
చాలా రోజుల కిందట ఒకసారి పింకీ విరానీ రాసిన పుస్తకం ‘‘బిట్టర్ చాక్‌లేట్’’ కొన్ని పేజీలు చదివి, ఆ తర్వాత దానిని చదవడం మరి నా వల్లకాక మానేశాను. భారతీయ సమాజంలో చిన్నారుల మీద కుటుంబా లలో జరిగే లైంగిక హింస ఎంత వికృత రూపంలో ఉందో బొమ్మకట్టి మనముందుంచింది రచయ్రితి. తమలో ఉన్న లోపాలను కప్పిపెట్టుకునే సమాజం మంచి సమాజంగా ఎప్పటికీ పరివర్తన చెందలేదు. లోపాలను గుర్తించి, వాటి గురించి ఆలోచించి... చర్చిం చి మార్పుకోసం ముందడుగు వేయందే ఏ సమాజానికీ మంచి భవిష్యత్తు లేదు. అయితే అందుకోసం సమాజంలోని అన్ని వ్యవస్థలూ కలిసికట్టుగా పనిచేయాలి. అయితే స్త్రీల విషయంలో మన రాజకీయ, న్యాయవ్యవస్థలు ఇంకా పక్షపాత ధోరణితోనే కొనసాగుతున్నాయి.
మొన్న ఢిల్లీలో విద్యార్థిని మీద జరిగిన లైంగిక దాడిని పరిశీలించి చూడండి. ఆమె మీద లైంగిక నేరం చేసి హింసించిన ఆరుగురిలో ఇద్దరు అన్నాతమ్ముడూ కావటం నిర్ఘాంతపరిచే విషయం కాదా? మనం ఇటువంటి నేర ప్రవృత్తిని కలిగిన పిల్లల్ని సమాజం మీదికి వదిలినందుకు వారి కుటుంబాలని సైతం నిలదీసి ప్రశ్నించవలసి ఉంది. తల్లిని అగౌరవపరిచే అలవాటున్న వాతావరణంలో పెరిగే మగపిల్లలు స్త్రీని సమదృష్టితో చూడటం... గౌరవించటం ఎప్పటికీ చేయలేరు.
అందువలన కుటుంబ వాతావరణం మగపిల్లల్ని నేరస్తులుగా మారుస్తున్న ట్లయితే మనం తప్పనిసరిగా వారి తల్లిదండ్రులను తప్పు పట్టాలి. కుటుంబంలో స్త్రీని గౌరవించే చోట ఇటువంటి పెడధోరణులున్న పిల్లలు తయారు కారు. అలాగే విద్యావ్యవస్థ కూడా! వీటిలో రావాల్సిన మార్పులని గురించి తప్పక చర్చలు జరగాలి ఇకనైనా!!
ఢిల్లీ విద్యార్థిని మీద జరిగిన లైంగిక హింస దేశ ప్రజలలోని ముఖ్యంగా యువతలోని ఆగ్రహాన్ని అంతగా బయటకు తీసుకుని రావడం వెనక బలమైన కారణమే ఉంది. దేశ ప్రజలకు తాము నిర్మించుకున్న రాజకీయ, న్యాయవ్యవస్థల మీదా, పోలీసు వ్యవస్థ మీదా క్రమంగా నమ్మకం సన్నగిల్లడం. ఇందుకు ఆ వ్యవస్థలు బాధ్యత వహించవలసి ఉంది. దేశంలో చాలా సందర్భాలలో స్త్రీల మీద లైంగిక హింస జరిగిన కేసుల్లో హింస చేసిన వారు తప్పించుకుని పోయేందుకు ఈ వ్యవస్థలు సహకరించడమే ముఖ్య కారణం.
రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇచ్చి సత్వర న్యాయాన్ని అందించగల న్యాయ స్థానాలని ఏర్పాటు చేయాలి. శిక్షల విషయంలో వాటి తీవ్రతని అనుసరించి శిక్షా కాలాన్ని నిర్ణయించాలి. అందుకు త్వరగా నేర విచారణ జరగాలి. ఇక్కడ పోలీసు, న్యాయవ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలి. కానీ వీరిద్దరూ ఒకరిమీద మరొకరు నెపం పెట్టుకోవడంలో చూపించే చతురతను తమ బాధ్యతలని నిర్వహించడంలో చూపించడం లేదు. కఠినమైన శిక్షలను విధించనిదే నేరస్తులకు భయం ఏర్పడదు. శిక్ష కూడా వీలైనంత త్వరగా అమలుపరచాలి.
70వ దశకంలో ఆదివాసీ బాలిక మధుర మీద మహారాష్ట్ర చంద్రపూర్‌లోని దేశాయ్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక నేరం జరిగింది. అప్పటిదాకా భారతీయ శిక్షాస్మృతిలో ఉన్న ఐపీసీ 376లో మరికొన్ని సెక్షన్లను చేర్చి శిక్షలను పునః పరిశీ లించడమూ ఉన్నత న్యాయస్థానం అప్పుడే చేసింది.
