Saakshi
గురువారం :
20/06/2013
పాత సంచికలు | ఈ-పేపర్ | క్లాసిఫైడ్స్ |
 
Digital Marketing:
To Advertise in the site
Contact No:+91 9603462716
digitalmarketing@sakshi.com
Internet Tariff Card
Print Rate Card
sakshipost
sakshitv
 
 
హోం > వివరాలు
మీరు రావద్దు ప్లీజ్...
పదేళ్ల రవి సపోటా చెట్టు కింద నిలబడున్నాడు. అతని చేతిలో రెండు పలుగురాళ్లు ఉన్నాయి. వాటిని చేతుల్లో పట్టుకొని ఒకదానికొకటి ‘రప రప రప..’ రాపాడిస్తున్నాడు. మొక్కల కోసమని తవ్విన మట్టిలో దొరికినట్టున్నాయి ఆ రాళ్లు.

రంగు మారిన తెల్లచొక్కా, ఖాకీ నిక్కరు... స్కూల్ నుంచి వచ్చినా ఇంకా యూనిఫామ్‌లోనే ఉన్నాడు. సరైన పోషణ లేకనేమో జుట్టు ఎర్రై ఉంది. దానికి తోడు ఉదయం నుంచి గాలికి కొట్టుకొని కొట్టుకొని చిందరవందరగా అయినట్టుంది.

చూసి చూసి ఎడమచేతిలోని రాయిని కుడిచేతిలోని రాయితో గాట్టిగా కొట్టాడు. ‘చ..క్...’ మని చిన్న సౌండ్. ఆ వెంటనే సన్న సన్న నిప్పురవ్వలు క్షణం పాటు వెలిగి ఆరిపోయాయి. ఆ రాళ్లను ఇంకా ఇంకా వేగంగా రాపిడి చేస్తున్నాడు. నిప్పురవ్వులు ఎగుస్తున్నాయి. ఆ పిల్లవాడు అంత తీక్షణంగా, తదేకదీక్షతో చేస్తున్న చర్యను ఎవరైనా జాగ్రత్తగా గమనిస్తే అదో ఆట కాదని, అతని మస్తిష్కం ఏదో రాపిడికి లోనవుతుందని ఇట్టే కనిపెట్టేస్తారు.

‘‘ఒరేయ్ రవీ ఇంకా ఎంతసేపురా! నేనయితే రెండో రౌండ్ కూడా లాగించేశా! తొందరగా రా రా! లేదంటే నీకు చిన్న ముక్క కూడా మిగలదు. ఇంకా వాళ్లు ఏమేమో ఇస్తున్నరంట’’ అంటూ క్రీమ్ అంటుకున్న చేతిని నాక్కొని ఆ తడిని నిక్కరుకు రుద్దుకొని పరిగెత్తాడు శివ.
రవి కుడిచేతిలోని రాయితో ఎడమచేతిలోని రాయిని ఇంకా గట్టిగా కొట్టాడు... చక్ మన్న సౌండ్, ఆ వెంటనే మరిన్ని నిప్పురవ్వలు ఎర్రగా లేచాయి.

ముందు ప్రహరీ గోడ. మధ్యలో చిన్న ఇనుప గేటు. దాని పక్కనే సపోటా చెట్టు. లోపలికి వెళితే పొడవాటి హాల్, ఆ హాల్ కన్నా ముందు ఆఫీస్‌రూమ్ లాంటి చిన్న గది. దాని గోడ మీద ‘ఆలంబన ఆశ్రమం’ అని రాసి ఉంది. ఆ గదిలో టేబుల్, దానిమీద ఓ కంప్యూటర్, పక్కన ఐరన్‌రాక్‌లో దొంతర్లుగా ఫైళ్లు. గదికి ఆనుకుని హాల్‌లో ఓ వైపు టేబుల్ మీద టీవీ ఉంది. దానిని ఆనుకునే మరో రెండు చిన్నచిన్న గదులు. అందులో వరుసగా నాలుగైదు ఇనప్పెట్టెలు. వాటిల్లో నుంచి కొన్ని బట్టలు బయటకు తొంగిచూస్తున్నాయి.

