|
|
|
|
|
|
|
|
|
|
|
|
అడ్డంగా వెళితే
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
‘నిలువు’ దోపిడీ అవుతాం. నిలువు మాత్రమే చూసుకుంటే ‘అడ్డం’గా దొరికిపోతాం. అందుకే, ఒక్కో గడి రాయడం... ఒక్కో ఎత్తు వేయడంతో సమానం. దిగితే, యుద్ధమే. ఛేదించాల్సిన ‘పద’వ్యూహమే. అక్షరాలే మన చతురంగ బలాలు. అవి లేకుంటే పదఘట్టనల కింద నలిగిపోతాం, తెల్ల గదుల్లో తెల్లబోతాం. భాష మీద ఉంటే పట్టు, విజయం చేజిక్కినట్టు. ఆ నలుపూ తెలుపూ గడుల చదరంగం... క్రాస్‌వర్డ్ పజిల్. తెలుగులో పదశోధన, పదవినోదం, గడి-నుడి, పదకేళి, ప్రహేళిక. పేరేదైనాగానీ దాన్ని ప్రచురించని పత్రిక లేదు. సాధించని పాఠకుడు లేడు. పద చదరంగం ఏ సమస్య లేకపోయినా సమస్యే. మజా ఏం ఉంటుంది! బోర్. చిక్కుముడులు విప్పుతుంటేనే చురుకు పుడుతుంది, చురకత్తిలా తయారవుతాం. శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకు ప్రహేళిక అలాగ. పెదాలు బిగబట్టి, భృకుటి ముడివేసి, చూపును లేజర్ అంత తీక్షణంగా మలిచి, ఆలోచనను శూన్యంలో గిరికీలు కొట్టిస్తూ, ధ్యానం చేసినంత ఏకాగ్రతగా, పెన్నుతో గురి చూసి కొడుతున్నట్లుగా ఎవరైనా కనిపిస్తే... సందేహం లేదు, వాళ్లు పదాలతో కుస్తీ పడుతున్నట్టే. అడ్డం ఆరూ నిలువు పదిహేనూ ఏమిటా అని దీర్ఘాలోచనలో ఉన్నట్టే, పదవినోదం పొందుతున్నట్టే. ఎంత పనిలో ఉన్నా... రోజువారీ జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, పదవినోదంలో పదం దొరక్కపోతే పడే ఒత్తిడికి చిత్తుకావడమంటే చాలామందికి ఇష్టం. ఆ జిత్తులమారి ‘ఆధారం’ చిక్కు విప్పడం మరీ మరీ ఇష్టం. పూర్తిచేయగానే కొండెక్కినంత సంబరం. పెద్దల సాయం లేకుండా పూరిస్తే పిన్నలకు కిక్కు. నిఘంటువు అక్కెర రాకుండా పూరించడం పెద్దల టెక్కు. ఒకవేళ జవాబు తెలియకపోతే, తదుపరి వారం వచ్చే సమాధానాలు చూసి, చకచకా గడులన్నీ నింపేసుకోవడం ఓ పిల్ల జ్ఞాపకం. రాని సమాధానాలు చూసి రాసుకుంటే కొత్తపదాలు తెలుస్తాయని పెద్దల అనుభవం. మొత్తానికి పదవినోదం కఠినమైన కొద్దీ భాష మెరుగుపడుతుందన్నది సత్యం. లేదంటే చీకటిని తిమిరం అంటారని ఎవరు చెప్పాలి? చీకట్లో వేసేది బాణం అని ఎలా తెలియాలి? పండగలు, పబ్బాలు, సామెతలు, జాతీయాలు, రచనలు, రాజధానులు, మహామహుల బిరుదులు, వారి ఇంటిపేర్లు, పుట్టిన ఊళ్లు... బోల్డెంత విజ్ఞానం. మహాప్రస్థానం రాసిన మహాకవి... అని శ్రీశ్రీకి ఏదో ఒకచోట ఆధారం ఇస్తే, ఆ కవి ఎవరో, ఆయన రచనేమిటో, ఆయన బిరుదేమిటో తెలిసిపోయినట్టేగా! అంతెందుకు, ఆ మహాకవి శ్రీశ్రీయే పదవినోదాలు ఇష్టంగా పూరించేవారట. లోక్‌సత్తా జయప్రకాశ్ నారాయణ్‌కు ఇప్పటికీ హాబీయేనట. ఇక పిల్లల