ట్రాఫిక్‌పైనే దృష్టి

ట్రాఫిక్‌పైనే దృష్టి - Sakshi


సిబ్బంది రహిత నియంత్రణ

నైట్ ఆపరేషన్ ఆగలేదు

మోటారు సైకిళ్ల చోరీలను ఉపేక్షించేది లేదు

సింగపూర్ శిక్షణ స్ఫూర్తిదాయకం

విలేకరుల సమావేశంలో సీపీ వెంకటేశ్వరరావు


 

విజయవాడ సిటీ : నగరంలోని ట్రాఫిక్ సమస్యపై వచ్చేవారం నుంచి ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు చెప్పారు. శుక్రవారం సాయంత్రం కమిషనరేట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీసీసీ అశోక్ కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. సిబ్బంది రహిత ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో భాగంగానే రోడ్లపై ట్రాఫిక్ విధులు నిర్వహించే 150 మంది కానిస్టేబుళ్లకు కెమెరాలు ఇచ్చి నిబంధనల ఉల్లంఘనులను గుర్తిస్తామన్నారు. రాంగ్ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్ వంటివి కెమెరాల్లో బంధించి ఈ-చలానా ద్వారా కాంపౌండింగ్ ఫీజు వసూలు చేస్తామని సీపీ తెలిపారు. తద్వారా పోలీసులకు, వాహనదారులకు మధ్య ఘర్షణ వాతావారణం నిలువరించి స్వచ్ఛందంగా ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చేయడమే తమ అభిమతమని పేర్కొన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడిపే వారిని సీనియర్ పోలీస్ అధికారుల సమక్షంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. ఆర్సీ పుస్తకం, డ్రైవింగ్ లెసైన్స్ తనిఖీలు వంటివి అవినీతికి ఆస్కారం లేని రీతిలో పారదర్శకంగా ఉంటాయని సీపీ వివరించారు.



నైట్ ఆపరేషన్ ఆగదు



నైట్ ఆపరేషన్ చేసినప్పుడు అల్లరి గ్యాంగులు, బ్లేడ్‌బ్యాచ్ సభ్యులు కనిపించలేదని సీపీ పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు ఆ పని చేయడం లేదనే ప్రచారంతో తిరిగి తమ కార్యకలాపాలు ప్రారంభించారన్నారు. తాము నైట్ ఆపరేషన్ ఆపలేదని, విధుల నిర్వహణలో భాగంగా రాత్రి గస్తీలు, పెట్రోలింగ్ యథావిధిగానే నిర్వహిస్తున్నామని చెప్పారు. నైట్ ఆపరేషన్ కొనసాగుతుందనే విషయూన్ని గుర్తుంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్ 24 గంటలూ పనిచేస్తుందని, ఏ సమస్య వచ్చినా డయల్ 100కి ఫోన్ చేయాలని సూచించారు.

 

మోటారు సైకిళ్ల చోరీపై నిఘా




సీసీఎస్ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సీపీ పేర్కొన్నారు. గతంలో మాదిరిగా రొటీన్ తనిఖీలు కాకుండా రోజువారీ ప్రాధాన్యతలు నిర్ణయించుకుని నేరస్తుల పట్టివేతకు కృషి చేస్తున్నామన్నారు. వచ్చేవారం నుంచి మోటారు సైకిళ్ల చోరీపై దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. గత మూడేళ్లలో రెండువేల మోటారు సైకిళ్లు చోరీకి గురైతే.. కేవలం 900 మోటారు సైకిళ్లు మాత్రమే స్వాధీనం చేసుకున్నామని, ఇకపై మోటారు సైకిళ్ల దొంగలను ఉపేక్షించేది లేదన్నారు.  ఎప్పుడైనా ఆకస్మిక తనిఖీలు చేపట్టే అవకాశం ఉంద న్నారు. మోటారు సైకిళ్ల యజమానులు రికార్డులు, డ్రైవింగ్ లెసైన్స్ వెంట ఉంచుకోవాలన్నారు.

 

బాధ్యతారాహిత్యమే



ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు ఆయా వ్యక్తుల వృత్తి, ఆదాయ వ్యయాలను విచారించుకోకపోవడం యజమానుల బాధ్యతారాహిత్యంగానే పరిగణించాల్సి ఉంటుందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. నేరస్తులు చిన్నచిన్న ఇళ్లను అద్దెకు తీసుకుంటూ చోరీలు, ఇతర అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇల్లు అద్దె కోసం ఎవరైనా వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇస్తే ఉచితంగానే అద్దెదారుల వివరాలు తెలుసుకుని అందజేస్తామని పేర్కొన్నారు. భవన నిర్మాణం సహా ఇతర విధులకు వేర్వేరు రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకు వచ్చే వారు కూడా పోలీసుల సాయంతో వారి గురించి సమాచారం సేకరించాలని సూచించారు.

 

సింగపూర్ కన్సెల్టెన్సీ సమంజసమే..

 

రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ సంస్థకు మాస్టర్‌ప్లాన్ రూపకల్పన బాధ్యతలు అప్పగించడాన్ని సీపీ వెంకటేశ్వరరావు స్వాగతించారు. సీఆర్‌డీఏ తరఫున ఐదు రోజుల సింగపూర్ శిక్షణకు వెళ్లిన ఆయన అక్కడి విషయాలను వివరిం చారు. పోలీస్ విధివిధానాలు తెలుసుకోవడానికి వెళ్లలేదని, నగర నిర్మాణం, అభివృద్ధి, గృహ నిర్మాణం, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్డు మేనేజ్‌మెంట్ అంశాలపై ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నామన్నారు. దీనిపై అక్కడి ఉన్నతస్థాయి అధికారులు శిక్షణ ఇచ్చారని చెప్పారు. రాజధాని నిర్మాణం, ఆధునిక సిటీ నిర్వహణ వంటి అంశాలపై వారు ఇచ్చిన శిక్షణ ఎంతగానో స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు. పోలీసింగ్ విధివిధానాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం మరోసారి పంపే అవకాశం ఉందన్నారు. సింగపూర్ అభివృద్ధిని పరిగణనలోకి తీసుకునే న వ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ రూపొం దించే పని వారికి అప్పగించడం మంచి నిర్ణయమన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top