూచనలు, సలహాలు ఉన్నాయి. వాటన్నింటినీ క్షుణ్ణంగా చదివి సీఆర్‌డీఏ చట్టానికి లోబడి సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. ఎక్కువమంది భూములివ్వడం తమకిష్టం లేదని పత్రాల్లో పేర్కొన్నారు. కొందరు పరిహారం పెంచాలని, మరికొందరు తమకున్న భూమిలో కొంత ఇచ్చి కొంత ఉంచుకుంటామని, ఇంకొందరు జరీబు భూములు ఉంచుకుని, మెట్ట భూములు ఇస్తామని 9.2 పత్రాల్లో పేర్కొన్నారు. గ్రామకంఠానికి అవతల తమ ఇళ్లు ఉన్నాయని, వాటిని తొలగిస్తారా? అని కొందరు పత్రాలు దాఖలు చేయగా, గ్రామాలను ఇక్కడే ఉంచుతారా? వేరే చోటుకు తరలిస్తారా?, రోడ్డుపక్కన ఉన్న భూమికి, రోడ్డు అవతల ఉన్న భూమికి ఒకే పరిహారం ఇస్తారా? అని పలువురు పత్రాల్లో పేర్కొన్నారు. భూముల తర్వాత వ్యవసాయాధారిత వర్గాల నుంచి అనేక అభ్యంతరాలు వచ్చాయి.


వీటన్నింటికీ సమాధానాలిచ్చేందుకు సీఆర్‌డీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసమీకరణ జరుగుతున్న తొలిదశలో అంగీకార పత్రాల(9.3)తోపాటు భారీగా వస్తున్న అభ్యంతర పత్రాల(9.2)ను తీసుకోవడానికి అధికారులు నిరాకరించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో తీసుకోకతప్పలేదు. చివరికి 32,469 ఎకరాలకు సంబంధించి 20,510 మంది రైతులు అంగీకారపత్రాలివ్వగా 10,460 మంది అభ్యంతరాల పత్రాలిచ్చారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top