గురించి చెప్పేదేముంది! చెప్పాలంటే వాళ్లదే ఉంది. ఆదివారం అనుబంధాల్లో వాళ్లను ఆకర్షించేది పదవినోదం కాక ఇంకేముంటుంది? అక్కయ్య కంటేనో, అన్నయ్య కంటేనో ముందు అందుకుని, చకచకా పూర్తిచేసేయడం పెద్ద పందెం. ఎవరు ముందు అందుకుంటే వాళ్లకే తెలుపు గడులను నలుపు చేసే అవకాశం. లేదంటే తిరుగుబాట్లు తప్పవు. పోరుబాటలు ఆగవు. మరోమాట లేకుండా తల్లిదండ్రులు ఇంకో పుస్తకం కొనిపెట్టాల్సిందే. లేదూ ఎలాగోలా నచ్చజెప్పి ఇరు పక్షాలకూ రాజీ కుదర్చాల్సిందే. ఇక పూరించేటప్పుడు చూడాలి! అది కూడా తెలియట్లేదని వెక్కిరించడం. ఆ ప్రశ్నే మనకూ వస్తే ఉడుక్కోవడం. చెప్పొద్దంటున్నా ఆపుకోలేని కుతూహలం. పదం తెలియగానే చిదంబర రహస్యం కనిపెట్టినంత ఉత్సాహం. ఒకరికొకరు చర్చిస్తూ, అందరూ కలిసి పూరించడం మరో అందమైన దృశ్యం. లేదంటే ఏ నాన్నో పూర్తి చేస్తుంటే, భుజాల మీదుగా చూడాల్సి రావడం విపరిణామం. పదవినోదం దగ్గర అందరూ పిల్లలే. తప్పొస్తే ముప్పే ఎంతవారలైనా కాంతాదాసులవునో కాదో తెలియదు గానీ పదవినోద దాసులే. ఆ మధ్య ‘హిందూ’ పత్రిక క్రాస్‌వర్డ్ పజిల్‌లో ‘క్లూస్’ తప్పుగా ముద్రించారు. ఇక చూస్కో! వాళ్ల ‘రీడర్స్ ఎడిటర్’కు ఫోన్లే ఫోన్లట. అందరూ పెద్ద పెద్ద వాళ్లేనట. మా రోజంతా పాడైపోయింది, చికాకు కలిగింది, ఈ రోజు ఏమీ బాగా గడవలేదు... ఇవీ వారు గుప్పించిన విమర్శలు. ఇక అందరిలోకి ఆఖరున ఫోన్ చేసినాయన చెప్పిన సమాధానం... ‘అయ్యా! నా కూతురు పెళ్లి పనులతో తీరికలేనందున ఫోన్ చేయడం కాస్త ఆలస్యమైంది’. ఇదీ క్రాస్‌వర్డ్ పజిల్ ఆకర్షణ. అవి వ్యక్తిగత జీవితంలో ఎలా భాగమయ్యాయో చెప్పడానికే ఈ ఉదాహరణ. అందుకే ఇవి రూపొందించేవాళ్లు జాగ్రత్తగా పదాలు ఎంపిక చేసుకుంటారు. లేదంటే ‘న్యూయార్క్ టైమ్స్’లో జరిగినట్టు జరుగుతుంది. అందులో ఓ రోజు ‘టిల్’ (till = వరకు) పదంతో ఓ ఆధారం ఇచ్చారు. సహజంగా రెండు ఎల్స్ ఉంటాయి. కానీ ఒకే ఎల్‌తో మూడక్షరాల పదంగా క్లూ ఉండింది. అలా ఎలా ఇస్తారంటూ ఒకాయన ఉత్తరం రాశాడు. సాధారణ వ్యవహారంలో ప్రత్యేకించి, పదవినోదాల్లో అలా చెల్లిపోతుందని పత్రిక సమర్థించుకుంది. ఏ నిఘంటువూ అలాంటి పదాన్ని ఆమోదించలేదని నిరూపిస్తూ, ఆయన ఓ పెద్ద నివేదికే ఇచ్చాడు. పండితులు ఆయనతో జత కలిశారు. అంతర్జాతీయ సమస్య అయిపోయింది. మొత్తానికి అలాంటి పదం తిరిగి రాకుండా జాగ్రత్త పడతామని సంపాదకుడు హామీ ఇచ్చాడు. ‘ఇంత చిన్న విషయం మీద అంత రభసా?’ అనిపించొచ్చు. కానీ పాఠకులు పదశోధనను ఎంత పట్టించుకుంటారు, తమ అభిమాన పత్రికలో తప్పులు వస్తే ఎలా స్పందిస్తారు అని చెప్పడానికే ఇదంతా. మరి ఈ పజిల్ ఇవ్వాళ్టిదా? సుమారు నూరేళ్ల చరిత్ర ఉంది.