లైంగిక నేరాలకుగానూ ప్రపంచంలోని పలు దేశాలలో నేరం జరిగిన తీరును అనుసరించి 10 నుంచి 18 సంవత్సరాలతో మొదలు పెట్టి జీవిత ఖైదు దాకానూ... కొన్ని సందర్భాలలో అరుదుగానే అయినా మరణశిక్ష సైతం అమలుచేసిన సందర్భాలున్నాయి. భార తీయ శిక్షాస్మృతిలో మరికొన్ని సవరణలు చేయాల్సి ఉన్నప్పుడు చట్టసభలు వాటి విషయంలో చర్చలు జరిపి మార్పులను అమలుచేసేందుకు సంసిద్ధత చూపాలి. అయితే భారత సమాజంలో సగభాగం అయిన స్త్రీలకి సరైన ప్రాతినిధ్యమే లేని మన చట్టసభలలో స్త్రీల సమస్యల మీద నిజాయితీగా చర్చించి చట్టాలలో మార్పు లు తీసుకు రాగల దృష్టిని కలిగినవారు ఎందరున్నారు?
లైంగిక హింస మీద ప్రభుత్వాల ఉదాసీన వైఖరికి, వారు చాలా ఆలస్యంగా స్పందించడానికీ వారు స్త్రీలను రెండవ తరగతి పౌరులుగా పరిగణించడమే ముఖ్యకారణం. మన న్యాయవ్యవస్థలో నేరాంగీకారానికి ఇప్పటికీ వీలులేదు. నేరం చేసినవాడు స్వయంగా తన నేరాన్ని అంగీకరించినా చెల్లదు. అది నిరూపణ జరగాలి. వీటన్నింటికీ మధ్య కాలం గడిచిపోతుంది. బెయిలు మీద నేరస్తుడు తిరిగి సమాజంలోనే తిరుగుతూ ఉండగా హింస పడిన స్త్రీ మాత్రం కుంగిపోతూ నమ్మకం పోగొట్టుకుని బతుకుంది. ఈ పరిస్థితి మారనంత కాలం ఏం మాట్లాడి ఏం లాభం? సంస్కరణలు అమలు జరిగితే తప్ప స్త్రీల లైంగిక హింస విషయంలో నేరస్తులు శిక్షల నుంచి తప్పించుకుంటూనే ఉంటారు.
సనాతన విలువలని వదిలేస్తున్నారు. ఆధునిక విలువలని ఒంటబట్టించుకో వటం లేదు. రెండింటి బరువు భారాలనీ ఆడవాళ్ల మీద పెడుతున్నారు. ఆధునిక స్త్రీని గుర్తించగలిగే మానసిక స్థాయిని మన దేశంలోని మగవారు చాలా మంది ఇవాళ్టికీ కలిగిలేరు. వ్యాపార సరుకుగా సినిమాలో, ఇతర మీడియాలో స్త్రీల వ్యక్తిత్వ విధ్వంసాన్ని చవకబారుగా అమలుచేయడం మన కళ్లముందే చూస్తు న్నాం. ఇవాళ్టి ఆధునిక స్త్రీ చదువులో ఉద్యోగావకాశాలలో పురుషుడిని దాటి ముం దుకు సాగుతున్న దృశ్యం మనముందే ఉంది. ఉద్యోగాల పని వేళలననుసరించి ఆడవాళ్లు కూడా పగలనక రాత్రనక బయటకు వెళ్లవలసిన పరిస్థితిలో ఉన్నారు. వారికి భరోసా ఇవ్వడం సరైన భద్రత కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. తమ బాధ్యతని సరిగా నిర్వర్తించలేని వాళ్లు నెపాన్ని అమ్మాయిల మీదికి నెట్టాలని చూస్తారు. బొత్స సత్యనారాయణ, అభిజిత్ ముఖర్జీల మాటలు అటువంటివే.
స్త్రీల మీద జరిగే నేరాలపట్ల తమ తమ దృక్పథాలను మార్చుకోనిదే మంచి మార్పులు రాలేవు. స్త్రీని తమ సాటి వ్యక్తిగా చూడగలిగిన వ్యక్తిత్వాన్ని మగవాడు పెంపొందించుకునే లాగా సర్వత్రా చర్చలు జరగాలి. కార్యాచరణ జరగాలి. చదువుతో సంబంధం లేకుండా స్త్రీని గౌరవించడాన్ని కుటుంబమూ, సమాజమూ నిత్యజీవితంలో అమలుచేయాలి. అందుకు అనుగుణమైన అన్ని చర్యలనీ అన్ని వ్యవస్థలూ చేపట్టాలి. ఒట్టి సానుభూతి వల్ల ఒరిగేదేం ఉండదు. ఎందరో సంస్కర్తల చేయూతతో సంకెళ్లను తెంచుకుని పురోగమించగలిన స్త్రీలు ఏ కొందరో తిరోగమనశీలురున్నారని ఇనపకచ్చడాల కాలంలోకి మళ్లరు కదా? యువత తమ భవితవ్యం కోసం పోరాడుతోంది. అందుకు మద్దతు అందరూ తెలపాలిప్పుడు.
(లైంగిక హింసతో ప్రాణాలు వదిలిన యువతి ‘నిర్భయ’కి నివాళిగా...)