
టొరంటో: నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (నాటా), తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ టొరంటో (టీసీఏజీటీ) సంయుక్తాధ్వర్యంలో కెనడాలోని తెలుగువారు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ‘నాటా’ రోజు సమ్మిళితంగా టొరంటో నగరంలో రెండు రోజుల పాటు- అక్టోబర్ 29, 30 తేదీల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆరువందల మంది తెలుగువారు హాజరయ్యారు. ప్రముఖ సామాజిక సేవా కార్యకర్తలు డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాస రెడ్డి (ఎమ్.ఎస్. రెడ్డి), శ్యామా రెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే ఇండియన్ కాన్సలర్ శ్రీమతి డి. చరణదాసి, ‘నాటా’ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ హరనాథ్ పొలిచర్ల, ప్రాంతీయ ఉపాధ్యక్షులు సూర్య బెజవాడ, మిస్సిసౌగ ఈస్ట్ కుక్స్‌విల్లె ప్రావిన్స్ పార్లమెంటు సభ్యుడు దీపికా దామెర్లతో పాటు గవర్నర్ ఆఫ్ టొరంటో లయన్స్ క్లబ్, కెనడియన్ పార్లమెంటు సభ్యులు, పారిశ్రామిక వేత్తలు వెరసి పెక్కు సంఖ్యలో ప్రముఖులు విచ్చేశారు. సంప్రదాయబద్దంగా దీపప్రజ్వలన, జాతీయ గీతాలాపనతో దీపావళి వేడుకలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. టీసీఏజీటీ అధ్యక్షులు రావ్ వాజా అతిథులకు సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎమ్.ఎస్. రెడ్డి మాట్లాడుతూ విజయ సోపానాల గురించి సోదాహరణంగా వివరించారు. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’అన్న ఆర్యోక్తిని తాను ప్రబలంగా విశ్వసిస్తానని చెప్పారు. ప్రపంచంలోని పెద్ద తెలుగు సంస్థల్లో ఒకటైన ‘నాటా’ సేవా కార్యక్రమాలను ఆయన ప్రస్తుతించారు. ఆ తరువాత ‘నాటా’ బోర్డ్ ఆఫ్ డెరైక్టర్ శ్రీమతి శ్యామారెడ్డి మహిళా సాధికారత గురించి మాట్లాడారు. ఆధునిక సమాజంలోమహిళల పాత్రను శ్లాఘించారు. పారిశ్రామికవేత్తగా తన అనుభవాలను సభికులతో పంచుకున్నారు. ఆ తర్వాత డాక్టర్ హరినాథ్ పొలిచర్ల ‘నాటా’ సేవా కార్యక్రమాల గురించి వివరించారు. వచ్చే ఏడాది జూన్/జులై మాసంలో హ్యూస్టన్‌లో నిర్వహించ తలపెట్టిన ప్రథమ ద్వైవార్షిక వేడుకలకు విచ్చేయాలని కోరారు.తదుపరి కెనడాలో తొలి తెలుగు ఎంపీపీగా రికార్డు నెలకొల్పిన దీపికా దామెర్ల తన విజయానికి కారణమైన తెలుగువారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇక భారత్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన సంగీత దర్శకుడు, ప్రముఖ గాయకుడు రఘుకుంచె తన బృందంతో ఆలపించిన సినీగీతాలు ఆహూతులను ఉర్రూతలూగించాయి. థిల్లాన్ డాన్స్ గ్రూప్ (దాసరి పంచలింగం, లక్సీ పంచలింగం, షలవి శివబాలన్, శ్రెయా మోత్కుర్, సిమంత శ్రీధరన్, తరనియ శివరాజా, వర్షిణి తోకల)తో పాటు నృత్యగాయనీ బృందం (వినయ్ రెడ్డి, హన్సిక, రాహుల్ సాతు, సాయి శిరీజ, థిల్లానాతో పాటుగా దేవి, అఖిలా రాచకొండ, తాంధియా, ఆశయ పవెంతన్, ఆత్స్యని సుంతరాజా, కోగిలవాని సురేంద్రన్, క్రిషవి రవెంత్ర, మీనా శతతి, థేషని విజయరత్నం, వినయ్ రెడ్డి, ఈష సత్య తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. అలాగే ఈ సందర్భంగా పన్నెండేళ్ళలోపు చిన్నారుల ‘ఫ్యాన్సీ డ్రెస్ షో’అందరినీ ఆకట్టుకుంది. ఈ ఫ్యాషన్ షో లో మాధవ్ బెజవాడ ప్రథమ బహుమతి, వైష్ణవి ద్వితీయ బహుమతి గెలుచుకున్నారు. అసోసియేషన్ కార్యదర్శి శ్రీధర్ నాగవరపు, కోశాధికారి అసర్ అలీ, సంచాలకులు పుష్ప మైనేని, శ్రీనివాసరావు ఉప్పలపాటి, జ్యోతి బొబ్బిలి, అనిత బెజవాడ ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇక అక్టోబర్ 30న కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన పారిశ్రామిక వైజ్ఞానిక సదస్సుకి ఇదేస్థాయి స్పందన లభించింది. ఈ సదస్సులో ఎమ్‌ఎస్. రెడ్డి తమ అనుభవాలను ఆహూతులతో పంచుకున్నారు.