జర్నలిస్టు సృష్టి ఇరవయ్యో శతాబ్దం ఆరంభానికి ఇంకా టీవీ రాలేదు. పత్రికలే కాలక్షేపం. ఇంటిల్లిపాదికీ వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచేందుకు అవి పోటీపడుతున్నాయి. ఆదివారాలైతే చెప్పనక్కర్లేదు. ఇక పండగ సమయాల్లో ఆ హడావుడి మరీ ఎక్కువ. అలాంటి రోజుల్లో ఓ రోజు...
ఆర్థర్ వైన్ దీర్ఘాలోచనలో పడ్డాడు. ‘న్యూయార్క్ వరల్డ్’ పత్రికలో అతడు పనిచేస్తున్నాడు. అన్ని పత్రికల్లాగే వాళ్లూ ఆదివారం పూట ‘ఫన్’ పేజీ ఇస్తున్నారు. అసలే క్రిస్‌మస్ సీజన్. ఇంకా కొత్తగా పాఠకుల కోసం ఏమివ్వొచ్చు... అన్న ఊహల్లోంచి తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. యురేకా అని అరిచాడో లేదో గానీ, కాగితం, పెన్సిల్ తీసుకొని స్కేలుతో గీతలు కొట్టడం ప్రారంభించాడు. 1913 డిసెంబరు 21 నాడు న్యూయార్క్ వరల్డ్ పాఠకులు ఓ సరికొత్త పజిల్‌ను సాధించడంలో మునిగిపోయారు. వైన్ కూడా ఊహించనంత స్పందన వచ్చింది. వర్డ్-క్రాస్ పజిల్ హాట్ టాపిక్ అయ్యింది. అడ్డం, నిలువులో పదాలు ఒక్కోటి ఖండించుకుంటాయి కాబట్టి, వర్డ్ -క్రాస్. క్రమంగా అది క్రాస్-వర్డ్‌గా మారింది. అటుపై క్రాస్‌వర్డ్ అయ్యింది. మొదట్లో ఆర్థర్ రూపొందించిన పజిల్ డైమండ్ ఆకారంలో ఉండేది. అయితే, ‘కాలం కాగులో కాగిన అక్షరం ఎన్నెన్నో వంకర్లు పోయినట్టు’గా, ఈ పజిల్ తన వంకర్లు పోగొట్టుకొని రూపాన్ని మార్చుకుంది. నెమ్మదిగా దీర్ఘచతురస్రాకారాన్ని, చతురస్రాకారాన్ని సంతరించుకుంది. అమెరికన్ల కాలక్షేపం
న్యూయార్క్ వరల్డ్‌లో ప్రచురితమైన తొలి పదేళ్లదాకా పదవినోదాల జోలికి ఏ పత్రికా పోలేదు. అయితే పాఠకులు దీన్ని విపరీతంగా ఆదరిస్తుండడంతో నెమ్మదిగా ఒక్కొక్కటే ప్రచురించుకుంటూ వెళ్లాయి. 1920 చివరికొచ్చేసరికి అమెరికాలోని అన్ని ప్రధాన పత్రికలు ప్రచురించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. లాస్ ఏంజిల్స్ టైమ్స్, న్యూయార్క్ సన్, వాల్‌స్ట్రీట్ జర్నల్, వాషింగ్‌టన్ పోస్ట్ అన్నింట్లోనూ ఈ విభాగాలు ఏర్పాటైనాయి. ప్రత్యేకంగా వాటికి సంపాదకులను నియమించారు. విచిత్రంగా అన్నింటికంటే చివరగా ప్రచురించింది న్యూయార్క్ టైమ్స్. అయితే లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్టు, నియమ నిబంధనలు ఏర్పరిచిందీ ఇప్పటి ఆధునిక రూపానికి తీసుకొచ్చిందీ ఈ పత్రికే. తొలుత వారానికోసారి ప్రచురించేవీ కాస్త రోజూ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందులో కూడా దశలు. సోమవారం చాలా తేలిక, మంగళవారం తేలిక, బుధ ఓ మోస్తరు... నెమ్మదిగా శుక్ర, శని పుంజుకుని ఆదివారం కఠినమవుతుంది. ఏ రోజు ఎంతసేపట్లో పూర్తిచేశామో చూసుకునేందుకు టైమ్ టేబుల్ షీట్లు వినియోగించుకునేంతగా