Saakshi
ఆదివారం :
26/05/2013
పాత సంచికలు | ఈ-పేపర్ | క్లాసిఫైడ్స్ |
 
Digital Marketing:
To Advertise in the site
Contact No:+91 9603462716
digitalmarketing@sakshi.com
Internet Tariff Card
Print Rate Card
sakshipost
sakshitv
 
 
హోం > వివరాలు
మళ్లీ మారిన విచారణ స్థలం
రెండోరోజు కోఠి కార్యాలయంలో జగన్‌ను విచారించిన సీబీఐ
అంతుచిక్కని దర్యాప్తు సంస్థ వైఖరి
న్యాయవాదులకు సమాచారం ఇవ్వకుండానే మార్పు

హైదరాబాద్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విచారించే స్థలాన్ని సీబీఐ అధికారులు మళ్లీ మార్చారు. ఆదివారం చంచల్‌గూడలోని జైళ్లశాఖ డెరైక్టర్ జనరల్ కార్యాలయం ఆవరణలోని ఆఫీసర్స్ మెస్‌లో విచారించిన సంగతి తెలిసిందే. కానీ సోమవారం కోఠి కేంద్రీయ సదన్‌లోని సీబీఐ కార్యాలయంలో జగన్‌ను విచారించారు. పైగా విచారణ స్థలాన్ని మార్చిన విషయం జగన్ తరఫు న్యాయవాదులకు సైతం చివరి నిమిషం వరకూ తెలియజేయకుండా గోప్యంగా ఉంచారు. దీంతో వారు అయోమయానికి గురికావలసి వచ్చింది. అరగంటలో జైలు నుంచి బయటకు తీసుకుని వస్తారనగా కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారించనున్నట్లు భద్రతా విధులను నిర్వర్తించే పోలీసు అధికారుల ద్వారా మీడియాకు తెలిసింది. దీంతో మీడియా ప్రతినిధులు చంచల్‌గూడ నుంచి కోఠికి బయలుదేరారు.

ఉదయం 10.30 గంటలకు జగన్ జైలు ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చారు. అక్కడున్నవారందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ నల్లరంగు బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనంలో ఎక్కి కూర్చున్నారు. పోలీసు ఎస్కార్టుతో సరిగ్గా పావుగంట వ్యవధిలోనే కోఠిలోని సీబీఐ కార్యాలయానికి వాహనాలు చేరుకున్నాయి. కేంద్రీయ సదన్ మూడో అంతస్తులోని సీబీఐ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో జగన్‌మోహన్‌రెడ్డిని విచారించారు. ఉదయం 11.30 గంటల నుంచి భోజన విరామ సమయం వరకు మాత్రమే సీబీఐ జాయింట్ డెరైక్టర్ వీవీ లక్ష్మీనారాయణ విచారణలో పాల్గొన్నారు. సాయంత్రం మూడు గంటల సమయంలో ఆయన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి వెళ్లారు. మిగతా సమయంలో సీబీఐ డీఐజీ హెచ్ వెంకటేష్, డీఎస్పీ ప్రవీణ్‌లు విచారించారు.

విచారణకు పూర్తి సహకారం
మధ్యాహ్నం భోజన విరామ సమయంలో మినహా సాయంత్రం ఐదు గంటల వరకు విచారణ కొనసాగింది. గత నెల 25వ తేదీ నుంచి మూడురోజుల పాటు సీబీఐ జేడీ ఆధ్వర్యంలో జరిగిన విచారణకు జగన్ పూర్తిగా సహకరించారు. అరెస్టు అనంతరం కోర్టు ఆదే శాల మేరకు ఆదివారం నుంచి సీబీఐ కస్టడీ కొనసాగుతోంది. ఈ రెండురోజులు కూడా జగన్ సీబీఐ అధికారులకు పూర్తిగా సహకరించారు. విచారణ ముగిసిన తరువాత సాయంత్రం 5.15 గంటలకు తిరిగి జైలు లోపలికి వెళ్లే సమయంలో కూడా జగన్ అక్కడున్నవారందరికీ నవ్వుతూ అభివాదం చేశారు. జగన్ విచారణను పురస్కరించుకుని పోలీసులు కేంద్రీయ సదన్ ఆవరణలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులను వారి గుర్తింపు కార్డులను పరిశీలించిన తరువాత లోపలికి పంపారు. మీడియా ప్రతినిధులు ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. కేంద్రీయ సదన్‌కు వెనుకవైపు ఉన్న వైద్య విధాన పరిషత్ ప్రధాన ద్వారం వద్ద కూడా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రణాళిక ప్రకారమే..!
జగన్‌మోహన్‌రెడ్డిని న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ సీబీఐ అధికారులు ఆ ఉత్తర్వులను పాటించే పరిస్థితి కనిపించడం లేదు. ఇందుకు సంబంధించి సీబీఐ ఒక ప్రణాళిక ప్రకారమే విచారణ స్థలాలను మారుస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణ ప్రదేశాన్ని సోమవారం ఎందుకు మార్చారో కూడా సీబీఐ అధికారులు వెల్లడించలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు ఉదయం 10.30 గంటలకు జగన్‌మోహన్‌రెడ్డిని విచారణ కోసం సీబీఐ అధికారులు చంచల్‌గూడ నుంచి తరలించాల్సి ఉంది. ఆదివారం నాడు జైళ్లశాఖ డీజీ కార్యాలయంలో విచారించడంతో రెండోరోజు కూడా న్యాయవాదులు అక్కడికే బయలుదేరారు. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో 10.20 గంటల సమయంలో జగన్ తరఫు న్యాయవాదులు సీబీఐ అధికారులకు ఫోన్‌చేశారు. ‘మొదటిరోజు విచారించిన చోటే మళ్లీ విచారిస్తారు కదా...’ అంటూ వాకబు చేశారు. ‘లేదు... కోఠి కేంద్రీయ సదన్‌లోని మా కార్యాలయంలో విచారిస్తాం’ అంటూ ముక్తసరి సమాధానం రావడంతో అవాక్కవడం న్యాయవాదుల వంతైంది. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా విచారణ స్థలాన్ని మార్చడం పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. ఇదిలావుండగా మూడవరోజు ఎక్కడ విచారిస్తారనే విషయాన్ని కూడా సీబీఐ అధికారులు బయటకు పొక్కనీయడంలేదు. దీంతో కోఠి సీబీఐ కార్యాలయంలో విచారిస్తారా? మళ్లీ విచారణ స్థలాన్ని మారుస్తారా? అనే విషయం మంగళవారం ఉదయం 10 గంటల తర్వాతే తెలిసే అవకాశం ఉంది.
  

More Headlines

1
Back to Listing Page
 
Download e-paper
Sakshi Toolbar
 
 
Home | News | Business | Sports | Cinema | Gallery
About Us