వాటి మీద మడతపెట్టిన దుప్పట్లు, గొంగళ్లుపడేసి ఉన్నాయి. షెల్ఫుల్లో పుస్తకాలు, కాగితాలు, మూలలకు ఈతాకు చాపచుట్టలు. వాటిలో కొన్ని చాపలు నడుం విరిగి నిలబడలేమన్నట్టుకిందకు వాలిపోయాయి. సాయంత్రం అవడంతో పిల్లలంతా ఆటలు ముగించి వార్డెన్ హుకుంతో పుస్తకాలు పట్టుకొని కూర్చున్నారు. యాభైకిపైగా చిన్నా పెద్ద వయసున్న పిల్లలు వారంతా.

ఇంతలో హాల్ మధ్యలో ఓ టేబుల్‌ను తెచ్చి వేశారు నలుగురు పెద్దపిల్లలు. విషయం ఏదో లోపలి గదుల్లోకి పొక్కినట్టుగా ఉంది. వెంటనే అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.
పిల్లల గోల విని వార్డెన్ వచ్చి, అందర్నీ బుద్ధిగా వచ్చి బయటహాల్‌లో కూర్చోమని చెప్పి వెళ్లాడు.
పిల్లలంతా బిలబిలమని హాల్లోకి వచ్చారు. అప్పటికే పరిచి ఉన్న చాపల మీద ఎవరికి తోచిన దగ్గర వారు కూర్చున్నారు.

టేబుల్ మీద తెల్లటి పెద్ద బాక్స్ పెట్టారు. అందులో ఏముంటుందో వారి చిట్టిబుర్రలకు వెంటనే అర్థమైంది. పెద్ద పిల్లలిద్దరూ బాక్స్‌లోంచి కేక్ తీసి టేబుల్ మీద పెట్టారు జాగ్రత్తగా.
అది చాక్లెట్ కేక్. పైన ‘హ్యాపీ బర్త్‌డే శ్రీను’ అని అందంగా రాసి ఉంది. పక్కన ఉన్న చిన్న డబ్బాలోంచి చిన్న చిన్న క్యాండిల్స్ తీసి కేక్‌మీద అక్కడక్కడక్కడా గుచ్చారు.

వార్డెన్ రూమ్‌లో నుంచి ఓ ఇద్దరు ఆడ, మగ వ్యక్తులు బయటకు వచ్చారు. వారి ముందు పదేళ్ల పిల్లాడు దర్జాగా. వారి ముఖాలు ఎంతో ఆనందంగా ఉన్నాయి.
వార్డెన్ వచ్చి శ్రీనును, అతని అమ్మానాన్నలను పిల్లలకు పరిచయంచేశాడు. ‘‘శ్రీను బర్త్‌డే ఈ రోజు. కేక్ కట్ చేస్తాడు. మీరంతా హ్యాపీ బర్త్‌డేచెప్పి, కేక్ తీసుకొని వెళ్లండి’’.

తలూపారు పిల్లలు.
కొందరు తల్లిదండ్రులు పిల్లలను వెంటబెట్టుకొని ఆశ్రమానికి వస్తుంటారు. వస్తూ వస్తూ చాక్లెట్లు, బిస్కెట్లు, పాత బట్టలు తీసుకువచ్చి తమ పిల్లల చేతుల మీదుగా పంచుతుంటారు. ఇక బర్త్‌డేలయితే సరేసరి. అనాథ పిల్లల మధ్య పుట్టిన రోజు పండగ జరుపుకుంటే తమ పిల్లలకు కాస్తో కూస్తో సేవ నేర్పించినట్టుగా ఉంటుందనేది తల్లిదండ్రుల ఆలోచన.