అందులో మునిగితేలేవారు పాఠకులు. వీటికి థీమ్ జోడించడం వల్ల పాఠకుడికి మరింత విజ్ఞానం. సంగీతం, సినిమా, రచన, ప్రదేశం, సుప్రసిద్ధ వ్యక్తి... ఏ అంశం మీదైనా క్రాస్ వర్డ్ రూపొందుతుంది. ఇవేవీ లేకుండా కలగూరగంప ఎప్పటికీ ఉండనే ఉంది. ఇవి ఎంత ఆదరణ పొందాయంటే దుస్తుల మీద ముద్రించడం ఫ్యాషన్‌గా చలామణీ అయింది. రూప కర్తలకు, వాటి సంపాదకులకు సెలెబ్రిటీ ఇమేజ్ వచ్చింది. ఎలా సాధించాలో కిటుకులు చెప్పే పుస్తకాలు వచ్చాయి. న్యూయార్క్ వరల్డ్ సంపాదకుడికి సెక్రటరీగా పనిచేసి, తర్వాత సంపాదకురాలు అయిన మార్గరేట్ ఫరార్ క్రాస్‌వర్డ్ పజిల్ పేరిట నూరు పుస్తకాల సిరీస్‌ను ప్రచురించింది. వీటి మీద డాక్టరేట్ పేపర్స్ సమర్పించారు. టీవీ షోలు రూపొందించారు. ఎంత వేగంగా సాధిస్తున్నారో చూసి, బహుమతులిచ్చే చాంపియన్‌షిప్పులు నిర్వహిస్తున్నారు. ప్రయాణాల్లో పుస్తకం ముందేసుకునే బదులు, క్రాస్‌వర్డ్ చేయడం మంచి కాలక్షేపం అని భావించడం మొదలైంది. ఇప్పటికీ కనీసం 4 కోట్లమంది ఆమెరికన్లు రోజూ క్రాస్‌వర్డ్ సాధిస్తారని అంచనా. సాధారణ పాఠకుల నుంచి మేధావుల దాకా వ్యాపకం అయింది. అంతెందుకు, మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ ఓ హాబీ ఈ క్రాస్‌వర్డ్స్ పూరించడం. ఇరవయ్యో శతాబ్దపు ఆవిష్కరణల్లో ఒకటిగా గుర్తు చేస్తూ, తొలి క్రాస్‌వర్డ్ జ్ఞాపకార్థం 1998లో అమెరికా ఓ తపాలా స్టాంపు కూడా విడుదల చేసిందంటే చూడండి! అన్ని భాషల్లోకీ...
అమెరికాలో వస్తున్న స్పందన చూసిన లండన్ టైమ్స్ దీన్ని బ్రిటన్‌లో పరిచయం చేసింది. అక్కడి మిగిలిన పత్రికలూ దీన్ని అందిపుచ్చుకున్నాయి. తర్వాత ఐరోపాలోని మిగతా భాషలకూ విస్తరించింది. దేశాలను బట్టి నిర్మాణంలో తేడా ఉన్నా, అత్యధికం వినియోగంలో ఉన్నది చతురస్రాకారపుదే. 9x9, 12-x12, 15-x15, 21x-21, 23-x23, 25-x25... ఇవీ సాధారణంగా గడుల సంఖ్య. ఫ్రాన్స్ పజిల్స్ పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వీళ్లది సాధారణ సైజు 8్ఠ21. ఇటలీవాళ్లదయితే 13్ఠ21. స్పెయిన్‌లో చతురస్రాకారం నియమం లేదు. జపాన్ పదవినోదాల్లో మూలన ఉన్న గడులు తెల్లగా ఉండాలని ఓ నియమం. బ్రిటన్ పత్రికల్లో నల్లగడులు ఎక్కువుంటే సంపాదకులు గగ్గోలు పెట్టేస్తారు. మొత్తం గడుల్లో పదిశాతం అనుమతించినా ఎక్కువే. రెండక్షరాల పదాలను అనుమతించేవి కొన్నీ ఎంత పొడవైన పదాలు వాడితే అంత మజా అనేవి కొన్నీ.కాస్‌వర్డ్ సర్వవ్యాపితం అయి భారత్‌కూ అటు నుంచి తెలుగులోకీ మన పత్రికలోకీ వచ్చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, అక్షరమాల ఉన్న ప్రతీ భాషలోనూ ఈ ప్రహేళిక వస్తోంది. పాఠకుడిని విజ్ఞాన వినోదంలో ముంచెత్తుతోంది. ఇదీ మొదటిది!
ఇప్పుడు మనం చూస్తున్న రూపానికి రావడానికి మానవ పరిణామ దశలోలాగా ఎన్నో మార్పులు చూసింది క్రాస్‌వర్డ్. సుడొకు, కకురో లాంటి అంకెల వినోదాలు కొత్తగా ఆదరణ పొందుతున్నా, నూరేళ్లుగా క్రాస్‌వర్డ్ వన్నె తగ్గలేదు. అంకెల కంటే అక్షరాల్లోనే మ్యాజిక్ ఉందని నిరూపించాడు తొలి క్రాస్‌వర్డ్ పజిల్ రూపొందించిన ఆర్థర్ వైన్ (1871-1945). ఈయన బ్రిటన్ జాతీయుడు. ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లాడు. న్యూయార్క్ వరల్డ్ కోసం మ్యాగజైన్ విభాగంలో పనిచేశాడు. క్రిస్‌మస్ పండక్కి పిల్లల కోసం వినూత్నంగా ఏదైనా చేయమన్న సంపాదకుడి సూచన మేరకు పజిల్ గురించి ఆలోచించాడు. తాను చిన్నప్పుడు ఆడుకున్న మ్యాజిక్ స్క్వేర్ ఆట గుర్తొచ్చింది. దాని స్ఫూర్తితో సరికొత్త పదక్రీడ రూపొందించాడు. అయితే వైన్ గీసిన తొలి పదవినోదం ఇప్పటి ఆకారంలో లేదు. అది వజ్రాకృతిలో ఉంది. అందులో నల్ల గడులు కూడా లేవు. తదనంతరం ఎందరో పజిల్ నిర్వాహకులు, సంపాదకులు చేసుకుంటూ వచ్చిన మార్పులు, చేర్పుల వల్ల చతురస్రాకారపు ఆకృతికి వచ్చింది. ................
సౌష్టవమే అందం
సిమ్మెట్రీలో గొప్ప అందం ఉంది. సీతాకోకచిలుక, తాజ్‌మహల్... ప్రతి నిర్మాణంలోనూ ఈ సౌష్టవ గుణం దాగుంది. మనిషినే చూడండి. అటో కాలు, ఇటో కాలు; అటో చేయి, ఇటో చేయి... అందుకే అందం వచ్చి ఉంటుంది. క్రాస్‌వర్డ్ పజిల్స్ రూపొందించేవాళ్లు ఈ సౌష్టవాకృతిని పాటిస్తుంటారు. అంటే కాగితాన్ని 180 డిగ్రీల కోణంలో తిప్పి చూసినా, నల్లగడులు, తెల్లగడుల ఆకారం మారదన్నమాట. అమెరికాలోని ‘అమెచ్యూర్ క్రాస్‌వర్డ్ పజిల్ లీగ్’ 1924లో జరిపిన సమావేశంలోనే దీన్నో నియమంగా అంగీకరించింది. బహు కఠినమైనవీ ఆసక్తికరమైనవీ ప్రచురిస్తుందని పేరుగాంచిన న్యూయార్క్ టైమ్స్ పత్రిక ప్రచురించే వాటిలో 99 శాతం ఈ సౌష్టవాకృతి నియమాన్ని పాటిస్తాయి. ప్రధాన స్రవంతి ఆంగ్ల పత్రికలన్నీ దీన్నే అనుసరిస్తున్నాయి. తెలుగు పత్రికల్లో మాత్రం ఈ నిర్మాణం కనబడదు. పదజాలం
క్రాస్‌వర్డ్ పజిల్‌కు సంబంధించి చేంతాడంత పదజాలమే ఉంది. నల్లగడిని డార్క్, తెలుపును లైట్ అంటారు. పూరించేవాడు ప్లేయర్, నిర్మించే వ్యక్తి క్రూసివెర్బలిస్ట్. పదేపదే కనిపించే పదాలను క్రాస్‌వర్డీస్ అనీ, ఒకే వరుసలో అన్ని ఆంగ్ల అక్షరాలూ వస్తే ప్యాన్‌గ్రమటిక్ అనీ అంటారు. ఇవన్నీ ఆంగ్ల పత్రికలకే వర్తిస్తాయి. వాటితో పోల్చితే తెలుగులో అంతగా విస్తరించట్టే లెక్క. అయినా, సిల్లీ పాయింట్ తెలియకుండా క్రికెట్ చూడ్డం లేదా? ........................