ఆ ఆలోచనతోనే శ్రీను బర్త్‌డేను ఇంట్లో కాకుండా ఈసారి ఆశ్రమంలో జరిపిస్తున్నారు అతని తల్లీదండ్రి.
చాపల మీద కూర్చున్న పిల్లలందరూ కేక్ ఎప్పుడు కట్ చేస్తారా!అని ఆశగా చూస్తున్నారు.
శ్రీను బుగ్గల్లో గాలిని నింపుకొని వెలుగుతున్న కొవ్వొత్తులను ‘ఉఫ్’మని ఊదాడు. పిల్లలందరూ ‘హ్యాపీ బర్త్ డే టూ యూ’ అని కోరస్‌గా చెబుతూ, చప్పట్లు కొడుతుండగా అతడు కేక్ కట్ చేశాడు.

కట్‌చేసిన కేక్‌ముక్కను ముందుగా తల్లికి, తండ్రికి తినిపించాడు శ్రీను. పిల్లలంతా ఆ దృశ్యాన్ని అబ్బురంగా చూస్తున్నారు.
కేక్‌ను ముక్కలుగా కొసి, పేపర్ ప్లేట్లలో సర్దింది శ్రీను వాళ్లమ్మ. వార్డెన్ కనుసన్నలతో పిల్లలందరూ వరుసగా ఒక్కొక్కొరు వచ్చి శ్రీను చేతులమీదుగా ఆ కేక్ ముక్కలు తీసుకుంటున్నారు.

కాసేపటికి అంతమందిలో రవి లేకపోవడం గమనించాడు వార్డెన్.
అటూ ఇటూ చూసిన వార్డెన్‌కి సపోటా చెట్టు కింద కూర్చుని రాళ్లతో ఆడుకుంటున్న రవి కనిపించాడు. మరోమారు రాళ్లను గట్టిగాకొట్టబోతున్న రవికి వార్డెన్ కేక వినిపించడంతో చెయ్యి బ్యాలెన్స్ తప్పింది. రక్తం బొట బొట కారింది. రాళ్లను వదిలేసి రక్తం రాకుండా వేలిని అదిమిపట్టాడు. వార్డెన్ మరోమారు కేకవేయడంతో తప్పదన్నట్టు లేచి అక్కడికి వచ్చాడు.

అప్పటికే పిల్లలంతా కేక్ తింటున్నారు. కొందరు తినేసి బయటకు వెళ్లిపోయారు.
వార్డెన్ సైగతో టేబుల్ దగ్గరకు వెళ్లాడు రవి.
ఎదురుగా శ్రీను. సూట్, షూస్, జేబుకి పెట్టిన పెద్ద రోజ్, చేతికి ఇంపోర్టెడ్ వాచ్... దర్పంగా ఉన్నాడు. పైగా అటూ ఇటూ అతని అమ్మ నాన్న.

రవికి అక్కడ నిల్చోవడం కంపరంగా ఉంది. వేలికి అయిన గాయం కన్నా ఇది ఎంతో బాధగా ఉంది.
‘ఏరా, అలా నిల్చున్నావ్! తీసుకో!’ అని వార్డెన్ అనడంతో, ఎడమచేతిని ముందుకు చాపాడు రవి.
కేక్ ముక్క ఉన్న పేపర్‌ప్లేట్‌ను రవి చేతిలో పెట్టి ‘హాయ్!’ అన్నాడు శ్రీను.
తిరుగు సమాధానమేమీ ఇవ్వకుండా కేక్ తీసుకొని మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ కేక్ ను చూస్తున్నకొద్దీ రవికి ఏదో తెలియని కసి పుట్టుకొస్తోంది.

రవి దవడ ఎముకలు బిగుసుకున్నాయి.
కోపం, అసహనం ఒక్కసారిగా ముసురుకోగా గోడవైపు తిరిగి... బలంగా కేక్‌ను విసిరేశాడు. అది వెళ్లి గోడకు పేడ ముద్దలా అతుక్కుపోయింది. పేపర్‌ప్లేట్ ఎగిరి కిందపడింది.