అత్యధిక పజిల్స్ రికార్డు బ్రిటన్‌కు చెందిన రోజెర్ స్క్వైర్స్ అత్యధిక పదవినోదాలు రూపొందించి గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు ఆయన రూపొందించిన పదవినోదాల సంఖ్య 70,000. మే 2007 నాటికి ఇచ్చిన ఆధారాలు 20 లక్షలు. టైమ్స్, డెయిలీ టెలిగ్రాఫ్, గార్డియన్, ఫైనాన్సియల్ టైమ్స్, ఇండిపెండెంట్ వంటి ప్రతిష్టాత్మక పత్రికలకు ఈయన రూపొందిస్తుంటాడు. సుదీర్ఘమైన పదాన్ని క్లూగా ఇచ్చిన రికార్డు కూడా ఈయనదే. ఆ ఆధారం... వెల్ష్‌లోని ఓ పట్టణం పేరు. అందులోని అక్షరాలు 58. 91,000 గడుల పదశోధన అత్యంత పెద్ద పదవినోదంగా గిన్నిస్ రికార్డుకెక్కిన దాన్ని వింటేజ్ స్పోర్ట్స్ రూపొందించింది. ఆ చార్టును గోడకు తగిలిస్తే ఏడు అడుగుల పొడవుంటుంది. ఇందులో 91,000 గడులున్నాయి. ఆధారాలు 28,000. ఈ ఆధారాల కోసమే 100 పేజీల పుస్తకం ముద్రించారు. రహస్యం... ఆధారం 1944... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ‘ఆపరేషన్ ఓవర్‌లార్డ్’లో భాగంగా ఫ్రాన్స్ మీద దాడికి వెళ్తున్న అమెరికా సైన్యం ఏ రోజు ఎక్కడ దిగిందో డైలీ టెలిగ్రాఫ్ పత్రిక క్రాస్‌వర్డ్ పజిల్‌లో ‘క్లూ’గా వచ్చేదట. ఓ రోజు ఉతాహ్, మరుసటిరోజు ఒమహా... ఇలా. వరుసగా ఆ స్థావరాలు వెల్లడించేసరికి సైనిక అధికారులు తలలు పట్టుకునేవారట. అవి రూపొందించింది లియోనార్డ్ డవే అనే పాఠశాల ఉపాధ్యాయుడు. తర్వాత ఆయన్ని నిర్బంధంలోకి తీసుకుని విచారిస్తే, అది కేవలం కాకతాళీయం అని తేలింది. ........................
నవలల్లోని పాత్రలే ఆధారాలు... దేశంలో అతి ఎక్కువ క్రాస్‌వర్డ్ పజిల్స్ రూపొందించిన ఘనత సాధించారు కర్ణాటకకు చెందిన ఎ.ఎన్.ప్రహ్లాదరావు. బెంగళూరు జలమండలి పీఆర్‌వోగా పనిచేస్తున్న ఈ 57 ఏళ్ల ప్రభుత్వోద్యోగి ఇప్పటివరకూ సుమారు 30,000 పదవినోదాలు నిర్మించానని చెబుతారు. 1984లో ప్రారంభించి, మంగళ, జయచిత్ర, వనిత, కన్నడప్రభ, విజయ కర్ణాటక, సంయుక్త కర్ణాటకలాంటి ఎన్నో కన్నడ దిన, వారపత్రికలకు ఆయన కంట్రిబ్యూట్ చేశారు. కొన్నింటికి ఇప్పటికీ చేస్తున్నారు. జనరల్, సినిమా, క్రైమ్‌తో పాటు ఒక నవలను ఆధారం చేసుకుని కూడా ఆయన పజిల్స్ రూపొందిస్తుంటారు. ‘భైరప్ప, కువెంపు, శివరామ్ కారంత్ లాంటి రచయితల పుస్తకాల ఆధారంగా పజిల్ రూపొందించామనుకోండి, పాఠకుల్లో సాహిత్యాభిలాష పెంచినవాళ్లమవుతాం కదా’ అంటారాయన. కవి, రచయిత కూడా అయిన ప్రహ్లాదరావు తన పదచదరంగాలను 5 పుస్తకాలుగా విడుదల చేశారు. ........... పూడూరి రాజిరెడ్డి
|
|
|
|
|
|
|
|
|
|
|
More Headlines |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|