రవి చంటిబిడ్డగా ఈ ఆశ్రమానికి చేరుకున్నాడు. ఏ తల్లి ఎందుకు కన్నదో ఎందుకు వదిలించుకున్నదో రవికి తెలియదు. ఎవరు తనను ఈఆశ్రమానికి అప్పజెప్పారో తెలియదు. అక్కడున్న పిల్లలందరూ దాదాపు రవి లాంటి వారే.
రవికి అదంతా ఏమీ బాధనిపించడం లేదు. తన చుట్టూ యాభైకిపైగా అన్నలు, తమ్ముళ్లు, స్నేహితులు ఉన్నారు. కొందరు తనకంటే పెద్దవాళ్లయితే, ఇంకొందరు చిన్నవాళ్లు. రోజంతా వాళ్లతో ఆడుతాడు, పాడుతాడు, కొట్లాడుతాడు, మళ్లీ కలిసిపోతాడు.

ఇదిగో ఎవరైనా వచ్చి ‘మా అబ్బాయి పుట్టినరోజు. ఆశ్రమంలో జరుపుదామని వచ్చాం’ అని వార్డెన్‌తో అన్నారంటే రవి గుండెలో వేయి ఫిరంగులు మోగుతాయి. లక్షలాది సందేహాలు పుట్టుకువస్తాయి. ఉన్నపళంగా వారిని ఆ గేటు అవతలకి తోసేసి, ‘ఎవరైనా లోపలికి వచ్చారా!చచ్చారే!’ అని అరిచి చెప్పాలనిపిస్తుంటుంది.

కాని వార్డెన్... నవ్వుతూ వారిని ఆహ్వానిస్తాడు. అతనికి అడ్డు చెబితే బెల్ట్ తన ఒంటిమీద నాట్యం చేస్తుందని రవికి తెలుసు.
ఆ వచ్చినవాళ్ల అమ్మాయో, అబ్బాయో రాజాల్లా తన ముందే తిరుగుతారు. గర్వంగా చూస్తారు. వారు కేక్ కట్‌చేయడం, అందరూ చప్పట్లు కొట్టడం చేస్తుంటే తనొక్కడు మాత్రం దూరంగా ప్రహరీగోడ దగ్గర ఉన్న సపోటా చెట్టు కింద నిల్చుంటాడు.

తను ఎప్పుడు పుట్టాడో తెలియదు. ఎవరికి పుట్టాడో తెలియదు. తల్లి తనను ఎందుకు వదిలేసిందో.. తండ్రి ఏమయ్యాడో... ఈ ఆశ్రమంలో తనెందుకు ఉండాల్సి వచ్చిందో తెలియదు. బర్త్‌డే పేరుతో వచ్చే వాళ్లంతా వస్తూవస్తూ కేకులు, చాక్లెట్లు, బిస్కెట్లే కాదు తన పుట్టుక వెనకాల దాగున్న దౌర్భాగ్యాన్ని కూడా వెంట తీసుకువస్తారు.

ఆ బర్త్‌డే సంబరం తన పుట్టుకను గుర్తుకు చేస్తుంటే గుండె పగిలేలా లోలోపలే ఏడుస్తాడు. ఆ ఏడుపులో నుంచి కసిపుట్టుకొస్తుంది. చేతులు బిగుసుకుంటాయి. కళ్లు ఎర్రబడతాయి. నిస్సహాయంగా బుగ్గలమీదకుపాకిన కన్నీటి బొట్టు ‘నా పుట్టుకను గుర్తుచేయడానికి మీరు రావద్దు ప్లీజ్’ అని మౌనంగా చెబుతుంటుంది.
(ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆశ్రమానికి వె ళ్లినప్పుడు బయటి వ్యక్తులతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని పదేళ్ల ధీరజ్ గురించి అతని స్నేహితులు చెప్పిన కొన్ని విషయాల ఆధారంగా...)

.................. నిర్మలారెడ్డి
  

More Headlines

Listings అతడు అడవిని జయించాడు Listings కథను వెతికే పుస్తకాలు....
Listings కొత్త పుస్తకాలు Listings దో భిగా జమీన్...
1
Back to Listing Page
 
Download e-paper
Sakshi Toolbar
 
 
Home | News | Business | Sports | Cinema | Gallery
About Us